318 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో ఒకదశలో ఇంగ్లండ్ స్కోరు 135/0. ఆపై చేతిలో 10 వికెట్లు... ఓవర్‌కు 5 పరుగులు చేసినా చాలు. జట్టు గెలుపు ఖాయమనిపించింది. అయితే ఈ స్థితిలో భారత బౌలర్లు ఒక్కసారిగా చెలరేగారు. 41 పరుగుల వ్యవధిలో 5 ప్రధాన వికెట్లు తీసి మ్యాచ్‌ను మనవైపు తిప్పేశారు. తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ప్రసిధ్ కృష్ణతో పాటు శార్దుల్ ఠాకూర్ ఒక్కసారిగా చెలరేగి జట్టును గెలుపు దిశగా నడిపించారు. అంతకుముందు ధావన్, కోహ్లి, రాహుల్‌లతోపాటు వన్డేల్లో అరంగేట్రం చేసిన కృనాల్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ భారత్‌కు భారీ స్కోరు అందించగా... ఈ సవాల్‌ను ఛేదించలేక ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ చతికిలపడింది.
పుణే: ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజ వేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 66 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శిఖర్ ధావన్ (106 బంతుల్లో 98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేజార్చుకోగా... కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కృనాల్ పాండ్యా (31 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి (60 బంతుల్లో 56; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం ఇంగ్లండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. బెయిర్‌స్టో (66 బంతుల్లో 94; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా, జేసన్ రాయ్ (35 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ప్రసిధ్ కృష్ణకు 4, శార్దుల్‌కు 3 వికెట్లు దక్కాయి. రెండో వన్డే శుక్రవారం జరుగుతుంది.
కోహ్లి అర్ధ సెంచరీ
ఇంగ్లండ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆరంభంలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (42 బంతుల్లో 28; 4 ఫోర్లు), ధావన్ జాగ్రత్తగా ఆడారు. స్టోక్స్ చక్కటి బంతితో రోహిత్‌ను అవుట్ చేసి 64 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. ధావన్, కోహ్లి జత కలిశాక స్కోరు వేగం అందుకుంది. సరిగ్గా 50 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే కోహ్లి వెనుదిరిగాడు. మరోవైపు 5 బంతుల వ్యవధిలో 3 ఫోర్లు కొట్టి ధావన్ జోరు కొనసాగించగా... అయ్యర్ (6) విఫలమయ్యాడు. అయితే స్టోక్స్ బౌలింగ్‌లో ధావన్ మిడ్ వికెట్‌లో క్యాచ్ ఇచ్చి శతకం చేజార్చుకోగా, హార్దిక్ (1) ఎక్కువసేపు నిలవలేదు.
మెరుపు బ్యాటింగ్
రాహుల్, కృనాల్‌ల ఆరో వికెట్ భాగస్వామ్యం భారత్ స్కోరు 300 దాటేలా చేసింది. వీరిద్దరు జత కలిసే సమయానికి జట్టు స్కోరు 40.3 ఓవర్లలో 205 కాగా... మిగిలిన 9.3 ఓవర్లలో టి20 తరహాలో ఆడుతూ 112 పరుగులు జత చేశారు. స్యామ్ కరన్ ఓవర్లో కృనాల్ మూడు ఫోర్లు బాదగా, వుడ్ ఓవర్లో వీరిద్దరు 2 సిక్సర్లు, ఫోర్ సహా మొత్తం 21 పరుగులు రాబట్టారు. 26 బంతుల్లో కృనాల్... 39 బంతుల్లో రాహుల్ అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు.
ఓపెనర్లు చెలరేగాక...
ఇంగ్లండ్ ఓపెనర్ల జోరు చూస్తే భారత ఓటమి ఖాయమనిపించింది. రాయ్, బెయిర్‌స్టో ఓవర్‌కు ఏకంగా 9.5 రన్‌రేట్‌తో పరుగులు సాధించారు. ప్రసిధ్ వేసిన ఒక ఓవర్లో బెయిర్‌స్టో 2 సిక్సర్లు, 2 ఫోర్లు బాదడంతో 22 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత కృనాల్ ఓవర్లో రాయ్ 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. ఫలితంగా 10 ఓవర్లలోనే స్కోరు 89 పరుగులకు చేరింది. కుల్దీప్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టి 40 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న బెయిర్‌స్టో కృనాల్ తర్వాతి ఓవర్లో మళ్లీ వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. ఎట్టకేలకు ప్రసిధ్ ఈ జోడీ ని విడదీశాడు. అంతే... అప్పటినుంచి ఇంగ్లండ్ పతనం వేగంగా సాగింది. ప్రసిధ్ తర్వాతి ఓవర్లో స్టోక్స్ (1) అవుట్ కాగా, భారీ షాట్‌కు ప్రయత్నించి బెయిర్‌స్టో సెంచరీ అవకాశం కోల్పోయాడు. శార్దుల్ ఒకే ఓవర్లో మోర్గాన్, బట్లర్‌లను అవుట్ చేసిన తర్వాత ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) బట్లర్ (బి) స్టోక్స్ 28; ధావన్ (సి) మోర్గాన్ (బి) స్టోక్స్ 98; కోహ్లి (సి) అలీ (బి) వుడ్ 56; అయ్యర్ (సి) (సబ్) లివింగ్‌స్టోన్ (బి) వుడ్ 6; రాహుల్ (నాటౌట్) 62; హార్దిక్ (సి) బెయిర్‌స్టో (బి) స్టోక్స్ 1; కృనాల్ (నాటౌట్) 58; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 317.
వికెట్ల పతనం: 1–64, 2–169, 3–187, 4–197, 5–205. బౌలింగ్: వుడ్ 10–1– 75–2, స్యామ్ కరన్ 10–1–48–0, టామ్ కరన్ 10–0–63–0, స్టోక్స్ 8–1–34–3, రషీద్ 9–0–66–0, అలీ 3–0–28–0.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) (సబ్) సూర్యకుమార్ (బి) ప్రసిధ్ 46; బెయిర్‌స్టో (సి) కుల్దీప్ (బి) శార్దుల్ 94; స్టోక్స్ (సి) (సబ్) గిల్ (బి) ప్రసిధ్ 1; మోర్గాన్ (సి) రాహుల్ (బి) శార్దుల్ 22; బట్లర్ (ఎల్బీ) (బి) శార్దుల్ 2; బిల్లింగ్స్ (సి) కోహ్లి (బి) ప్రసిధ్ 18; అలీ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 30; స్యామ్ కరన్ (సి) (సబ్) గిల్ (బి) కృనాల్ 12; టామ్ కరన్ (సి) భువనేశ్వర్ (బి) ప్రసిధ్ 11; రషీద్ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 0; వుడ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (42.1 ఓవర్లలో ఆలౌట్) 251.
వికెట్ల పతనం: 1–135, 2–137, 3–169, 4–175, 5–176, 6–217, 7–237, 8–239, 9–241, 10–251. బౌలింగ్: భువనేశ్వర్ 9–0–30–2, ప్రసిధ్ 8.1–1–54–4, శార్దుల్ 6–0–37–3, కృనాల్ 10–0–59–1, కుల్దీప్ 9–0–68–0.
►కెరీర్ తొలి వన్డేలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (4/54) నమోదు చేసిన భారత బౌలర్‌గా ప్రసిధ్ కృష్ణ నిలిచాడు. అరంగేట్ర మ్యాచ్‌లో భారత బౌలర్ 4 వికెట్లు తీయడం ఇదే మొదటిసారి.
►తొమ్మిదేళ్ల తర్వాత ఓ అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో అన్నదమ్ములైన రెండు జోడీలు (హార్దిక్, కృనాల్; టామ్ కరన్, స్యామ్ కరన్) తుది జట్టులో ఆడాయి. 2012లో యూఏఈ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన జరిగిన మూడు వన్డేలలో (మైక్ హస్సీ, డేవిడ్ హస్సీ; కమ్రాన్ అక్మల్, ఉమర్ అక్మల్) రెండు జోడీలు బరిలోకి దిగాయి.
కృనాల్ భావోద్వేగం
భారత్ తరఫున 18 టి20లు ఆడిన తర్వాత వన్డేల్లో అరంగేట్రం చేసిన కృనాల్ పాండ్యా... కెరీర్ తొలి ఇన్నింగ్స్‌లోనే వేగవంతమైన అర్ధ సెంచరీ (26 బంతుల్లో) చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. గత జనవరిలో కన్నుమూసిన తన తండ్రికి ఈ ఇన్నింగ్స్‌ను అంకితమిచ్చిన కృనాల్, ఇంటర్వ్యూ సమయంలో తన భావోద్వేగాలను ఆపుకోలేక కంటతడి పెట్టాడు. వెంటనే సోదరుడు హార్దిక్ దగ్గరకు తీసుకొని అతడిని ఓదార్చాల్సి వచ్చింది.
రోహిత్ , అయ్యర్‌లకు గాయాలు
తొలి వన్డేలో ఇద్దరు భారత ఆటగాళ్లు గాయపడ్డారు. వుడ్ వేసిన బంతి రోహిత్ కుడి మోచేతికి బలంగా తాకింది. నొప్పికి రెండుసార్లు మైదానంలోనే చికిత్స చేయించుకొని ఆట కొనసాగించిన అతను ఆ తర్వాత ఫీల్డింగ్‌కు రాలేదు. ఆ తర్వాత ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బంతిని ఆపే క్రమంలో శ్రేయస్ అయ్యర్ భుజానికి బలంగా దెబ్బ తగిలింది. వెంటనే మైదానం వీడిన అతడిని స్కానింగ్ కోసం పంపించారు. గాయం తీవ్రత దృష్ట్యా అయ్యర్ తదుపరి మ్యాచ్‌ల్లో బరిలోకి దిగేది అనుమానమే. ఫీల్డింగ్‌లో గాయపడిన ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ కూడా చేతికి నాలుగు కుట్లతో బ్యాటింగ్‌కు దిగాడు.
Comments
Please login to add a commentAdd a comment