చెప్పినా వినని సర్ఫరాజ్‌ ఖాన్‌.. రోహిత్‌కు వార్నింగ్‌.. ఆఖరికి! | Ind vs NZ 3rd Test: Rohit Sarfaraz Sent Strong Message By Umpire Captain Reacts | Sakshi
Sakshi News home page

Ind vs NZ: చెప్పినా వినని సర్ఫరాజ్‌ ఖాన్‌.. రోహిత్‌కు వార్నింగ్‌.. ఆఖరికి!

Published Fri, Nov 1 2024 8:25 PM | Last Updated on Sat, Nov 2 2024 2:52 PM

Ind vs NZ 3rd Test: Rohit Sarfaraz Sent Strong Message By Umpire  Captain Reacts

టీమిండియా యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ చేసిన పని వల్ల కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆవేశానికి లోనయ్యాడు. అంపైర్లతో చిన్నపాటి వాగ్వాదానికి దిగాడు. అయితే, సర్ఫరాజ్‌ను సమర్థించే క్రమంలో ఆరంభంలో కాస్త దూకుడు ప్రదర్శించిన రోహిత్‌.. తర్వాత చల్లబడ్డాడు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్‌తో మాట్లాడి వివాదం సద్దుమణిగేలా చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?!

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25లో భాగంగా భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. బెంగళూరు, పుణెలలో జరిగిన తొలి రెండు టెస్టుల్లో పర్యాటక కివీస్‌ జట్టు రోహిత్‌ సేనకు ఊహించని షాకిచ్చింది. రెండింటిలోనూ ఘన విజయం సాధించి 2-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. తద్వారా పన్నెండేళ్ల తర్వాత సొంతగడ్డపై టీమిండియాకు టెస్టు సిరీస్‌లో ఓటమిని రుచిచూపించింది.

ఆరంభం బాగున్నా
ఫలితంగా అవమానభారంతో కుంగిపోయిన టీమిండియా ముంబైలో జరుగుతున్న మూడో టెస్టులో గెలుపొంది.. పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. 

 

ఆరంభంలోనే పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ డెవాన్‌ కాన్వే(4) వికెట్‌ తీసి బ్రేక్ ఇవ్వగా.. స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ మరో ఓపెనర్‌, కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌(28), స్టార్‌ బ్యాటర్‌ రచిన్‌ రవీంద్ర(5)ను పెవిలియన్‌కు పంపాడు.

సర్ఫరాజ్‌ ఖాన్‌ స్లెడ్జింగ్‌
ఈ క్రమంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ విల్‌ యంగ్‌(71), డారిల్‌ మిచెల్‌(82) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడారు. ఇద్దరూ సూపర్‌ హాఫ్‌ సెంచరీలతో రాణించి.. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగుల మెరుగైన స్కోరు సాధించేలా చేశారు. అయితే, ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు శ్రమించాల్సి వచ్చిన వేళ సర్ఫరాజ్‌ ఖాన్‌ స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు.

కివీస్‌ ఇన్నింగ్స్‌లో 32 ఓవర్‌కు ముందు బౌలర్‌ బంతిని రిలీజ్‌ చేసే సమయంలో షార్ట్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సర్ఫరాజ్‌.. బ్యాటర్‌కు మరీ దగ్గరగా వచ్చి ఏదో మాట్లాడుతున్నట్లు కనిపించాడు. అప్పుడు క్రీజులో ఉన్న డారిల్‌ మిచెల్‌ సర్ఫరాజ్‌ వల్ల తన ఏకాగ్రత దెబ్బతింటుందని ఫీల్డ్‌ అంపైర్లకు ఫిర్యాదు చేసినట్లు కనిపించింది.

రోహిత్‌కు వార్నింగ్‌
ఈ క్రమంలో అంపైర్‌ రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ సర్ఫరాజ్‌తో పాటు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను పిలిచి.. మాటలు తగ్గించాలని సూచించాడు. దీంతో అసహనానికి లోనైన రోహిత్‌ అంపైర్‌తో కాసేపు వాదించాడు. 

ఆ తర్వాత మిచెల్‌ దగ్గరకు వెళ్లి ఏదో మాట్లాడాడు. దీంతో మిచెల్‌ సైతం రోహిత్‌ వ్యాఖ్యలతో అంగీకరించినట్లుగా తిరిగి తన బ్యాటింగ్‌ పొజిషన్‌కు వెళ్లిపోయాడు. దీంతో వివాదం సద్దుమణిగింది.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 86 పరుగులే చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ కంటే ఇంకా 149 పరుగులు వెనుకబడి ఉంది.

చదవండి: నువ్వు జట్టులో ఉండి ఏం లాభం?.. కోహ్లిపై ఫ్యాన్స్‌ ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement