
రోహిత్ శర్మ- అశ్విన్ (PC: X)
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. పెర్త్ టెస్టు సమయంలోనే అశూ ఈ నిర్ణయం తీసుకున్నాడని.. అయితే, తాను నచ్చచెప్పడం వల్ల ఇప్పటిదాకా ఆగాడని తెలిపాడు. అశ్విన్‌ను మ్యాచ్ విన్నర్‌గా అభివర్ణించిన రోహిత్.. ఇకపై అతడు జట్టులో లేని స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నాడు.
తొలి టెస్టులో దక్కని చోటు
టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. తొలి టెస్టు పెర్త్‌లో జరుగగా.. రెండో టెస్టుకు అడిలైడ్ వేదికైంది. ఇక తొలి టెస్టులో అశూను పక్కనపెట్టిన టీమిండియా మేనేజ్‌మెంట్.. స్పిన్నర్ కోటాలో వాషింగ్టన్ సుందర్‌ను ఆడించింది.
మూడో టెస్టులోనూ మొండిచేయి
ఇక రెండో టెస్టు తుదిజట్టులో ఈ చెన్నై ప్లేయర్‌కు చోటు దక్కినా.. పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. అడిలైడ్‌లో జరిగిన ఈ పింక్ బాల్ మ్యాచ్‌లో అశ్విన్ 18 ఓవర్లు బౌలింగ్ చేసి 53 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే, బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టులో అశూ స్థానాన్ని రవీంద్ర జడేజాతో భర్తీ చేశారు.
అశ్విన్ స్పష్టతతో ఉన్నాడు
గబ్బా ఆతిథ్యమిచ్చిన ఈ టెస్టు డ్రాగా ముగియగా.. మ్యాచ్ అనంతరం అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రెస్‌మీట్‌లో కూర్చున్న అశూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. ఈ విషయం గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘అశ్విన్ తన నిర్ణయం పట్ల పూర్తి స్పష్టతతో ఉన్నాడు.
పెర్త్ టెస్టు తర్వాతే రిటైర్ అవ్వాలని భావించాడు. తుదిజట్టు కూర్పు విషయంలో మేనేజ్‌మెంట్ ఎలా ఆలోచిస్తుందో అతడికి తెలుసు. కాంబినేషన్లపై కూడా అతడికి అవగాహన ఉంది. నిజానికి మేము ఆస్ట్రేలియాలో అడుగుపెట్టే సమయానికి అసలు స్పిన్నర్‌ను ఆడిస్తామో లేదో తెలియని పరిస్థితి.
పరిస్థితులకు తగ్గట్లుగా ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేసుకోవాలని భావించాం. అయితే, నేను పెర్త్‌కు చేరుకున్నపుడే అశూ నాతో రిటైర్మెంట్ గురించి చర్చించాడు. అయితే, కనీసం పింక్ బాల్ టెస్టు వరకైనా తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కోరాను.
నా అవసరం లేనపుడు.. నేనెందుకు ఉండాలి?
‘ఒకవేళ ఈ సిరీస్‌లో నా అవసరం లేకపోతే.. నేను జట్టుతో కొనసాగడం కూడా దండగ. గుడ్ బై చెప్పడమే సరైంది’ అని అశూ అన్నాడు. ఇక మెల్‌బోర్న్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు.
స్పిన్నర్‌ను ఆడించే విషయంపై స్పష్టత లేదు. అందుకే తన నిర్ణయాన్ని గౌరవించాలని భావించాం’’ అని పేర్కొన్నాడు. అశ్విన్ బిగ్ మ్యాచ్ విన్నర్ అన్న రోహిత్ శర్మ.. అతడితో కలిసి ఆడిన క్షణాలు తనకు గుర్తుండిపోతాయని తెలిపాడు.
చెరో విజయంతో
కాగా ఆసీస్‌తో తొలి టెస్టుకు రోహిత్ స్థానంలో బుమ్రా సారథ్యం వహించగా.. రెండో టెస్టు నుంచి రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు. ఇక బుమ్రా కెప్టెన్సీలో పెర్త్‌లో గెలిచిన భారత జట్టు.. రోహిత్ నాయకత్వంలో పింక్ బాల్ టెస్టు ఓడిపోయింది. మూడో టెస్టు డ్రా కావడంతో ఇరుజట్లు ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్నాయి. మిగిలిన రెండు టెస్టులు మెల్‌బోర్న్, సిడ్నీలలో జరుగుతాయి.
చదవండి: వర్షం వల్లే డ్రా.. లేదంటే గెలుపు మాదే.. ఆ ఇద్దరు అద్భుతం: కమిన్స్
#Ashwin has announced his retirement from all forms of international cricket!
With 765 wickets across formats, he bows out as one of the greatest spinners of all time. Go well, @ashwinravi99 ! 🙌 pic.twitter.com/alfjOj4IDm— Star Sports (@StarSportsIndia) December 18, 2024