ICC ODI World Cup 2023: పుష్కర కాలం తర్వాత వన్డే వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ క్రీడా సంగ్రామం కోసం క్రికెట్ ఆడే దేశాలు ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తుంటాయన్న విషయం తెలిసిందే. అయితే, ఈ మహా ఈవెంట్‌లో టాప్-10 దేశాలకు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఏడాది అక్టోబర్ 5న ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ కోసం ఇప్పటికే పది జట్లు రెడీ అయ్యాయి.
ఆతిథ్య టీమిండియాతో పాటు పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా నేరుగా ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించగా.. క్వాలిఫయర్స్‌లో నెగ్గిన శ్రీలంక, నెదర్లాండ్స్ ఈ జట్లతో చేరనున్నాయి. ఇంకో మూడు నెలల్లో ప్రారంభం కానున్న ఈ క్రికెట్ సమరం కోసం ఆయా జట్లు తమ బలాబలాను బేరీజు వేసుకుని ట్రోఫీని గెలిచే జట్టును రెడీ చేసే పనిలో పడ్డాయి.
ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా
ఇక స్వదేశంలో వరల్డ్‌కప్ జరగడం అనేది భారత్‌కు కొంత కలిసొచ్చే అంశం. అయినప్పటికీ జట్టు కూర్పులో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ బిగ్ టోర్నీలో జట్టు కూర్పు అనేది కీలకం.
ఇప్పటికే కొంతమంది భారత ఆటగాళ్లు ఫిట్‌నెస్ సమస్యతో నెలల తరబడి జట్టుకు దూరమయ్యారు. ఇలాంటి సమయంలో కీలక ఆటగాళ్లను సమన్వయపరుస్తూ మంచి జట్టును ఎంపిక చేయడం అనేది కత్తిమీదసాము లాంటిది. టీమిండియాకు బలాబలాలతో పాటు సమస్యలు కూడా ఉన్నాయి.
భారత జట్టు బలాబలాల విషయానికి వస్తే..
టీమిండియాకు భారీ బ్యాటింగ్ లైనప్‌తో పాటు నాణ్యమైన బౌలర్లు ఉండడం అనేది కలిసొచ్చే అంశం. అందులోనూ స్వదేశంలో టోర్నీ జరుగుతుండడంతో మన బ్యాటర్లు, బౌలర్లు రెచ్చిపోవడం ఖాయం. కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్ లాంటి బ్యాటర్లు మన జట్టుకు ప్రధాన బలం.
బౌలింగ్ విభాగంలో
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, శార్థూల్ ఠాకూర్ వంటి పేసర్లు, అశ్విన్, యజువేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లు కూడా ఉన్నారు. అలాగే టాప్‌క్లాస్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, హర్దిక్ పాండ్యా అందుబాటులో ఉండనే ఉన్నారు. అటు కొంతమంది యంగ్ ప్లేయర్స్ సైతం జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్ అదరగొట్టిన రింకూ సింగ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ లాంటి వాళ్లు కూడా వన్డే జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రధాన సమస్యలు..
భారత జట్టు ప్రధాన సమస్యలలో ఒకటి కీలక ఆటగాళ్లు కొంత కాలంగా గాయాలతో సతమతమవుతుండడం. ముఖ్యంగా టీమిండియా బౌలింగ్ విభాగానికి వెన్నుముకలాంటి జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమై నెలలు గడుస్తున్నాయి. అతడు త్వరలోనే జట్టుకు అందుబాటులోకి వస్తాడని చెబుతున్నప్పటికీ బుమ్రా తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడంపై అతడి పునరాగమనం అనేది ఆధారపడి ఉంది.
ఇక భారత్‌ను మెగా టోర్నీలలో వెంటాడే ప్రధాన సమస్యల్లో రెండోది గ్రూపు స్టేజీలతో బాగా ఆడి.. సెమీస్, ఫైనల్స్‌లో బోల్తా పడడం. ముఖ్యంగా ప్రధాన ఆటగాళ్లు డూ ఆర్ డై మ్యాచ్‌లలో చేతులెత్తేయడం అనేది భారత్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. 2015, 2019లలో జరిగిన ప్రపంచకప్‌లలో ఇలాగే టీమిండియా సెమీ ఫైనల్స్‌లలోనే ఇంటిదారి పట్టింది. ఈ వీక్‌నెస్‌ను కూడా రోహిత్ సేన అదిగమించాల్సి ఉంటుంది. అప్పుడే మరోసారి ట్రోఫీని ముద్దాడే అవకాశం దక్కుతుంది.
జట్టు కూర్పు..
జట్టుకూర్పులో బ్యాటర్లు ఎంత కీలకమో బౌలింగ్ విభాగం కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉండాలి. అదే సమయంలో నాణ్యమైన ఆల్‌రౌండర్లు జట్టులో ఉండడం లాభిస్తుంది. ఇలా జట్టు సమతూకంగా ఉన్నప్పుడే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
భారత జట్టు విషయానికి వస్తే.. సారథి రోహిత్ శర్మ, రన్‌మెషిన్ విరాట్ కోహ్లి, యంగ్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్, హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా జట్టులో ఉండాలి. ఇక బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, శార్థూల్ ఠాకూర్ వంటి పేసర్లు, యజువేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లు కూడా ఉండాలి.
చదవండి: Test Match: విఫలమైన సూర్యకుమార్ యాదవ్.. 8 పరుగులకే అవుట్..
Comments
Please login to add a commentAdd a comment