ICC: టాప్‌ ర్యాంకు కోల్పోయిన సూర్య.. నంబర్‌ వన్‌ ఎవరంటే? | ICC T20 Rankings Suryakumar Yadav Loses His Top Spot new world no 1 is | Sakshi
Sakshi News home page

ICC: టాప్‌ ర్యాంకు కోల్పోయిన సూర్య.. నంబర్‌ వన్‌ ఎవరంటే?

Published Wed, Jun 26 2024 2:36 PM | Last Updated on Wed, Jun 26 2024 3:01 PM

ICC T20 Rankings Suryakumar Yadav Loses His Top Spot new world no 1 is

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తన అగ్రస్థానం కోల్పోయాడు. దాదాపు ఏడాదిన్నర కాలంగా టాప్‌ ర్యాంకులో కొనసాగుతున్న ఈ ముంబై క్రికెటర్‌ రెండో స్థానానికి పడిపోయాడు.

గత కొంతకాలంగా పొట్టి ఫార్మాట్‌లో నిలకడగా రాణిస్తున్న ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ నంబర్‌ వన్‌ ర్యాంకు సాధించాడు. అయితే, ఈ ఇద్దరి మధ్య కేవలం రెండు రేటింగ్‌ పాయింట్ల తేడా మాత్రమే ఉండటం గమనార్హం.

ఆరంభంలో తడ‘బ్యా’టు 
కాగా టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీ ఆరంభంలో సూర్యకుమార్‌ యాదవ్‌ పరుగులు రాబట్టలేక సతమతమయ్యాడు. ఆ తర్వాత అమెరికా(50 నాటౌట్‌), అఫ్గనిస్తాన్‌(28 బంతుల్లో 53) జట్లపై వరుసగా హాఫ్‌ సెంచరీలతో మెరిశాడు.

ఇక వరల్డ్‌కప్‌ తాజా ఎడిషన్‌లో 33 ఏళ్ల ఈ ముంబై బ్యాటర్‌.. ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 139.25 స్ట్రైక్‌రేటుతో 149 పరుగులు చేశాడు.

అద్భుత ప్రదర్శన
మరోవైపు.. 30 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్‌ ట్రవిస్‌ హెడ్‌ టీ20 ప్రపంచకప్‌-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సూపర్‌-8 మ్యాచ్‌లో టీమిండియాపై అర్థ శతకం(43 బంతుల్లో 76)తో దుమ్ములేపాడు. ఆడిన ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి ఓవరాల్‌గా సగటు 42.50, స్ట్రైక్‌రేటు 158.38తో 255 పరుగులు సాధించాడు.

ఇందులో మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో హెడ్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి అగ్రపీఠం కైవసం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా ఈ టోర్నీలో సెమీస్‌ చేరగా.. ఆస్ట్రేలియా సూపర్‌-8 దశలోనే నిష్క్రమించింది.

ఐసీసీ టీ20 బ్యాటింగ్‌ తాజా ర్యాంకింగ్స్‌- టాప్‌-5 బ్యాటర్లు వీరే
1. ట్రవిస్‌ హెడ్‌(ఆస్ట్రేలియా)- 844 రేటింగ్‌ పాయింట్లు
2. సూర్యకుమార్‌ యాదవ్‌(ఇండియా)- 842 రేటింగ్‌ పాయింట్లు
3. ఫిల్‌ సాల్ట్‌(ఇంగ్లండ్‌)- 816 రేటింగ్‌ పాయింట్లు
4. బాబర్‌ ఆజం(పాకిస్తాన్‌)- 755 రేటింగ్‌ పాయింట్లు
5. మహ్మద్‌ రిజ్వాన్‌(పాకిస్తాన్‌)- 746 రేటింగ్‌ పాయింట్లు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement