South Africa vs India, 2nd Test: సౌతాఫ్రికాతో రెండో టెస్టు నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పుపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానాన్ని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో భర్తీ చేయాలని సూచించాడు. జడ్డూ గనుక ఫిట్‌గా ఉంటే కేప్‌టౌన్ మ్యాచ్‌లో అతడిని తప్పక ఆడించాలని మేనేజ్‌మెంట్‌కు విజ్ఞప్తి చేశాడు.
అదే విధంగా యువ పేసర్ ప్రసిద్ కృష్ణ విషయంలో పునరాలోచన చేయాలని పఠాన్ సూచించాడు. కాగా సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా దారుణ పరాజయం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య సౌతాఫ్రికా చేతిలో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది.
దీంతో సిరీస్‌ను డ్రా చేసుకోవాలంటే రెండో మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లోనూ గనుక ఓడితే.. మరోసారి సఫారీ గడ్డపై టీమిండియాకు భంగపాటు తప్పదు. అందుకే.. గత మ్యాచ్ తాలుకు తప్పిదాలు పునరావృతం కాకుండా.. లోపాలు సరిచేసుకుని బరిలోకి దిగేందుకు రోహిత్ సేన సిద్ధమవుతోంది.
జడ్డూ వస్తే ప్రయోజనకరంగా ఉంటుంది
ఈ నేపథ్యంలో జట్టు కూర్పు గురించి భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘రవీంద్ర జడేజా ఫిట్‌నెస్ సాధిస్తే అతడిని కచ్చితంగా తుదిజట్టులోకి తీసుకోవాలి. గత మ్యాచ్‌లో అశ్విన్ బాగానే బౌలింగ్ చేశాడు. కానీ.. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏడో స్థానంలో రాణించగల జడేజా సేవలను ఇండియా కోల్పోయింది.
కాబట్టి అతడు జట్టులోకి వస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఇక బౌలింగ్ దళం విషయంలో రోహిత్ శర్మ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగితే బాగానే ఉంటుంది. ఒకవేళ ఏదైనా మార్పు చేయాలనుకుంటే ప్రసిద్ కృష్ణ స్థానంలో ముకేశ్ కుమార్‌ను తీసుకురావాల్సి ఉంటుంది.
ప్రసిద్ కృష్ణను ఆడిస్తే..
అయితే, నెట్స్‌లో ప్రసిద్ కృష్ణ బౌలింగ్ బాగానే అనిపిస్తే.. అతడి విషయంలో ధీమా ఉంటే రెండో టెస్టులోనూ ఆడించవచ్చు’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఇండియా టుడేతో పేర్కొన్నాడు. కాగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య బుధవారం నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్టు ఆరంభం కానుంది.
ఇదిలా ఉంటే.. సెంచూరియన్ టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన ప్రసిద్ కృష్ణ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇరవై ఓవర్ల బౌలింగ్‌లో మొత్తంగా 93 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ తీయగలిగాడు.
చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. టీమిండియాను భయపెడుతున్న రికార్డులు!
Comments
Please login to add a commentAdd a comment