రెండో టీ20‌: ప్రతీకారం తీర్చుకున్న భారత్‌ | Ind vs Eng: Toss, Live Updates For 2nd T20 | Sakshi
Sakshi News home page

రెండో టీ20‌: ప్రతీకారం తీర్చుకున్న భారత్‌

Published Sun, Mar 14 2021 6:47 PM | Last Updated on Tue, Mar 16 2021 8:59 PM

Ind vs Eng: Toss, Live Updates For 2nd T20 - Sakshi

ప్రతీకారం తీర్చుకున్న భారత్‌
భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలి టీ20లో ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన పరాభవానికి భారత్‌ ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లండ్‌ నిర్ధేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కెప్టెన్‌ కోహ్లి (49 బంతుల్లో 73 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) బాధ్యతాయుతమైన అర్ధసెంచరీకి, అరంగేట్రం బ్యాట్స్‌మెన్‌ ఇషాన్‌ కిషన్‌ (32 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత అర్ధశతకం తోడవ్వడంతో టీమిండియా ప్రత్యర్ధిపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.  

కోహ్లి హాఫ్‌ సెంచరీ
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో అర్ధశతకం సాధించాడు. కోహ్లి 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులు సాధించాడు. కోహ్లి తన హాఫ్‌ సెంచరీని సిక్సర్‌ బాది సాధించడం విశేషం.

పంత్‌ (26) ఔట్‌
వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ (13 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రిస్‌ జోర్డాన్‌ బౌలింగ్‌లో బెయిర్‌ స్టోకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. జోర్డాన్‌ వేసిన 14 ఓవర్‌లో వరుసగా ఫోర్‌, సిక్స్‌ బాదిన పంత్‌ ఆ మురుసటి బంతికే వెనుదిరిగాడు. దీంతో 13.4 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.

ఇషాన్‌ కిషన్‌(56) ఔట్
ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ ఇషాన్‌ కిషన్‌ (32 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) 10 ఓవర్‌ ఆఖరి బంతికి ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్‌లో కోహ్లి(38), పంత్‌(2) ఉన్నారు. 11 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ 2 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. ప్రస్తుతానికి టీమిండియా 54 బంతుల్లో 66 పరుగులు చేయాల్సి ఉంది. 

అరంగేట్రంలోనే అదరగొట్టిన ఇషాన్‌ కిషన్
టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఇషాన్‌ కిషన్‌ (28 బంతుల్లో 54; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) తన అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. అంతర్జాతీయ కెరీర్‌లో తాను ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే అర్థశతకం సాధించి శభాష్‌ అనిపించాడు. అతనితో పాటు క్రీజ్‌లో ఉన్న కెప్టెన్‌ కోహ్లి (23 బంతుల్లో 35; 3 ఫోర్లు, సిక్స్‌) సైతం ధాటిగా ఆడుతున్నాడు. దీంతో 9.2 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా స్కోర్‌ వికెట్‌ నష్టానికి 92 పరుగులు. 

దూకుడుగా ఆడుతున్న కోహ్లి, ఇషాన్‌ కిషన్‌
టీమిండియా బ్యాట్స్‌మెన్లు ఇషాన్‌ కిషన్‌ (15 బంతుల్లో 27; 4 ఫోర్లు, సిక్స్‌), విరాట్‌ కోహ్లి (15 బంతుల్లో 22; 3 ఫోర్లు)లు దూకుడుగా ఆడుతున్నారు. దీంతో 6 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ వికెట్‌ నష్టానికి 50 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లు సామ్‌ కర్రన్‌ (1/9), ఆర్చర్‌ (0/12) తలో రెండు ఓవర్లు వేయగా, జోర్డాన్‌(0/12), టామ్‌ కర్రన్‌(1/16) చెరో ఓవర్‌ బౌల్‌ చేశారు.

