తొలి టీ20 ‌: ఇంగ్లండ్ ఘన విజయం‌‌‌‌‌ | Ind vs Eng: Toss, Live Updates, Rohit Rested For Ist T20 | Sakshi
Sakshi News home page

తొలి టీ20 ‌: ఇంగ్లండ్ ఘన విజయం‌

Published Fri, Mar 12 2021 6:44 PM | Last Updated on Fri, Mar 12 2021 10:30 PM

Ind vs Eng: Toss, Live Updates, Rohit Rested For Ist T20 - Sakshi

టీమిండియాతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్ల తేడాతో చేధించింది. సుందర్‌ వేసిన 15.3వ బంతిని మలన్‌ సిక్సర్‌గా మలిచడంతో ఇంగ్లండ్‌ విజయం ఖాయం అయింది.

రాయ్‌ ఔట్‌
ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన 12వ ఓవర్‌ తొలి బంతికి రాయ్‌(49) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

బట్లర్ ఔట్‌
72 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. చహల్‌ వేసిన 7వ ఓవర్‌ చివరి బంతికి బట్లర్‌(28) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ స్కోరు 72/1

7  ఓవర్లకు గాను ఇంగ్లండ్‌ 58 పరుగులు చేసింది. 7వ ఓవర్‌లో అక్షర్‌ 8 పరుగులు ఇచ్చాడు. రెండో బంతిని రాయ్‌ సిక్సర్‌గా మలిచాడు. బట్లర్‌(27) నిలకడాగా ఆడుతున్నాడు.

నిలకడగా ఇంగ్లండ్‌ ఓపెనర్లు
ఇంగ్లండ్‌ ఓపెనర్లు బట్లర్‌, రాయ్‌ నిలకడగా ఆడుతున్నారు. 5 ఓవర్లకు ఇంగ్లండ్‌ 42 పరుగులు చేసింది. బట్లర్‌ (18) వరుసగా బౌండరీ, సిక్సర్‌ బాదేశాడు. రాయ్‌(24)తో దూసుకెళ్తున్నాడు. 

అయ్యర్‌ ఒంటరి పోరు
ఇంగ్లండ్‌తో తొలి టీ20లో శ్రేయస్‌ అయ్యర్‌ ఒక్కడే మెరిశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా చివరి ఓవర్‌ వరకూ క్రీజ్‌లో ఉండి స్కోరును చక్కదిద్దాడు.  అయ్యర్‌ 48 బంతుల్లో 67  పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 1సిక్స్‌ ఉన్నాయి. 36 బంతుల్లో అర్థ శతకం సాధించిన అయ్యర్‌.. నిలకడగా ఆడాడు.  కాగా, చివరి ఓవర్‌లో భారీ షాట్‌ ఆడబోయి ఏడో వికెట్‌గా ఔటయ్యాడు. జోర్డాన్‌ బౌలింగ్‌లో బౌండరీ లైన్‌ వద్ద మలాన్‌ క్యాచ్‌ పట్టడంతో అయ్యర్‌ వెనుదిరిగాడు.  అయ్యర్‌ కుదురుగా ఆడటంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆర్చర్‌ మూడు వికెట్లు సాధించగా,  ఆదిల్‌ రషీద్‌,  మార్క్‌ వుడ్‌, క్రిస్‌ జోర్డాన్‌, బెన్‌ స్టోక్స్‌లకు తలో వికెట్‌ లభించింది.  

హార్దిక్‌ మెరుపుల్లేవ్‌
టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కూడా ఆకట్టుకోలేదు. 19 పరుగులు చేసిన హార్దిక్‌ పెవిలియన్‌ చేరాడు. 21 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌ మాత్రమే కొట్టిన హార్దిక్‌.. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌ ఔటయ్యాడు. మిడాఫ్‌లో జోర్డాన్‌కు సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆపై మరుసటి బంతికే శార్దూల్‌ ఠాకూర్‌ డకౌట్‌ అయ్యాడు. దాంతో టీమిండియా 102 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది.

అయ్యర్‌ హాఫ్‌ సెంచరీ
టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయిన తరుణంలో శ్రేయస్‌ అయ్యర్‌ ఆదుకున్నాడు. అయ్యర్‌ హాఫ్‌ సెంచరీ సాధించి స్కోరును కాస్త గాడిలో పెట్టాడు. 36 బంతుల్లో 7ఫోర్లతో అర్థ శతకం సాధించాడు. ఇది అయ్యర్‌కు అంతర్జాతీయ టీ20ల్లో మూడో హాఫ్‌ సెంచరీ. తొలుత పంత్‌ కలిసి భాగస్వామ్యాన్ని నిర్మించిన అయ్యర్‌.. ఆపై హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. 



భారీ షాట్‌కు యత్నించి పంత్‌ ఔట్‌
టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్(21)‌ భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. ఆరంభం నుంచే దూకుడుగా కనిపించిన పంత్‌.. 10 ఓవర్‌లో పెవిలియన్‌ చేరాడు. స్టోక్స్‌  బౌలింగ్‌లో  డీప్‌ స్వేర్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న బెయిర్‌ స్టోకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  దాంతో టీమిండియా 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 

కష్టాల్లో టీమిండియా
ఇంగ్లండ్‌తో తొలి టీ20లో టీమిండియా కష్టాల్లో పడింది. 20 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకుంది. శిఖర్‌ ధావన్‌ మూడో వికెట్‌గా ఔటయ్యాడు. టీ​మిండియా ఇన్నింగ్స్‌లో భాగంగా ఐదో ఓవర్‌లో ధావన్‌ పెవిలియన్‌ చేరాడు. మార్క్‌వుడ్‌ వేసిన ఓవర్‌లో ధావన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఇది మార్క్‌వుడ్‌కు తొలి ఓవర్‌.

టీమిండియాకు షాక్‌.. కోహ్లి డకౌట్‌
రాహుల్‌ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి డకౌట్‌ అయ్యాడు. ఆదిల్‌ రషీద్‌ వేసిన మూడో ఓవర్‌ మూడో బంతికి కోహ్లి.. జొర్డాన్‌ కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. టీమిండియా స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది.  టీమిండియా మూడు పరుగుల వద్ద ఉండగా కోహ్లి వికెట్‌ను చేజార్చుకుంది. 

కేఎల్‌ రాహుల్‌ విఫలం
సుదీర్ఘకాలం తర్వాత టీమిండియా తరఫున మ్యాచ్‌ ఆడుతున్న ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో నిరాశపరిచాడు. రెండో ఓవర్‌లోనే రాహుల్‌ పెవిలియన్‌ చేరాడు. పరుగు మాత్రమే చేసి రాహుల్‌ ఔటయ్యాడు. ఆర్చర్‌ బౌలింగ్‌లో రాహుల్‌ బౌల్డ్‌ అయ్యాడు. దాంతో టీమిండియా రెండు పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.

రోహిత్‌కు విశ్రాంతి
టీమిండియాతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న తొలి టీ20లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌.. ముందుగా టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలి టీ20లో గెలిచి శుభారంభం చేయాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌ నుంచి తీవ్ర పోటీ తప‍్పక పోవచ్చు.  ప్రపంచ నంబర్‌వన్‌ టి20 జట్టు ఇంగ్లండ్‌ ఈ ఫార్మాట్‌లో అసాధారణ ఆటతీరుతో దూసుకెళ్తుంది. కాగా, టెస్టుల్ని స్పిన్‌తో దున్నేసిన భారత్‌.. ఈ సిరీస్‌ను టీ20 వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. టీమిండియా కూడా టీ20ల్లో పటిష్టంగానే ఉంది. ఇక్కడ చదవండి: ఎవరి విషయంలోనూ రాజీపడే ప్రసక్తే లేదు: కోహ్లి

ఐపీఎల్‌తో పాటు దేశవాళీ ముస్తాక్‌ అలీ టోర్నీల్లో భారత కుర్రాళ్లు రాటుదేలారు. ఎప్పుడైనా అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.  సీనియర్లు ఫామ్‌లో ఉంటే... కుర్రాళ్లేమో జోరు మీదున్నారు. దాంతో ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు సాగే అవకాశాలున్నాయి. ఓపెనర్‌గా ధావన్‌-రాహుల్‌లు బరిలోకి దిగనున్నారు. నిన్ననే రోహిత్‌తో రాహుల్‌ ఓపెనింగ్‌కు దిగుతాడని కోహ్లి ప్రకటించగా, ఇప్పుడు రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అసలు రోహిత్‌కు ఎందుకు విశ్రాంతి ఇచ్చారనే అనుమానం ఒక్కసారిగా అభిమానులకు ప్రశ్నార్థకంగా మారింది. రోహిత్‌కు ఏమైనా గాయమయ్యిందా అనే కోణంలో కూడా విశ్లేషిస్తున్నారు.  అయితే టాస్‌ తర్వాత కోహ్లి మాట్లాడుతూ..  కొన్ని మ్యాచ్‌లకు రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలపడం చర్చనీయాంశమైంది. ఇక్కడ చదవండి: 'ఐపీఎల్‌ మాకు మేలు చేసింది.. డబ్బుతో వెలకట్టలేం'

తుది జట్లు 
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్‌, రాహుల్, శ్రేయస్, రిషభ్‌ పంత్, హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్, శార్దుల్, భువనేశ్వర్, చహల్

ఇంగ్లండ్‌: మోర్గాన్‌ (కెప్టెన్‌), రాయ్, బట్లర్, మలన్, బెయిర్‌స్టో, స్టోక్స్, సామ్‌ కరన్, జొర్డాన్, ఆర్చర్, మార్క్‌వుడ్, రషీద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement