
PC: Disney+ Hotstar(Twitter)
Ind Vs Sa 3rd Test : కోహ్లికి అస్సలు పరిణతి లేదు... కెప్టెన్ మరీ ఇంత చెత్తగానా? ఏంటి ఇదంతా..
Ind Vs Sa 3rd test- Virat Kohli- Elgar DRS Call Row: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై మండిపడ్డాడు. మరీ ఇంత చెత్తగా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నించాడు. ఇలా చేయడం ద్వారా యువ ఆటగాళ్లకు ఏం సందేశం ఇస్తున్నావంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. కాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో గెలిచి చరిత్ర సృష్టించాలన్న కోహ్లి సేనకు కఠిన సవాలు ఎదురైన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో మూడో రోజు ఆటలో భాగంగా ప్రొటిస్ కెప్టెన్ డీన్ ఎల్గర్ డీఆర్‌ఎస్ కాల్, అందుకు కోహ్లి బృందం స్పందించిన తీరు ఎంతటి వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా కోహ్లి స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి.. ‘‘కేవలం ప్రత్యర్థి జట్టు మీదే కాదు. ముందు మీ జట్టు మీద దృష్టి సారించండి. అందరిపైనా ఫోకస్ పెట్టండి’’ అని వ్యాఖ్యానించడం విమర్శలకు తావిచ్చింది.
ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గౌతం గంభీర్... ‘‘కోహ్లికి ఏమాత్రం పరిణతి లేదు. భారత జట్టు కెప్టెన్ స్టంప్స్ మైక్ వద్దకు వెళ్లి ఇలా చెప్పడం నిజంగా చెత్త విషయం. ఇలా చేయడం ద్వారా యువ క్రికెటర్లకు నువ్వు అస్సలు ఆదర్శవంతుడివి కాలేవు’’ అంటూ కోహ్లి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇక దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు షాన్ పొలాక్ ఈ వివాదంపై స్పందిస్తూ.. వికెట్ తీయాలన్న కసితో ఉన్న టీమిండియాకు ఎల్గర్ డీఆర్‌ఎస్ కాల్‌తో తప్పించుకోవడం మింగుడుపడలేదని.. అందుకే ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారని పేర్కొన్నాడు. ఏదేమైనా ప్రసారకర్తలను ఉద్దేశించి అలా మాట్లాడటం సరికాదన్నాడు. కాగా నాలుగో రోజు ఆటలో భారత బౌలర్లు 8 వికెట్లు పడగొడితేనే విజయం సాధ్యపడుతుంది.
— Addicric (@addicric) January 13, 2022
— Bleh (@rishabh2209420) January 13, 2022