ఇంకెన్ని ఛాన్సులు?.. నీ వల్ల అతడికి అన్యాయం! | Ind vs NZ - He Should Be Dropped: Fans Reacts After KL Rahul Flop Show | Sakshi
Sakshi News home page

ఇంకెన్ని ఛాన్సులు?.. నీ వల్ల అతడికి అన్యాయం!

Published Sat, Oct 19 2024 6:52 PM | Last Updated on Sat, Oct 19 2024 7:49 PM

Ind vs NZ - He Should Be Dropped: Fans Reacts After KL Rahul Flop Show

క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని అవకాశాలు వచ్చినా అతడి ఆట తీరులో మార్పు రావడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో కేఎల్‌ రాహుల్‌ దారుణ వైఫల్యం నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా అతడిని ట్రోల్‌ చేస్తున్నారు.

ప్రతిభ ఉన్న ఆటగాడి’ని తొక్కేస్తున్నారు!
ఇక రాహుల్‌ కోసం ఇప్పటికే ‘ప్రతిభ ఉన్న ఆటగాడి’ని తొక్కేసారని.. ఇకపై ఆ పొరపాట్లు పునరావృతం చేయవద్దంటూ సెలక్టర్లకు హితవు పలుకుతున్నారు. టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ టెస్టుల్లో తాను ఆడిన గత రెండు మ్యాచ్‌లలో చేసిన స్కోర్లు 16, 22*, 68. ఇటీవల బంగ్లాదేశ్‌తో స్వదేశంలో ఈ మేర పరుగులు రాబట్టాడు.

దారుణంగా విఫలం
ఈ క్రమంలో తాజాగా న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే, బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టులో రాహుల్‌ పూర్తిగా నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయిన ఈ కర్ణాటక బ్యాటర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో పన్నెండు పరుగులకే పెవిలియన్‌ చేరాడు.

ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా క్లిష్ట పరిస్థితిలో ఉన్న విషయం తెలిసిందే. కివీస్‌కు కేవలం 107 పరుగుల లక్ష్యం విధించిన భారత్‌.. ఆఖరి రోజైన ఆదివారం నాటి ఆటలో ప్రత్యర్థిని 105 పరుగులకే ఆలౌట్‌ చేయాలి. లేదంటే.. న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి తప్పదు.

సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్‌
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ 150 పరుగులతో దుమ్ములేపాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ కెరీర్‌లో తొలి శతకం నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సేన ఇంకా పోటీలో నిలవగలగడానికి కారణం సర్ఫరాజ్‌ ఇన్నింగ్స్‌ అనడంలో సందేహం లేదు.

ఇకనైనా అతడికి అవకాశాలు ఇవ్వండి
ఇక తుదిజట్టు మిడిలార్డర్‌లో చోటు కోసం సర్ఫరాజ్‌ కేఎల్‌ రాహుల్‌తో పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ గైర్హాజరీ వల్ల విరాట్‌ కోహ్లి మూడో స్థానంలో ఆడగా.. సర్ఫరాజ్‌కు అనుకోకుండా ఛాన్స్‌వచ్చింది. లేదంటే.. రాహుల్‌ కోసం అతడిని డ్రాప్‌ చేసేవారే! ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఫ్యాన్స్‌ రాహుల్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. రాహుల్‌ కోసం సర్ఫరాజ్‌ ఖాన్‌కు ఇన్నాళ్లూ అన్యాయం చేశారంటూ మండిపడుతున్నారు.

చదవండి: ‘హీరో’లు అవుట్‌.. కుప్పకూలిన టీమిండియా! అద్భుతం జరిగితేనే..
Rohit- Kohli: అంపైర్లతో గొడవ.. రోహిత్‌ ఆగ్రహం.. కోహ్లి ఆన్‌ ఫైర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement