56 ఏళ్ల కిందటి చెత్త రికార్డును బద్దలు కొట్టిన బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ | IND VS BAN: Zakir Hasan Breaks 56 Year Old Embarrassing Record With 24 Ball Duck Against India In Kanpur Test | Sakshi
Sakshi News home page

56 ఏళ్ల కిందటి చెత్త రికార్డును బద్దలు కొట్టిన బంగ్లాదేశ్‌ బ్యాటర్‌

Published Fri, Sep 27 2024 8:31 PM | Last Updated on Sat, Sep 28 2024 7:08 AM

IND VS BAN: Zakir Hasan Breaks 56 Year Old Embarrassing Record With 24 Ball Duck Against India In Kanpur Test

కాన్పూర్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ జాకిర్‌ హసన్‌ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 24 బంతులు ఎదుర్కొన్న జాకిర్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. టెస్ట్‌ల్లో భారత్‌కు వ్యతిరేకంగా ఇన్ని ఎక్కువ బంతులు ఆడి డకౌటైన తొలి బ్యాటర్‌ జకీరే. 

56 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా ఆటగాడు ఇయాన్‌ ఛాపెల్‌ సిడ్నీ టెస్ట్‌లో 22 బంతులు ఎదుర్కొని డకౌటయ్యాడు. ఆతర్వాత 1986లో స్టీవ్‌ వా (21 బంతుల్లో), 2017లో షాన్‌ మార్ష్‌ (21 బంతుల్లో), 2021 కెమరూన్‌ గ్రీన్‌ (21 బంతుల్లో) భారత్‌పై టెస్ట్‌ల్లో అత్యధిక బంతులు ఎదుర్కొని డకౌట్‌లుగా వెనుదిరిగారు. తాజా ప్రదర్శనలతో జాకిర్‌.. ఇయాన్‌ ఛాపెల్‌ పేరిట ఉన్న చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

బంగ్లాదేశ్‌ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక బంతులు ఎదుర్కొని డకౌటైన రికార్డు మంజురుల్‌ ఇస్లాం పేరిట ఉంది. 2002లో శ్రీలంకపై ఇస్లాం 41 బంతులు ఎదుర్కొని డకౌటయ్యాడు. ఆతర్వాత 2007లో రజిన్‌ సలేహ్‌ అదే శ్రీలంకపై 29 బంతుల్లో డకౌటయ్యాడు. వీరి తర్వాత అఫ్తాబ్‌ అహ్మద్‌ (న్యూజిలాండ్‌పై 25 బంతుల్లో డకౌట్‌), జకీర్‌ హసన్‌ (భారత్‌పై 24 బంతుల్లో డకౌట్‌) అత్యధిక బంతులు ఎదుర్కొని డకౌట్‌లు అయిన వారిలో ఉన్నారు.

కాగా, భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా అర్దాంతరంగా ముగిసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. జకీర్‌ హసన్‌ (0), షద్మాన్‌ ఇస్లాం (24), నజ్ముల్‌ హసన్‌ షాంటో (31) ఔట్‌ కాగా.. మొమినుల్‌ హక్‌ (40), ముష్ఫికర్‌ రహీం (6) క్రీజ్‌లో ఉన్నారు. 

భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్‌కు ఓ వికెట్‌ దక్కింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌ ప్రారంభం నుంచి వెలుతురు లేమి, వర్షం కారణంగా పలు మార్లు అంతరాయాలు కలిగాయి. 35 ఓవర్ల తర్వాత మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేశారు.

చదవండి: కౌన్‌ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌కు సంబంధించి రూ. 50 లక్షల ప్రశ్న

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement