India Vs Australia 4th Test: India Break Australia Record Check Here All Records - Sakshi
Sakshi News home page

Ind vs Aus- Ahmedabad Test: ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా! ఇంకా మరెన్నో..

Published Mon, Mar 13 2023 10:38 AM | Last Updated on Mon, Mar 13 2023 10:57 AM

Ind vs Aus 4th Test Day 4: India Break Australia Record Check All These - Sakshi

India Vs Australia 4th Test Day 4 Records: నాలుగో టెస్టులో నాలుగో రోజు నాలుగో శతకం నమోదైన విషయం తెలిసిందే. ఒక టెస్టులో నాలుగు సెంచరీలు కొత్తేం కాదు... కానీ ఈ ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’లో మాత్రం ఇది గొప్ప విశేషం. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన మూడు టెస్టులు కూడా మూడో రోజుల్లోనే ముగిశాయి. స్పిన్నర్లు తిప్పేసిన ఆ మ్యాచ్‌ల్లో బ్యాటర్లు విలవిలలాడారు.

గత మ్యాచుల్ని శాసించిన బౌలర్లపై ఇరు జట్ల బ్యాటర్లు సెంచరీలతో విరుచుకుపడ్డారు. మరి టీమిండియాకు అనుకూలంగా మారిన నాలుగో రోజు ఆటలో విశేషాలు, నమోదైన ప్రధాన రికార్డులన్నీ ఒకేచోట చూసేద్దామా?!

1205 రోజుల తర్వాత... 
భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి... సుదీర్ఘ టెస్టు సెంచరీ నిరీక్షణకు తెరదించాడు. ఆఖరి టెస్టులో మూడంకెల స్కోరు ముచ్చట తీర్చుకున్నాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 289/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆదివారం ఆట ప్రారంభించిన భారత్‌కు జడేజా (84 బంతుల్లో 44; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రూపంలో గట్టిదెబ్బే తగిలింది. బ్యాటింగ్‌కు కలిసొచ్చే పిచ్‌పై కోహ్లికి జతయిన ఆంధ్ర క్రికెటర్‌ శ్రీకర్‌ భరత్‌ (44; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) జతయ్యాడు.

‘రన్‌ మెషిన్‌’ అండతో భరత్‌ భారీ సిక్సర్లతో అలరించాడు. 363/4 వద్ద లంచ్‌కు వెళ్లొచ్చాక ఎంతో ఓపిగ్గా ఆడిన కోహ్లి 241 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 2019లో నవంబర్‌ 23న క్రికెట్‌ మక్కా ఈడెన్‌ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌పై కోహ్లి 27వ టెస్ట్‌ శతకం సాధించాడు. మళ్లీ 43 టెస్టుల తర్వాత భారత గడ్డపైనే 28వ సెంచరీ చేసి 1205 రోజుల నిరీక్షణకు ముగింపు పలికాడు.

ఐదో వికెట్‌కు 84 పరుగులు జోడించాక లయన్‌ బౌలింగ్‌లో భరత్‌... హ్యాండ్స్‌కాంబ్‌ చేతికి చిక్కాడు. అనంతరం అక్షర్‌ పటేల్‌ కూడా పట్టుదలతో ఆడటంతో ఆస్ట్రేలియాకు కంగారు తప్పలేదు. ఇద్దరి జోడీ కుదరడంతో భారత్‌ భారీస్కోరుకు బాటపడింది. మూడో సెషన్‌లో టీమిండియా 500 మార్క్‌ను అందుకోగా, కోహ్లి 150 పరుగులు పూర్తయ్యాయి. కాసేపటికే అక్షర్‌ 95 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు.

అక్షర్‌ను స్టార్క్‌ బౌల్డ్‌ చేయడంతో ఆరో వికెట్‌కు 162 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత కాసేపటికే భారత్‌ 571 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆడిన ఆసీస్‌ ఆట నిలిచే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 3 పరుగులు చేసింది.

నాలుగో రోజు ప్రధాన రికార్డులు
75: టీమిండియా స్టార్‌, రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో 75వ సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో అతడికి ఇది 28వ శతకం.

భారత గడ్డపై లియోన్‌ చరిత్ర
భారత గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన విదేశీ జట్టు బౌలర్‌గా నాథన్‌ లయన్‌ గుర్తింపు పొందాడు. భారత్‌లో 11 టెస్టులు ఆడిన లయన్‌ 56 వికెట్లు పడగొట్టాడు. డెరిక్‌ అండర్‌వుడ్‌ (ఇంగ్లండ్‌; 16 టెస్టుల్లో 54 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును లయన్‌ బద్దలు కొట్టాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ కొట్టిన సిక్స్‌లు. 
10: ఆస్ట్రేలియాపై ఓ టెస్ట్‌ ఇన్నింగ్స్‌లో భారత్‌ కొట్టిన అత్యధిక సిక్స్‌లు ఇవే. 1986లో ముంబైలో, 2013లో చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ల్లో భారత్‌ ఎనిమిది చొప్పున సిక్స్‌లు కొట్టింది.  

మూడో జట్టుగా భారత్‌
ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో తొలి ఆరు వికెట్లకు 50 అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేసిన మూడో జట్టుగా భారత్‌ నిలిచింది. గతంలో ఆస్ట్రేలియా (1960లో వెస్టిండీస్‌పై), పాకిస్తాన్‌ (2015లో బంగ్లాదేశ్‌పై) ఈ ఘనత సాధించాయి.  

ఆస్ట్రేలియా రికార్డు బద్దలు
నరేంద్ర మోదీ స్టేడియంలో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా ఆస్ట్రేలియా 480 పరుగులతో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

అయితే, నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగా టీమిండియా ఆసీస్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో  571 పరుగులు సాధించిన భారత్‌.. పర్యాటక జట్టు పేరిట ఉన్న ఘనతను కనుమరుగు చేసింది.  

అయ్యర్‌ అవుట్‌! 
భారత  మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ నాలుగో రోజు బ్యాటింగ్‌కు దిగలేదు. వెన్నునొప్పితో బాధపడిన అతనికి స్కానింగ్‌ కూడా తీశారు. ముందు జాగ్రత్తగా జట్టు మేనేజ్‌మెంట్‌ అతన్ని ఆడించలేదు. మూడో రోజు ఆటలోనే అతనికి నొప్పి మొదలైనట్లు తెలిసింది. గాయం తీవ్రత దృష్ట్యా అతను ఈ నెల 17 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి.   

చదవండి: Virat Kohli: ఎవరికీ అందనంత ఎత్తులో! ఇక కోహ్లి సాధించాల్సింది అదొక్కటే
Virat Kohli 75th Century: కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌.. ఆ ఇద్దరు దిగ్గజాల తర్వాత కోహ్లికే సాధ్యమైంది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement