అబుదాబీ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2025లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ మరో విజయం సాధించింది. నిన్న (జనవరి 21) జరిగిన మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ అబుదాబీ నైట్‌రైడర్స్‌పై 28 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఎంఐ ఎమిరేట్స్ (6 పాయింట్లు) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 5 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో డెజర్ట్ వైపర్స్ (8 పాయింట్లు) టాప్ ప్లేస్‌లో ఉండగా.. అబుదాబీ నైట్‌రైడర్స్ (4) మూడో స్థానంలో, దుబాయ్ క్యాపిటల్స్ (4), షార్జా వారియర్జ్ (4), గల్ఫ్ జెయింట్స్ (2) వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి.
రొమారియో షెపర్డ్ ఊచకోత
తొలుత బ్యాటింగ్ చేసిన ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కెప్టెన్ నికోలస్ పూరన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పూరన్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేశాడు. ఓపెనర్లు కుసాల్ పెరీరా (20 బంతుల్లో 23; 5 ఫోర్లు), ముహమ్మద్ వసీం (35 బంతుల్లో 38; ఫోర్, 3 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
ఇన్నింగ్స్ చివర్లో రొమారియో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. ఐదు బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. అంతకుముందు ఓవర్‌లోనూ షెపర్డ్ రెండు బౌండరీలు బాదాడు. షెపర్డ్ ఊచకోత దెబ్బకు ఎంఐ ఎమిరేట్స్ ప్రత్యర్థి ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచింది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో గత మ్యాచ్ సెంచరీ హీరో టామ్ బాంటన్ (9), కీరన్ పోలార్డ్ (5), మౌస్లీ (6) నిరాశపరిచారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో అలీ ఖాన్, జేసన్ హోల్డర్ తలో రెండు, ఇబ్రార్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టారు.
187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్‌కు ఓ మోస్తరు ఆరంభం లభించింది. ఓపెనర్ కైల్ మేయర్స్ (14 బంతుల్లో 22; 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ ఆండ్రియస్ గౌస్ (34 బంతుల్లో 34; 2 ఫోర్లు, సిక్స్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఇన్నింగ్స్ మధ్యలో నైట్‌రైడర్స్ తడబడింది. జో క్లార్క్ (3), కైల్ పెప్పర్ (5), అలీషాన్ షరాఫు (4), లారీ ఇవాన్స్ (7) వెంటవెంటనే ఔటయ్యారు.
ఈ దశలో బరిలోకి దిగిన ఆండ్రీ రసెల్ (23 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) నైట్‌రైడర్స్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో రసెల్ ఏమీ చేయలేకపోయాడు. చివరి వరుస బ్యాటర్లు సునీల్ నరైన్ 13, డేవిడ్ విల్లే 1, జేసన్ హోల్డర్ 6 పరుగులు చేసి ఔటయ్యారు. నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది. ఎమిరేట్స్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, రొమారియో షెపర్డ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అకీల్ హొసేన్, ఫజల్ హక్ ఫారూకీ, వకార్ సలామ్‌కిల్, జహూర్ ఖాన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment