చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని (PC: IPL/BCCI)
ఐపీఎల్-2024 మినీ వేలానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో గెలుపు గుర్రాలను సొంతం చేసుకునేందుకు పది ఫ్రాంఛైజీలు తమ ప్రణాళికలతో సిద్ధమైపోయాయి. దుబాయ్ వేదికగా మంగళవారం జరుగనున్న ఆక్షన్‌లో గుజరాత్ టైటాన్స్ రూ. 38.15 కోట్ల మేర ఖాళీగా ఉన్న పర్సుతో బరిలోకి దిగనుండగా.. లక్నో సూపర్ జెయింట్స్ అత్యల్పంగా 13.15 కోట్లు కలిగి ఉండి ఆరు ఖాళీలను పూర్తి చేసుకోవాలని భావిస్తోంది.
మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పర్సులో రూ. 31.4 కోట్ల రూపాయలు మిగిలి ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ పర్సులో రూ. 28.95 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్ పర్సులో రూ. 32.7 కోట్లు, ముంబై ఇండియన్స్ ఖాతాలో రూ. 17.75 కోట్లు, పంజాబ్ కింగ్స్ ఖాతాలో రూ. 29.1 కోట్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఖాతాలో రూ. 23.25 కోట్లు, రాజస్తాన్ రాయల్స్ పర్సులో రూ. 14.5 కోట్లు , సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్సులో రూ. 34 కోట్లు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రాడ్ హాగ్ సీఎస్‌కే గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2024 వేలంలో చెన్నై యాజమాన్యం ఇలాంటి వ్యూహాలు అనుసరిస్తే బాగుంటుందని పలు సూచనలు చేశాడు. మనీశ్ పాండే, హర్షల్ పటేల్‌లను కొనుక్కుంటే సీఎస్‌కేకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
ఈ మేరకు.. ‘‘ఆర్సీబీతో పోటీ పడి మరీ సీఎస్‌కే హర్షల్ పటేల్‌ను దక్కించుకునే అవకాశం ఉంది. చెన్నై వికెట్ మీద హర్షల్ అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఒకవేళ వాళ్లు మనీష్ పాండే.. డారిల్ మిచెల్ లేదంటే రచిన్ రవీంద్రలలో ఒకరు.. హర్షల్ పటేల్‌లను కూడా కూడా కొనుక్కుంటే.. పాయింట్ల పట్టికలో కచ్చితంగా టాప్-3లో ఉంటుంది.
ప్రస్తుతం సీఎస్‌కేకు మిడిలార్డర్‌లో రాణించగల భారత బ్యాటర్ అవసరం ఉంది. మనీశ్ పాండే ఆ లోటు భర్తీ చేయగలడు. కేవలం బ్యాటర్ మాత్రమే కాదు.. అతడొక మంచి ఫీల్డర్ కూడా! అయితే, ఇప్పటి వరకు తనలోని అత్యుత్తమ ఆటగాడిని బయటపెట్టలేదు.
ఈసారి సీఎస్‌కే గనుక అతడికి అవకాశం ఇస్తే.. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో కచ్చితంగా తనను తాను మరోసారి నిరూపించుకోగలడు. ఒకవేళ మనీశ్ పాండే మిడిలార్డర్‌లో సరైన బ్యాటర్ కాదనుకుంటే సీఎస్‌కే.. డారిల్ మిచెల్ వైపు చూసే అవకాశం ఉంది.
లేదంటే.. రచిన్ రవీంద్రకు పెద్ద పీట వేసే అవకాశం ఉంటుంది’’ అని బ్రాడ్ హాగ్ యూట్యూబ్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రిటైర్ కావడంతో మిడిలార్డర్‌లో అతడి స్థానాన్ని సరైన ఆటగాడితో భర్తీ చేసే దిశగా సీఎస్‌కే ప్రణాళికలు రచిస్తోంది.
చదవండి: IPL 2024: అందుకే కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు.. పాండ్యావైపు మొగ్గు!? గావస్కర్ చెప్పిందిదే..
Comments
Please login to add a commentAdd a comment