
బెంగళూరు: భారత్, దక్షిణాఫ్రికా మధ్య టి20 సిరీస్‌లో విజేతను తేల్చే చివరి పోరుకు రంగం సిద్ధమైంది. నేడు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఐదో మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచి ఒక్కసారిగా దక్షిణాఫ్రికా ఆధిపత్యం ప్రదర్శించగా... భారత్ సరైన సమయంలో కోలుకొని రెండు వరుస విజయాలతో సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. తాజా ఫామ్‌ను కొనసాగిస్తూ సొంతగడ్డపై పంత్ సేన తమ ఖాతాలో గెలుపును వేసుకుంటుందో లేక సఫారీ టీమ్ మళ్లీ చెలరేగుతుందా చూడాలి.
అదే జట్టుతో...
కొత్త ఆటగాళ్లు అప్పుడే తుది జట్టులో స్థానం ఆశించవద్దని సిరీస్‌కు ముందే చెప్పిన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ దానికే కట్టుబడ్డాడు. రెండు ఓటముల తర్వాత కూడా అనూహ్య మార్పులకు అవకాశం ఇవ్వకుండా అదే టీమ్‌ను కొనసాగించడం ఫలితాన్ని ఇచ్చింది. అటు బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్, రుతురాజ్, హార్దిక్ పాండ్యా ఆకట్టుకోగా, బౌలింగ్‌లో హర్షల్, అవేశ్, చహల్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. కెప్టెన్ రిషభ్ పంత్ మాత్రం తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చకపోగా, శ్రేయస్ అయ్యర్ నుంచి కూడా ఆశించిన ప్రదర్శన రాలేదు. వీరిద్దరు చివరి మ్యాచ్‌లో చెలరేగాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఫినిషర్‌గా దినేశ్ కార్తీక్ తనకు అప్పజెప్పిన పాత్రను మరింత సమర్థంగా పోషించాడు. ఇప్పుడు తన సొంత మైదానంలాంటి బెంగళూరులో అతను ఎలా చెలరేగుతాడో చూడాలి. అన్నింటికి మించి భువనేశ్వర్ ఒకప్పటి తన ఆటను గుర్తుకు తెస్తూ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకోవడం సానుకూలాంశం.
డికాక్ రాణించేనా!
దక్షిణాఫ్రికా జట్టులో అనుభవం, ఆటతీరును బట్టి చూస్తే డికాక్ అందరికంటే కీలక ఆటగాడు. గాయంతో సిరీస్‌లో రెండు మ్యాచ్‌లకు దూరమైన అతను మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ ప్రభావం చూపలేదు. ఐపీఎల్ తరహాలో దూకుడుగా ఆడితే సఫారీ టీమ్‌కు శుభారంభం లభిస్తుంది. ప్రిటోరియస్, డసెన్, క్లాసెన్ తాము ఒక్క మ్యాచ్ హీరోలం మాత్రమే కాదని నిరూపించుకోవాల్సి ఉంది. మిడిలార్డర్‌లో మిల్లర్ మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. బౌలింగ్‌లో ఇద్దరు స్పిన్నర్లు కేశవ్, షమ్సీ తేలిపోయారు. వీరిని భారత బ్యాటర్లు చితక్కొట్టారు. నోర్జే ఫర్వాలేదనిపించగా, గత మ్యాచ్‌లో ఆడని రబడ బరిలోకి దిగితే జట్టు బలం పెరుగుతుంది. గాయపడిన కెప్టెన్ బవుమా కోలుకోకపోతే హెన్‌డ్రిక్స్ ఓపెనర్‌గా ఆడతాడు. ఇదే సిరీస్‌లో తమ జట్టు అత్యధిక ఛేదన, అత్యల్ప టి20 స్కోరు సాధించిన దక్షిణాఫ్రికా విజయంతో ముగిస్తుందా అనేది చూడాలి.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: పంత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్, శ్రేయస్, హార్దిక్, కార్తీక్, అక్షర్, హర్షల్, భువనేశ్వర్, అవేశ్, చహల్.
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్)/హెన్‌డ్రిక్స్, డికాక్, ప్రిటోరియస్, వాన్‌డర్ డసెన్, క్లాసెన్, మిల్లర్, జాన్సన్, రబడ, నోర్జే, ఇన్‌గిడి, షమ్సీ.
పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన మైదానం. చిన్న బౌండరీలతో భారీ స్కోరుకు అవకాశం. అయితే వాతావరణం మ్యాచ్‌కు అంతరాయం కలిగించవచ్చు. శుక్రవారం బెంగళూరులో భారీ వర్షం కురవగా, శనివారం కూడా వర్షంతో రంజీ సెమీస్ ఆలస్యంగా మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment