హర్షిత్ రాణా త్వరలోనే టీమిండియా అరంగేట్రం చేయనున్నాడా? ఆస్ట్రేలియాతో సిరీస్ కంటే ముందే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టనున్నాడా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలపడంలో తనవంతు పాత్ర పోషించిన ఈ పేస్ బౌలర్.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి
ఈ క్రమంలో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైనా ఇంత వరకు అరంగేట్రం చేయలేదు. అయితే, బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లనున్న టెస్టు జట్టులో రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు హర్షిత్ రాణా.
భారత-ఎ జట్టులో భాగమైన యువ క్రికెట్లరు ఇప్పటికే ఆస్ట్రేలియాకు వెళ్లగా హర్షిత్ మాత్రం రంజీ మ్యాచ్ కోసం భారత్‌లోనే ఉన్నాడు. అసోంతో మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన హర్షిత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు.
మొత్తంగా ఏడు వికెట్లు తీయడంతో పాటు ధనాధన్ హాఫ్ సెంచరీ(4 ఫోర్లు, 3 సిక్స్‌లు- 59 రన్స్)తో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో హర్షిత్ రాణాను కివీస్‌తో మూడో టెస్టులో బరిలోకి దించాలని హెడ్‌కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నట్లు సమాచారం.
ఆకాశ్ దీప్‌పై వేటు?
ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వడం సహా ఫామ్‌లేమితో సతమతమవుతున్న మహ్మద్ సిరాజ్‌ను పక్కనపెట్టాలనే యోచనలో కోచ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆకాశ్ దీప్‌ను తప్పించి హర్షిత్ రాణాను ఆడించాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ప్రత్యర్థి బ్యాటర్ ఎంతటి ఘనుడైనా తనదైన శైలిలో బంతులు విసురుతూ వికెట్లు పడగొట్టగల సత్తా ఈ స్పీడ్‌స్టర్ సొంతం.
అప్పుడు వాషీ.. ఇప్పుడు రాణా
ఇక కేకేఆర్ మెంటార్‌గా హర్షిత్‌ను దగ్గరగా గమనించిన గంభీర్.. ఈ ఢిల్లీ పేసర్‌కు కివీస్‌తో మూడో టెస్టులో అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్‌లో రోహిత్ సేన ఇప్పటికే రెండు ఓడిపోయింది. సిరీస్ కోల్పోయినా పరువు నిలబెట్టుకోవాలంటే నవంబరు 1 నుంచి ముంబైలో జరిగే ఆఖరి టెస్టులో గెలుపు తప్పనిసరి!
ఇదిలా ఉంటే.. మొదటి టెస్టులో టీమిండియా ఓటమి తర్వాత రెండో టెస్టుకు వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసిన చేసిన విషయం తెలిసిందే. పుణె టెస్టులో ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ పదకొండు వికెట్లతో సత్తా చాటాడు. ఇప్పుడిక హర్షిత్ రాణా వంతు వచ్చిందేమో?!
చదవండి: గంభీర్ సర్ వల్లే ఆరోజు అలా.. టెస్టుల్లోనూ రాణిస్తా: నితీశ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment