అంతర్జాతీయ టీ20లలో సంజూ శాంసన్‌ అరుదైన ఘనత | Sanju Samson Joins Rohit Jaiswal In Elite T20I Record Despite Failure | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ టీ20లలో సంజూ శాంసన్‌ అరుదైన ఘనత

Published Mon, Feb 3 2025 12:45 PM | Last Updated on Mon, Feb 3 2025 1:11 PM

Sanju Samson Joins Rohit Jaiswal In Elite T20I Record Despite Failure

సౌతాఫ్రికా గడ్డపై శతకాలతో విరుచుకుపడ్డ టీమిండియా స్టార్‌ సంజూ శాంసన్‌(Sanju Samson).. స్వదేశంలో మాత్రం తేలిపోయాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌(India vs England)లో పూర్తిగా విఫలమయ్యాడు. అయినప్పటికీ ఐదో టీ20 సందర్భంగా అతడు అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా ఓపెనింగ్‌ జోడీ రోహిత్‌ శర్మ(Rohit Sharma), యశస్వి జైస్వాల్‌తో కలిసి ఎలైట్‌ క్లబ్‌లో చేరాడు.

కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా సంజూ శాంసన్‌ రెండు అంతర్జాతీయ టీ20 శతకాలు బాదిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై కూడా బ్యాట్‌ ఝులిపిస్తాడని ఎదురుచూసిన అభిమానులను ఈ కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నిరాశపరిచాడు.

ఆరంభం బాగున్నా
కోల్‌కతాలో 26 పరుగులతో ఫర్వాలేదనిపించిన సంజూ.. ఆ తర్వాత చెన్నైలో ఐదు, రాజ్‌కోట్‌లో మూడు, పుణెలో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇక ఆఖరిదైన ఐదో టీ20లో సంజూ శాంసన్‌ అంచనాలు అందుకోలేకపోయాడు. ధాటిగానే ఇన్నింగ్స్‌ ఆరంభించినా అదే జోరును కొనసాగించలేకపోయాడు.

తొలి బంతికే సిక్స్‌ బాది
మొత్తంగా ఏడు బంతుల్లో పదహారు పరుగులు చేసిన సంజూ.. ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో మరో పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అయితే, ఈ మ్యాచ్‌లోనూ సంజూ విఫలమైనప్పటికీ.. తన ఇన్నింగ్స్‌ను సిక్సర్‌తో ఆరంభించడం ద్వారా అరుదైన ఫీట్‌ నమోదు చేశాడు.

టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్‌ బాదిన మూడో భారత క్రికెటర్‌గా సంజూ చరిత్రకెక్కాడు. అంతకుముందు రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌ ఈ ఘనత సాధించారు. కాగా ఇంగ్లండ్‌తో ఐదో టీ20లొ ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో డీప్‌ స్వ్కేర్‌ లెగ్‌ మీదుగా ఫ్లాట్‌ సిక్స్‌(70 మీటర్లు) బాదాడు. ఇక తొలి ఓవర్లోనే అతడు మరో సిక్స్‌, ఫోర్‌ బాదడం విశేషం.

సంజూకు భారత మాజీ క్రికెటర్‌ మద్దతు
ఇదిలా ఉంటే.. సంజూ శాంసన్‌ ఇంగ్లండ్‌తో ఐదు టీ20లలో కలిపి కేవలం 51 పరుగులే చేశాడు. దీంతో అతడి నిలకడలేమి ఆట తీరుపై మరోసారి విమర్శలు వస్తుండగా.. భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ మాత్రం ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు మద్దతుగా నిలిచాడు. ‘‘టీ20 క్రికెట్‌లో ప్రతిభావంతులైన ఆటగాళ్లు.. ముఖ్యంగా బ్యాటింగ్‌ టాలెంట్‌ కోసం చూస్తున్నట్లయితే.. వారికి వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి.

మ్యాచ్‌పై వారి ప్రభావం ఎలా ఉంటోంది.. జట్టు కోసం వారు ఏం చేయగలరన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సంజూ శాంసన్‌ విషయానికొస్తే.. కఠినమైన పిచ్‌లపై అతడు అద్బుతమైన శతకాలతో జట్టును గెలిపించాడు.

టీ20 క్రికెట్‌ స్వభావమే అలాంటిది
కాబట్టి అలాంటి వాళ్లు కొన్నిసార్లు విఫలమైనా పెద్దగా పట్టించుకోకూడదు. అయితే, దీర్ఘకాలంలో ఇదే పునరావృతమైనా కాస్త వేచిచూడాలి. టీ20 క్రికెట్‌ స్వభావమే అలాంటిది. దూకుడుగా ముందుకెళ్లేందుకు రిస్క్‌ తీసుకుంటే ఇలాంటివి తప్పవు. 

ఇలాంటి వాళ్లకు ఫామ్‌లోకి రావడానికి ఒక్క ఇన్నింగ్స్‌ చాలు’’ అని సంజయ్‌ మంజ్రేకర్‌ సంజూకు అండగా నిలబడ్డాడు. అయితే, ఐదో టీ20 ఆరంభానికి ముందు అతడు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో ఇన్నింగ్స్‌ తొలి బంతికే సిక్సర్‌ బాదిన క్రికెటర్లు
రోహిత్‌ శర్మ- 2021లో ఇంగ్లండ్‌పై- అహ్మదాబాద్‌ వేదికగా ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో
యశస్వి జైస్వాల్‌- 2024లో జింబాబ్వేపై- హరారే వేదికగా సికందర్‌ రజా బౌలింగ్‌లో
సంజూ శాంసన్‌- 2025లో ఇంగ్లండ్‌పై- ముంబై వేదికగా జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో.

చదవండి: ఇంతకంటే మెరుగైన టీ20 సెంచరీ చూడలేదు.. వన్డేల్లోనూ ఇదే దూకుడు: గంభీర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement