
లండన్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకునేలా కనిపిస్తుంది. త్వరలో ప్రారంభం కాబోయే ఇంగ్లండ్ సిరీస్‌లో ఇషాంత్ స్థానంలో సిరాజ్‌కు తుది జట్టులో అవకాశం కల్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో పేసర్లకు అనుకూలించే పిచ్‌పై ఇషాంత్ పూర్తిగా తేలిపోయాడని, మూడు వికెట్లు పడగొట్టినా అది అతని స్థాయికి తగ్గ ప్రదర్శన కాదని జట్టు యాజమాన్యం అభిప్రాయపడుతుంది.
100 టెస్టుల అనుభవం ఉన్న ఇషాంత్ ఇప్పటికీ కొత్త కుర్రాడిలాగే కనిపిస్తున్నాడని, అతడి బౌలింగ్‌ను పరిశీలిస్తే అన్ని టెస్టులు ఆడిన అనుభవం కనిపించడం లేదని విమర్శకులు చురకలంటిస్తున్నారు. దీంతో అతనికి ప్రత్యామ్నాయమైన సిరాజ్‌ను ఖచ్చితంగా తుది జట్టులోకి తీసుకోవాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో టెస్ట్ కెరీర్ ప్రారంభించిన సిరాజ్.. అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొట్టాడు. సిరీస్ ప్రారంభానికి ముందు తండ్రి మరణించినా.. ఆ బాధను దిగమింగుకుని మరీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
మూడు టెస్టుల్లో 13 వికెట్లు తీసి.. సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ముఖ్యంగా బ్రిస్బేన్‌లో జరిగిన చివరి టెస్ట్‌లో 5 వికెట్లు పడగొట్టిన సిరాజ్.. టీమిండియా చారిత్రక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. కాగా, సిరాజ్ ఇప్పటి వరకూ 5 టెస్ట్ మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఇంగ్లండ్ సిరీస్ నిమిత్తం టీమిండియా తుది జట్టులో భారీ మార్పులు- చేర్పులు జరిగేలా కనిపిస్తున్నాయి. గాయపడిన ఓపెనర్ గిల్ స్థానంలో మయాంక్ లేదా కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. అలాగే, జడేజాను పక్కకు పెట్టి విహారిని ఆడించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.