కేఎల్‌ రాహుల్‌ డకౌట్‌ 
టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. సామ్‌ కర్రన్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి తొలి ఓవర్‌ ఆఖరి బంతికి ఔటయ్యాడు. దీంతో సామ్‌ కర్రన్‌కు మెయిడిన్‌ వికెట్‌ లభించింది. తొలి ఓవర్‌ ముగిసే సమయానికి టీమిండియా స్కోర్‌ 0/1. క్రీజ్‌లో మరో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌(0), కెప్టెన్‌ కోహ్లి(0) ఉన్నారు.

20 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 164/6

నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 164/6గా ఉంది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జోస్‌ బట్లర్‌(0), డేవిడ్‌ మలాన్‌(24), జేసన్‌ రాయ్‌(46), బెయిర్‌ స్టో (20), మోర్గాన్‌ (28), స్టోక్స్‌(24) పరుగులు సాధించి అవుటయ్యారు. సామ్‌ కర్రన్‌(6), జోర్డాన్‌(0)లు నాటౌట్‌ బ్యాట్స్‌మెన్లుగా ఉన్నారు. టీమిండియా బౌలర్లు భువనేశ్వర్‌ కుమార్‌(1/28), చహల్‌(1/34) తలో వికెట్‌, సుందర్‌(2/29), శార్ధూల్‌ (2/29) చెరో రెండు వికెట్లు సాధించారు.
 

మోర్గాన్‌ (28) ఔట్‌; 17.1 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ 142/5

17.1 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 142/5. శార్ధూల్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ పంత్‌ క్యాచ్‌ అందుకోవడంతో మోర్గాన్‌ (20 బంతుల్లో 28; 4 ఫోర్లు) పెవిలియన్‌కు చేరాడు. క్రీజ్‌లో బెన్‌ స్టోక్స్‌(9 బంతుల్లో 8), సామ్‌ కర్రన్‌(0) ఉన్నారు.
 

బెయిర్‌ స్టో (20) ఔట్‌; ఇంగ్లండ్‌ 120/4

వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో బెయిర్‌ స్టో (15 బంతుల్లో 20; ఫోర్, సిక్స్‌) పెవిలియన్‌కు చేరాడు. సుందర్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ క్యాచ్‌ అందుకోవడంతో బెయిర్‌ స్టో పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం కెప్టెన్‌ మోర్గాన్‌ (9 బంతుల్లో 15; 3 ఫోర్లు), బెన్‌ స్టోక్స్‌(0) క్రీజ్‌లో ఉన్నారు. 14 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 120/4. 

జేసన్‌ రాయ్‌(46) ఔట్‌; ఇంగ్లండ్‌ 97/3

ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌(35 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను వాషింగ్టన్‌ సుందర్‌ పెవిలియన్‌కు పంపాడు. సుందర్‌ బౌలంగ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ క్యాచ్‌ అందుకోవడంతో రాయ్‌ పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం బెయిర్‌ స్టో (9 బంతుల్లో 12; ఫోర్‌), కెప్టెన్‌ మోర్గాన్‌ (3 బంతుల్లో 5; ఫోర్‌) క్రీజ్‌లోకి ఉన్నారు.  12 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 97/3. 

డేవిడ్‌ మలాన్‌(24) ఔట్‌; ఇంగ్లండ్‌ 83/2

ధాటిగా ఆడుతున్న ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ మలాన్‌(23 బంతుల్లో 24; 4 ఫోర్లు)ను చహల్‌ ఎల్బీడబ్యూగా పెవిలియన్‌కు పంపాడు. మలాన్‌ను తొలుత అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినప్పటికీ.. కెప్టెన్‌ కోహ్లి, బౌలర్‌ చహల్‌ డీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపారు. రివ్యూలో వారు అనుకున్నదే నిజమైంది. మలాన్‌ పెవిలియన్‌కు చేరాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 83/2 స్కోర్‌ సాధించింది. క్రీజ్‌లో జేసన్‌ రాయ్‌(32 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), బెయిర్‌ స్టో (4 బంతుల్లో 5) ఉన్నారు.
 

6 ఓవర్లకు ఇంగ్లండ్‌ 1/44

6 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టానికి 44 పరుగులు సాధించింది. జేసన్‌ రాయ్‌(17 బంతుల్లో 20; ఫోర్‌, సిక్స్‌), డేవిడ్‌ మలాన్‌(18 బంతుల్లో 18; 3 ఫోర్లు)లు ధాటిగా ఆడుతున్నారు. టీమిండియా బౌలర్లు భువనేశ్వర్‌ కుమార్‌(1/12), సుందర్‌(0/14) తలో రెండు ఓవర్లు, శార్ధూల్‌ (0/7), హార్ధిక్‌ (0/7)లు చెరో ఓవర్‌ బౌల్‌ చేశారు.
 

ఆదిలోనే ఇంగ్లండ్‌కు షాక్‌..

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇం‌గ్లండ్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఆ జట్టు‌ ఓపెనర్ జోస్‌ బట్లర్(0)ను భువనేశ్వర్‌ కుమార్‌ మూడో బంతికే పెవిలియన్‌కు పంపాడు. దీంతో తొలి ఓవర్‌ ముగిసే సరికి ఇంగ్లండ్‌ జట్టు ఒక వికెట్‌ నష్టానికి 5 పరుగులు చేసింది. క్రీజ్‌లో జేసన్‌ రాయ్‌(1), డేవిడ్‌ మలాన్‌(4) ఉన్నారు.‌‌ 

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇక్కడ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ముందుగా ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. గత మ్యాచ్‌లో ఘోర ఓటమి పాలైన టీమిండియా ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి గాడిలో పడాలని భావిస్తోంది. తొలి టీ20లో ఓపెనింగ్‌ భాగస్వామ్యాలు నమోదు కాకపోవడంతో టీమిండియా ఒత్తిడికి లోనై వికెట్లను కోల్పోయింది. దాంతో స్వల్ప స్కోరుకే పరిమితమైంది టీమిండియా. దాన్ని రెండో టీ20లో అధిగమించాలని భారత జట్టు యోచిస్తోంది.

భారత జట్టు రెండో టీ20లో పలు మార్పులు చేసింది. యువ క్రికెటర్లు ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లను తుది జట్టులోకి తీసుకుంది. తద్వారా వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. ఈ మ్యాచ్‌ నుంచి శిఖర్‌ ధావన్‌, అక్షర్‌ పటేల్‌లను తప్పించింది. కాగా, రోహిత్‌ శర్మను ఈ మ్యాచ్‌కు సైతం జట్టులోకి తీసుకోలేదు.  ఇదిలా ఉంచితే, ఇంగ్లండ్‌ కూడా తమ జోరును కొనసాగించి ఆధిక్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఇయాన్‌ మోర్గాన్, బెన్‌ స్టోక్స్‌లాంటి హిట్టర్లు బరిలోకి దిగాల్సిన అవసరం రాకుండానే తొలి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ ముగించగలిగింది. వారి తుది జట్టును చూస్తే ఒక్క ఆదిల్‌ రషీద్‌ మినహా పదో నంబర్‌ వరకు బ్యాటింగ్‌ చేయగలరు. ఇక బౌలింగ్‌లో కూడా ఇంగ్లండ్‌ బలంగా ఉంది.

తుది జట్లు

భారత్‌: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌),  కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, రిషభ్‌ పంత్‌,  శ్రేయస్‌ అయ్యర్‌, సూర్య కుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, యజ్వేంద్ర చహల్‌

ఇంగ్లండ్‌: మోర్గాన్‌ (కెప్టెన్‌), జేసన్‌ రాయ్‌, జోస్‌ బట్లర్‌, మలాన్‌, బెయిర్‌ స్టో, బెన్‌ స్టోక్స్‌, సామ్‌ కరాన్‌, ఆర్చర్‌, టామ్‌ కరాన్‌, క్రిస్‌ జోర్డాన్‌, ఆదిల్‌ రషీద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement