నువ్వే నా ప్రపంచం.. నా సర్వస్వం: బుమ్రా భార్య భావోద్వేగ పోస్ట్‌ | I Love Doing Life With You: Sanjana Heartfelt Post For Jasprit Bumrah Birthday | Sakshi
Sakshi News home page

నువ్వే నా ప్రపంచం.. నా సర్వస్వం: బుమ్రాకు భార్య సంజనా గణేషన్‌ విషెస్‌

Published Wed, Dec 6 2023 4:22 PM | Last Updated on Wed, Dec 6 2023 6:39 PM

I Love Doing Life With You: Sanjana Heartfelt Post For Jasprit Bumrah Birthday - Sakshi

టీమిండియా పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా పుట్టినరోజు నేడు(డిసెంబరు 6). ఈ సందర్భంగా బుమ్రా సతీమణి, స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ సంజనా గణేషన్‌ భావోద్వేగ పూరిత నోట్‌ షేర్‌ చేసింది. ‘‘నా ప్రపంచం నువ్వే’’ అంటూ భర్త పట్ల ప్రేమను చాటుకుంది.

‘‘మనిద్దరం కలిసి ఉన్నపుడు ప్రతీ సంతోష క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించగలం. అలాగే మనకి బాధ కలిగించే సంఘటనలు ఎదురైనపుడు మరీ అంత కుంగిపోము కూడా!ప్రతీ చిరునవ్వు, ప్రతీ కన్నీటి బందువు, ప్రతీ ఆనందం.. ఇలా అన్ని భావోద్వేగాల్లోనూ నేను నీతోనే ఉంటాను. నీతో జీవితం పంచుకోవడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. నా ప్రపంచానికి పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అని సంజనా... బుమ్రాకు విషెస్‌ తెలియజేసింది. 

ఈ సందర్భంగా భర్త జస్‌ప్రీత్‌, కుమారుడు అంగద్‌తో కలిసి ఉన్న ఫొటోలను సంజనా గణేషన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. కాగా 1993, డిసెంబరు 6న అహ్మదాబాద్‌లో జన్మించాడు జస్‌ప్రీత్‌ బుమ్రా.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ స్టార్‌ పేసర్‌గా పేరొందిన ఈ రైటార్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌.. 2016లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రెండేళ్లకు టెస్టుల్లోనూ బుమ్రా అరంగేట్రం చేశాడు.

తన అద్భుత ఆట తీరుతో అంచెలంచెలుగా ఎదుగుతూ టీమిండియా ప్రధాన పేసర్‌గా స్థానం సుస్థిరం చేసుకున్న బుమ్రా గాయాల కారణంగా పలు కీలక టోర్నీలకు దూరమయ్యాడు. అయితే, ఎప్పటికప్పుడు ఫిట్‌నెస్‌ మెరుగుపరచుకుంటూ జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా రాణిస్తున్నాడు.

ఇక తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటి వరకు 181 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన జస్‌ప్రీత్‌ బుమ్రా 351 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో హ్యాట్రిక్‌ వికెట్లు తీసిన ముగ్గురు భారత బౌలర్లలో ఒకడిగా తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023 తర్వాత సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌తో బుమ్రా మళ్లీ బిజీ కానున్నాడు.

మరోవైపు.. సంజనా గణేషన్‌ స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌గా ఇప్పటికే పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. బుమ్రాను ప్రేమించిన ఆమె.. 2021, మార్చి 15న అతడితో వివాహ బంధంలో అడుగుపెట్టింది. ఇటీవలే ఈ దంపతులకు కుమారుడు అంగద్‌ బుమ్రా జన్మించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement