
Ravichandran Ashwin: టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్.. టెస్ట్ క్రికెట్‌లో అత్యంత అరుదైన రికార్డుకు అతి చేరువలో ఉన్నాడు. చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో హాఫ్ సెంచరీ (58) సాధించిన అశ్విన్.. ఇదే ఇన్నింగ్స్‌లో మరో 11 పరుగులు చేసి ఉంటే, టెస్ట్ క్రికెట్‌లో 3000 పరుగులు, 400 వికెట్లు తీసిన ఆరో ఆల్‌రౌండర్‌గా రికార్డుల్లోకెక్కేవాడు.
ప్రస్తుతం అశ్విన్ 87 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 27.17 సగటున 2989 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. యాష్ ఖాతాలో 442 టెస్ట్ వికెట్లు ఉన్నాయి. అశ్విన్‌కు ముందు టెస్ట్‌ల్లో 3000 పరుగులు, 400 వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో కపిల్ దేవ్ (5248 పరుగులు, 434 వికెట్లు), షాన్ పొలాక్ (3781, 421), స్టువర్ట్ బ్రాడ్ (3550, 566), షేన్ వార్న్ (3154, 708), రిచర్డ్ హ్యాడ్లీ (3124, 431) ఉన్నారు.
బంగ్లాతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా అశ్విన్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 8వ స్థానంలో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన భారత ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజాను (12) అధిగమించి, కపిల్ దేవ్ (27) తర్వాతి స్థానానికి చేరాడు. ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్లలో కోహ్లి (8075), పుజారా (6882), రోహిత్ శర్మ (3137) తర్వాత అశ్విన్‌వే అత్యధిక టెస్ట్ పరుగులు కావడం మరో విశేషం.
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ (4/26), మహ్మద్ సిరాజ్ (3/14), ఉమేశ్ యాదవ్ (1/33) ధాటికి బంగ్లా ప్లేయర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 271 పరుగుల వెనుకంజలో ఉంది.
అంతకుముందు భారత్.. తమ తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకే ఆలౌటైంది. పుజారా (90), శ్రేయస్ అయ్యర్ (86), అశ్విన్ (58) అర్ధసెంచరీలతో రాణించగా.. పంత్ (46), కుల్దీప్ యాదవ్ (40) పర్వాలేదనిపించారు. ఆఖర్లో ఉమేశ్ యాదవ్ (15 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.