భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటే... సిరాజ్ టాప్ లేపాడు. హార్దిక్ పాండ్యా మిడిలార్డర్‌ను కట్టడి చేశాడు. బ్యాటింగ్ పిచ్‌పై ఆతిథ్య జట్టు 259 పరుగులకే ఆలౌట్! ఇక్కడిదాకా బాగానే ఉంది. కానీ ఛేదన మొదలవగానే బ్యాటింగ్ కష్టాలు ఎదురయ్యాయి. భారత టాపార్డర్ (రోహిత్ 17, ధావన్ 1, కోహ్లి 17) చేసిన పరుగులు 35. విజయంపై ఆశల్లేని ఈ దశలో రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా భాగస్వామ్యం భారత్‌ను గెలుపు మలుపు తిప్పింది. పంత్ అజేయ శతకం సిరీస్ విజయాన్నిచ్చింది.
మాంచెస్టర్: వన్డే సిరీస్ కూడా 2–1తో భారత్ చేతికే చిక్కింది. మూడో వన్డేలో రోహిత్ శర్మ బృందం ఐదు వికెట్లతో ఇంగ్లండ్‌పై నెగ్గింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 259 పరుగుల వద్ద ఆలౌటైంది. బట్లర్ (80 బంతుల్లో 60; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), జేసన్ రాయ్ (31 బంతుల్లో 41; 7 ఫోర్లు) రాణించారు.
హార్దిక్ పాండ్యా (4/24) వన్డే కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేయగా... చహల్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు. అనంతరం భారత్ 42.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసి గెలిచింది. రిషభ్ పంత్ (113 బంతుల్లో 125 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) గెలిపించేదాకా క్రీజులోనే నిలిచాడు. హార్దిక్ పాండ్యా (55 బంతుల్లో 71; 10 ఫోర్లు) ధాటిగా ఆడాడు. పంత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ... హార్దిక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
రాణించిన బట్లర్, రాయ్
వరుస బౌండరీలతో మొదలైన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు ఆదిలోనే సిరాజ్ అడ్డుకట్ట వేశాడు. షమీ తొలి ఓవర్లోనే రాయ్ 3 ఫోర్లు బాదాడు. రెండో ఓవర్ వేసిన సిరాజ్ పరుగైన ఇవ్వకుండా బెయిర్‌స్టో (0), రూట్ (0)లను డకౌట్ చేశాడు. దీంతో రాయ్, స్టోక్స్ (29 బంతుల్లో 27; 4 ఫోర్లు) అడపాదడపా బౌండరీలతో స్కోరు పెంచారు.
అయితే హార్దిక్ వీరిద్దరిని స్వల్ప వ్యవధిలో పెవిలియన్ పంపాడు. మొయిన్ అలీ (44 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అండతో కెప్టెన్ బట్లర్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం లివింగ్‌స్టోన్ (31 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఓవర్టన్ (33 బంతుల్లో 33; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగ్గా ఆడటంతో ఇంగ్లండ్ పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది.
పంత్ వీరోచితం
ఓపెనర్లు ధావన్ (1), రోహిత్ (17) సహా కోహ్లి (17)లను రీస్ టాప్లీ పడగొట్టేశాడు. భారత్ స్కోరు 38/3. సూర్యకుమార్ (16) కూడా తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. 16.2 ఓవర్లలో 72 పరుగులకే కీలకమైన 4 వికెట్లు కూలాయి. ఇంకా బోలెడు ఓవర్లున్నా... పెద్ద లక్ష్యం... కానీ చేతిలో ఉన్న 6 వికెట్లలో బ్యాటర్స్ ముగ్గురే! ఇక గెలుపే కష్టమనుకున్న దశలో నింపాదిగా ఆడుతున్న పంత్‌కు జతయిన హార్దిక్ ధాటిగా ఆడాడు.
ఈ క్రమంలోనే పాండ్యా 43 బంతుల్లో, పంత్ 71 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. ఐదో వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో స్కోరు 200 దాటింది. కాసేపటికే పాండ్యా అవుటైనా... జడేజా (7 నాటౌట్) అండతో 106 బంతుల్లో (10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించిన పంత్... విల్లే వేసిన 42వ ఓవర్లో వరుసగా 5 ఫోర్లు బాదాడు. ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే పంత్ మరో బౌండరీ కొట్టి భారత్‌ను విజయతీరానికి చేర్చాడు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) పంత్ (బి) పాండ్యా 41; బెయిర్‌స్టో (సి) అయ్యర్ (సబ్) (బి) సిరాజ్ 0; రూట్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 0; స్టోక్స్ (సి అండ్ బి) పాండ్యా 27; బట్లర్ (సి) జడేజా (బి) పాండ్యా 60; అలీ (సి) పంత్ (బి) జడేజా 34; లివింగ్‌స్టోన్ (సి) జడేజా (బి) పాండ్యా 27; విల్లే (సి) సూర్యకుమార్ (బి) చహల్ 18; ఓవర్టన్ (సి) కోహ్లి (బి) చహల్ 32; కార్స్ (నాటౌట్) 3; టాప్లీ (బి) చహల్ 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (45.5 ఓవర్లలో ఆలౌట్) 259.
వికెట్ల పతనం: 1–12, 2–12, 3–66, 4–74, 5–149, 6–198, 7–199, 8–247, 9–257, 10–259.
బౌలింగ్: షమీ 7–0–38–0, సిరాజ్ 9–1–66–2, ప్రసిధ్‌కృష్ణ 9–0–48–0, హార్దిక్ పాండ్యా 7–3–24–4, చహల్ 9.5–0–60–3, జడేజా 4–0–21–1.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రూట్ (బి) టాప్లీ 17; ధావన్ (సి) రాయ్ (బి) టాప్లీ 1; కోహ్లి (సి) బట్లర్ (బి) టాప్లీ 17; పంత్ (నాటౌట్) 125; సూర్యకుమార్ (సి)బట్లర్ (బి) ఓవర్టన్ 16; పాండ్యా (సి) స్టోక్స్ (బి) కార్స్ 71; జడేజా (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (42.1 ఓవర్లలో 5 వికెట్లకు) 261.
వికెట్ల పతనం: 1–13, 2–21, 3–38, 4–72, 5–205.
బౌలింగ్: టాప్లీ 7–1–35–3, విల్లే 7–0–58–0, కార్స్ 8–0–45–1, అలీ 8–0–33–0, ఓవర్టన్ 8–0–54–1, స్టోక్స్ 2–0–14–0, లివింగ్‌స్టోన్ 2–0–14–0, రూట్ 0.1–0–4–0.
Comments
Please login to add a commentAdd a comment