టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌కు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ అండగా నిలిచాడు. ఈ కర్ణాటక బ్యాటర్ ఆటతీరు పట్ల తాము సంతృప్తిగానే ఉన్నామని తెలిపాడు. బయటవాళ్లు ఏమనుకుంటున్నారో అన్న అంశాలతో తమకు సంబంధం లేదని.. జట్టులోని ఆటగాళ్లకు అన్ని వేళలా మద్దతుగా ఉంటామని స్పష్టం చేశాడు.
అద్భుత శతకం
కాగా భారత టెస్టు జట్టు మిడిలార్డర్‌లో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఓపెనర్‌గా ఉన్న శుబ్‌మన్ గిల్ వన్‌డౌన్‌లో ఆడుతుండగా.. నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐదోస్థానం కోసం కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్లతో సర్ఫరాజ్ ఖాన్ సైతం రేసులో ఉన్నాడు.
అయితే, ఇప్పటికే అయ్యర్ జట్టుకు దూరం కాగా.. రాహుల్, సర్ఫరాజ్ పేర్లు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఇటీవల బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టుకు గిల్ దూరం కావడంతో.. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఇద్దరికీ తుదిజట్టులో చోటు దక్కింది.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో వీరిద్దరు డకౌట్ అయ్యారు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ అద్భుత శతకం(150)తో కదం తొక్కగా.. రాహుల్ కేవలం 12 పరుగులకే పరిమితయ్యాడు.
ఈ నేపథ్యంలో పుణె వేదికగా గురువారం కివీస్‌తో మొదలుకానున్న రెండో టెస్టుకు జట్టు ఎంపిక గురించి సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేఎల్ రాహుల్‌ను విమర్శిస్తూ.. సర్ఫరాజ్ ఖాన్ వైపు మొగ్గుచూపుతున్నారు చాలా మంది విశ్లేషకులు. ఈ విషయంపై టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తాజాగా స్పందించాడు.
ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో..
‘‘ప్లేయింగ్ ఎలెవన్‌ను సోషల్ మీడియా నిర్ణయించలేదు. విశ్లేషకులు, నిపుణులు ఏమనుకుంటున్నారోనన్న విషయాలతోనూ మాకు సంబంధం లేదు. టీమ్ మేనేజ్‌మెంట్ ఏం ఆలోచిస్తున్నదే ముఖ్యం. ఇటీవల బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కాన్పూర్ పిచ్‌పై పరుగులు రాబట్టడం కష్టమైనా కేఎల్ రాహుల్ మెరుగ్గా రాణించాడు.
యాజమాన్యం అతడికి అండగానే ఉంది
తన ఇన్నింగ్స్‌ను భారీ స్కోర్లుగా మార్చుకోవాల్సి ఉన్న మాట వాస్తవమే. అయినప్పటికీ జట్టు యాజమాన్యం అతడికి అండగానే ఉంది’’ ప్రి మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో గౌతీ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు గిల్ తిరిగి వస్తున్నాడు కాబట్టి.. రాహుల్‌కు ఛాన్స్ ఇచ్చి, సర్ఫరాజ్‌ను తప్పిస్తారనే వాదనలు బలపడుతున్నాయి.
ఇంతకు ముందు భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే సైతం మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్‌కు గంభీర్ మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలిపాడు. ఇదిలా ఉంటే.. కివీస్‌తో తొలి టెస్టు తర్వాత సర్ఫరాజ్ ఖాన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి శుభవార్త పంచుకున్న విషయం తెలిసిందే.
తండ్రిగా ప్రమోషన్
తాను తండ్రినయ్యానని.. తన భార్య మగబిడ్డను ప్రసవించిందని ఈ ముంబైకర్ తెలిపాడు. ఈ నేపథ్యంలో కుటుంబానికి సమయం కేటాయించాలనుకుంటే సర్ఫరాజ్ ఖాన్ కేఎల్ రాహుల్‌కు లైన్‌క్లియర్ చేసినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పర్యాటక న్యూజిలాండ్ జట్టు ఆతిథ్య టీమిండియాపై మొదటి మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment