ఆసీస్‌తో భారత్‌ తొలి టెస్టు.. పిచ్‌ క్యూరేటర్‌ కీలక వ్యాఖ్యలు | Is There Snake Cracks On Perth Test Pitch Chief Curator Makes Big Revelation | Sakshi
Sakshi News home page

ఆసీస్‌తో టీమిండియా తొలి టెస్టు.. పిచ్‌ క్యూరేటర్‌ కీలక వ్యాఖ్యలు

Published Wed, Nov 20 2024 7:54 PM | Last Updated on Wed, Nov 20 2024 8:13 PM

 Is There Snake Cracks On Perth Test Pitch Chief Curator Makes Big Revelation

టీమిండియా- ఆస్ట్రేలియా తొలి టెస్టు నేపథ్యంలో వెస్టర్న్‌ ఆస్ట్రేలియన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం(WACA) చీఫ్‌ క్యూరేటర్‌ ఇసాక్‌ మెక్‌డొనాల్డ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. పెర్త్‌లో అకాల వర్షాల వల్ల.. పిచ్‌ తయారీపై ప్రభావం పడిందన్నాడు. వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు సంభవించినా పిచ్‌పై పెద్దగా పగుళ్లు ఉండబోవని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

ఈ నేపథ్యంలో.. పెర్త్‌ టెస్టులో సీమర్లకే వికెట్‌ అనుకూలంగా ఉంటుందని మెక్‌డొనాల్డ్‌ సంకేతాలు ఇచ్చాడు. కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఇందులో భాగంగా పెర్త్‌ స్టేడియం తొలి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.

పిచ్‌ క్యూరేటర్‌ కీలక వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో పిచ్‌ క్యూరేటర్‌ ఇసాక్‌ మెక్‌డొనాల్డ్‌ మాట్లాడుతూ.. ‘‘నిజం చెప్పాలంటే.. ఈసారి ఇది పెర్త్‌ సంప్రదాయక టెస్టు పిచ్‌లా ఉండకపోవచ్చు. వర్షం వల్ల కవర్లు కప్పి ఉంచిన పరిస్థితుల్లో పిచ్‌ తయారు చేయడం కుదరలేదు. అయితే, తర్వాత అంతా సర్దుకుంది.

పరిస్థితి ఇంతకంటే దిగజారుతుందని అనుకోను. వికెట్‌ పచ్చిగానే ఉంటే బౌన్స్‌లోనూ వైవిధ్యం చూడవచ్చు. కానీ.. వాతావరణం మారి పగుళ్లు ఏర్పడితే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇప్పటికి పేస్‌, బౌన్స్‌ బాగానే ఉంది’’ అని పేర్కొన్నాడు. ఇక టాస్‌ గెలిచిన కెప్టెన్‌ తొలుత ఏం చేయాలని ప్రశ్నించగా.. ‘‘నాకు చెల్లించే మొత్తం.. ఈ విషయంపై కామెంట్‌ చేసేందుకు సరిపోదు’’ అని కొంటెగా సమాధానమిచ్చాడు.

జస్‌ప్రీత్‌ బుమ్రా  కెప్టెన్సీలో
కాగా శుక్రవారం నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌ మొదలుకానుంది. పెర్త్‌లో జరిగే తొలి టెస్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరంగా ఉండగా.. జస్‌ప్రీత్‌ బుమ్రా భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ చేతివేలి గాయం కారణంగా పెర్త్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు.

ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో సిరీస్‌లో కనీసం నాలుగు గెలిస్తేనే టీమిండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 ఫైనల్‌కు చేరుకుంటుంది. కాగా నవంబరు 22 నుంచి జనవరి ఏడు వరకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనతో బిజీగా గడుపనుంది. పెర్త్‌, అడిలైడ్‌, బ్రిస్బేన్‌, మెల్‌బోర్న్‌, సిడ్నీ ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు వేదికలు.

చదవండి: ప్రపంచంలోని ప్రతి జట్టుకు ఇలాంటి ఆల్‌రౌండర్‌ అవసరం: టీమిండియా కోచ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement