ఇండోర్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా టీమిండియాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌లో ఉపయోగించిన పిచ్‌పై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆది నుంచి స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్‌పై 30 వికెట్లు కేవలం రెండురోజుల్లోనే కూలాయి. ఇందులో 26 వికెట్లు ఇరుజట్ల స్పిన్నర్లు తీయగా.. మిగతా నాలుగు వికెట్లు మాత్రమే పేసర్ల ఖాతాలోకి వెళ్లాయి.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఇండోర్ పిచ్‌పై సీరియస్ అయింది. ఆస్ట్రేలియా, టీమిండియా మూడో టెస్టుకు ఉపయోగించిన ఇండోర్ పిచ్‌ను అత్యంత చెత్తదని ఐసీసీ పేర్కొంది. పిచ్‌ను మరి నాసిరకంగా తయారు చేశారని.. అందుకే హోల్కర్ స్టేడియానికి మూడు డీ-మెరిట్ పాయింట్లు విధిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. టెస్టుకు ఉపయోగించిన పిచ్‌పై ఐసీసీ పిచ్ అండ్ ఔట్‌ఫీల్డ్ మానిటరింగ్ ప్రక్రియ తర్వాత వచ్చిన ఫలితం ఆధారంగా ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన క్రిస్ బ్రాడ్ ఇరుజట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్‌లతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది.
''పిచ్ చాలా డ్రైగా ఉంది. కనీసం బ్యాట్, బంతికి బ్యాలెన్స్ లేకుండా ఉంది. స్పిన్నర్లకు అనుకూలంగా ప్రారంభమయినప్పటికి క్రమంగా బౌన్స్ వస్తుందన్నారు. కానీ ఆ ప్రక్రియ మ్యాచ్‌లో ఎక్కడా జరగలేదు. ఎంతసేపు పిచ్ స్పిన్నర్లకు అనుకూలించిందే తప్ప సీమర్లకు కాస్త కూడా మేలు చేయలేదు. బంతి కనీసం బౌన్స్ కూడా కాలేదు. క్యురేటర్ పిచ్‌ను మరీ నాసిరకంగా తయారు చేశారు'' అంటూ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఐసీసీకి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.
నివేదికను పరిశీలించిన ఐసీసీ పిచ్ అండ్ ఔట్‌ఫీల్డ్ మానిటరింగ్ ప్రాసెస్ ఇండోర్ పిచ్‌కు మూడు డీ-మెరిట్ పాయింట్లు కోత విధించింది. నివేదికను బీసీసీఐకి ఫార్వర్డ్ చేసింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే 14 రోజుల లోపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అప్పీల్ చేసుకోవచ్చు. '' ఐదు అంతకంటే ఎక్కువ డీ-మెరిట్ పాయింట్లు వస్తే స్టేడియంపై నిషేధం పడుతుంది. కానీ నివేదిక ప్రకారం హోల్కర్ స్టేడియానికి మూడు డీ-మెరిట్ పాయింట్లు విధించాం. మరోసారి ఇలాంటి సీన్ రిపీట్ అయితే మాత్రం ఐదేళ్ల పాటు స్టేడియంపై నిషేధం పడే అవకాశం ఉందని'' ఐసీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment