
రవీంద్ర జడేజా(PC: BCCI)
India vs England 5th Test: Rishabh Pant- Ravindra Jadeja: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై భారత జట్టు మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల జల్లు కురిపించాడు. రవిచంద్రన్ అశ్విన్‌ను కాదని జట్టు మేనేజ్‌మెంట్ తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడని కొనియాడాడు. మీరు సూపర్ సర్ జడ్డూ అంటూ తనదైన శైలిలో జడేజాను ప్రశంసించాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆటలో భాగంగా రవీంద్ర జడేజా అద్భుత అర్ధ శతకంతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆరంభంలో టపటపా వికెట్లు పడుతున్న వేళ రిషభ్ బంత్‌కు తోడుగా నిలబడ్డ జడేజా.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు.
ఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసే సరికి 83 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇక పంత్ సెంచరీ ఇన్నింగ్స్(146)కు తోడు జడ్డూ రాణించడంతో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. కాగా విదేశీ గడ్డపై ముఖ్యంగా ఎడ్జ్‌బాస్టన్‌లో అశ్విన్‌కు ఉన్న రికార్డు నేపథ్యంలో అతడిని కాదని జడ్డూకు అవకాశం ఇవ్వడంపై సందేహాలు తలెత్తాయి.
అయితే, అదే సమయంలో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అతడికి చోటు దక్కిందనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో జడ్డూ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంపై ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించాడు.
ఈ మేరకు ఆకాశ్ మాట్లాడుతూ.. ‘‘టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన వేళ... రిషభ్ పంత్, రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చారు. నిజానికి అశ్విన్‌ను పక్కన పెట్టి జడేజాను తుది జట్టులోకి తీసుకోవడంపై కొన్ని పెదవి విరుపులు.. అయితే, తొలి రోజు ఆట ముగిసిన తర్వాత.. అందరూ.. అత్యద్భుతం సర్ జడ్డూ...
నిజమైన ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నావు అని తప్పక చెబుతారు’’ అంటూ ప్రశంసలు కురిపించాడు. గతేడాది ఇదే సిరీస్‌లో ఆర్ అండ్ ఆర్(రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్) అదరగొడితే.. అందులో భాగమైన ఐదో టెస్టులో మరోసారి ఆర్ అండ్ ఆర్ జోడీ సీన్ రిపీట్ చేసిందని రవీంద్ర జడేజా, రిషభ్ పంత్‌ను ఉద్దేశించి కామెంట్ చేశాడు.
చదవండి: Rishabh Pant Century: పంత్ సెంచరీ... సాధారణంగా ద్రవిడ్ ఇలా రియాక్ట్ అవ్వడు! వైరల్ వీడియో!
MS Dhoni Knee Problem: మోకాలి నొప్పులతో బాధపడుతున్న ధోని.. ట్రీట్‌మెంట్ ఖర్చు 40 రూపాయలు!