PC: ICC
ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు లియామ్ లివింగ్‌స్టోన్ ప్రపంచ నంబర్ వన్‌గా అవతరించాడు. ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో సత్తా చాటి.. ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి.. నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు.
అంతేకాదు.. తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా 253 రేటింగ్ పాయింట్లతో లివింగ్‌స్టోన్ నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా స్టార్ మార్కస్ స్టొయినిస్(211 రేటింగ్ పాయింట్లు)ను అగ్రస్థానం నుంచి వెనక్కి నెట్టి.. అతడికి అందనంత ఎత్తులో నిలిచాడు. కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో లివింగ్‌స్టోన్ అదరగొట్టాడు.
ఆసీస్‌తో సిరీస్‌లో అదరగొట్టి
సౌతాంప్టన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాటర్‌గా 37 పరుగులు చేయడంతో పాటు.. 22 పరుగులు మాత్రమే ఇచ్చి.. మూడు వికెట్లు తీసిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. రెండో టీ20లో విశ్వరూపం ప్రదర్శించాడు. కార్డిఫ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 47 బంతుల్లోనే 87 పరుగులు చేసిన లివింగ్‌స్టోన్.. కేవలం 16 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
నంబర్ వన్ బ్యాటర్ అతడే
తద్వారా ఇంగ్లండ్‌ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ సిరీస్‌లో ఆసీస్- ఇంగ్లండ్ చెరో మ్యాచ్ గెలవగా.. మూడో టీ20 వర్షం కారణంగా రద్దైంది. కాగా 2017లో ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన 31 ఏళ్ల లివింగ్‌స్టోన్.. ఇప్పటి వరకు ఒక టెస్టు, 25 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 16, 558, 815 పరుగులు చేయడంతో పాటు.. వన్డేల్లో 17, టీ20లలో 29 వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉంటే.. ఐసీసీ టీ20 బ్యాటర్ల జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ ట్రవిస్ హెడ్ తన టాప్ ర్యాంకును మరింత పదిలం చేసుకోగా.. లివింగ్‌స్టోన్ 17 స్థానాలు మెరుగుపరచుకుని 33వ ర్యాంకు సంపాదించాడు.
బౌలర్ల టాప్-5 యథాతథం
ఇక బౌలర్ల విషయానికొస్తే.. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ నంబర్ వన్‌గా కొనసాగుతుండగా.. వెస్టిండీస్ పేసర్ అకీల్ హొసేన్, అఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, వెస్టిండీస్ బౌలర్ గుడకేశ్ మోటీ, శ్రీలంక వనిందు హసరంగ టాప్-5లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.
అయితే, ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ అన్రిచ్ నోర్జేను వెనక్కినెట్టి ఆరోస్థానానికి చేరుకున్నాడు. కాగా టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియా నుంచి హార్దిక్ పాండ్యా ఒక్కడే టాప్-10(ఏడో స్థానం)లో ఉన్నాడు.
ఐసీసీ తాజా టీ20 ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్- టాప్ 5
1. లియామ్ లివింగ్‌స్టోన్(ఇంగ్లండ్)- 252 రేటింగ్ పాయింట్లు
2. మార్కస్ స్టొయినిస్(ఆస్ట్రేలియా)- 211 రేటింగ్ పాయింట్లు
3. సికందర్ రజా(జింబాబ్వే)- 208 రేటింగ్ పాయింట్లు
4. షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్)- 206 రేటింగ్ పాయింట్లు
5. వనిందు హసరంగ(శ్రీలంక)- 206 రేటింగ్ పాయింట్లు.
చదవండి: నాకంటే నీకే బాగా తెలుసు కదా: కోహ్లికి షాకిచ్చిన గంభీర్!
Comments
Please login to add a commentAdd a comment