Ind vs Eng: ‘రోహిత్‌ కెప్టెన్సీలో ఆ ఇద్దరు కలిసి ఆడటం ఆశ్చర్యమే’ | It Seemed This Wouldnt Happen in Rohit Captaincy: Aakash Chopra | Sakshi
Sakshi News home page

Indv s Eng: ‘రోహిత్‌ కెప్టెన్సీలో ఆ ఇద్దరు కలిసి ఆడతారని అస్సలు అనుకోలేదు’

Published Fri, Feb 7 2025 4:22 PM | Last Updated on Fri, Feb 7 2025 4:40 PM

It Seemed This Wouldnt Happen in Rohit Captaincy: Aakash Chopra

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను టీమిండియా(India vs England) విజయంతో ఆరంభించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో నాగ్‌పూర్‌ వేదికగా పర్యాటక జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఈ మ్యాచ్‌లో స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా(Ravindra Jadeja), అక్షర్‌ పటేల్‌(Axar Patel).. ఇద్దరూ అదరగొట్టడం విశేషం.

ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ఇలా జడ్డూ, అక్షర్‌ కలిసి ఆడతారని తాను అస్సలు ఊహించలేదన్నాడు.  ఏదేమైనా ఈ మ్యాచ్‌లో ఇద్దరు రాణించడం శుభసూచకమని.. అయితే అక్షర్‌ కంటే జడ్డూ మెరుగ్గా బౌలింగ్‌ చేశాడని కితాబిచ్చాడు.

జడ్డూ, అక్షర్‌..  ఒకరు బౌలింగ్‌లో.. ఒకరు బ్యాటింగ్‌లో
కాగా ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు కీలక వికెట్లు తీశాడు. తొమ్మిది ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 26 పరుగులే ఇచ్చి స్టార్‌ బ్యాటర్లు జో రూట్‌(19), జొకొబ్‌ బెతెల్‌(51) వికెట్లతో పాటు.. టెయిలెండర్‌ ఆదిల్‌ రషీద్‌(8)ను అవుట్‌ చేశాడు.

ఇక లక్ష్య ఛేదనలో భాగంగా జడేజాకు ఎక్కువగా బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. మొత్తంగా 10 బంతులు ఎదుర్కొని 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు.. జోస్‌ బట్లర్‌ (52) రూపంలో బిగ్‌ వికెట్‌ దక్కించుకున్న మరో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌.. బ్యాటర్‌గానూ దుమ్ములేపాడు.

ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్‌ పటేల్‌ 47 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌సాయంతో 52 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా వీరిద్దరి గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఈ మ్యాచ్‌ సందర్భంగా రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్‌లో 6000 పరుగులు పూర్తి చేసుకోవడంతో 600 వికెట్ల క్లబ్‌లో చేరాడు.

రోహిత్‌ కెప్టెన్సీలో ఆ ఇద్దరు కలిసి ఆడతారని అస్సలు అనుకోలేదు
తద్వారా భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్‌గా రికార్డు సాధించాడు. అంతకు ముందు ఫాస్ట్‌బౌలర్‌ కపిల్‌ పాజీ ఈ ఫీట్‌ అందుకున్నాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో అతడికి ఆడే అవకాశం వస్తుందా లేదా అన్న సందేహం ఉండేది. ఎందుకంటే.. చాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో అతడు పదిహేనవ ఆటగాడిగా ఉన్నాడు.

నిజానికి ఇద్దరు లెఫ్టార్మ్‌ స్పిన్నర్లను ఒకే మ్యాచ్‌లో ఆడించరనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ఇలాంటిది జరుగుతుందని నేను అనుకోలేదు. కానీ ఈరోజు(గురువారం) ఇది జరిగింది.

ఈ మ్యాచ్‌లో జడ్డూ అక్షర్‌ కంటే మెరుగ్గా బౌలింగ్‌ చేశాడు. అక్షర్‌కు బ్యాటింగ్‌కు చేసే అవకాశం వచ్చింది. ఇకపై జడ్డూ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.. అక్షర్‌ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌గా మీకు(మేనేజ్‌మెంట్‌) ఉపయోగపడతాడు’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు.

భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ తొలి వన్డే స్కోర్లు
👉వేదిక: విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం, నాగ్‌పూర్‌
👉టాస్‌: ఇంగ్లండ్‌.. బ్యాటింగ్‌
👉ఇంగ్లండ్‌ స్కోరు: 248 (47.4)
👉భారత్‌ స్కోరు: 251/6 (38.4)
👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై భారత్‌ విజయం
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: శుబ్‌మన్‌ గిల్‌(96 బంతుల్లో 87 పరుగులు).

చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement