విరాట్ కోహ్లి- రోహిత్ శర్మ (ఫైల్ ఫొటో- క్రెడిట్: BCCI)
India's biggest challenge in Test series vs South Africa: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు తప్పక రాణించాలని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. ప్రొటిస్ గడ్డపై భారత్ జయకేతనం ఎగురువేయాలంటే వీరిద్దరే ప్రదర్శనే కీలకం కానుందని పేర్కొన్నాడు.
కాగా సఫారీ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం టీమిండియా బ్యాటర్లకు అంత సులువుకాదన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టెస్టుల్లో ప్రొటిస్ బౌలర్లను ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్న పని. అందుకే భారత జట్టు ఇంత వరకు ఒక్కసారి కూడా అక్కడ టెస్టు సిరీస్ గెలిచిందే లేదు.
వరల్డ్‌కప్ తర్వాత తొలిసారి
ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో ఈ ఫీట్ నమోదు చేయగలిగింది కానీ.. సౌతాఫ్రికాలో మాత్రం బోణీ కొట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో తాజా పర్యటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రికార్డుల వీరుడు విరాట్ కోహ్లి తిరిగి ఈ సిరీస్‌తోనే మైదానంలో అడుగుపెట్టనున్నారు.
బాక్సింగ్ డే(డిసెంబరు 26) నుంచి మొదలు కానున్న తొలి టెస్టుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ గౌతం గంభీర్ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
సౌతాఫ్రికా డేంజరస్ పేసర్లు
‘‘పేస్, బౌన్స్, సీమ్. ఇలాంటి పిచ్‌లపై ఇండియా ప్లేయర్లకు బ్యాటింగ్ చేయడం తేలికకాదు. సౌతాఫ్రికా గడ్డపై.. ఎంతటి మేటి బ్యాటర్ అయినా ఒత్తిడిలో కూరుకుపోతాడు. 2011 నాటి పరిస్థితులు ఇప్పుడు అక్కడ లేవు.
కగిసో రబడ, గెరాల్డ్ కొయెట్జీ, నండ్రే బర్గర్, మార్కో జాన్సెన్ వంటి పేసర్లు పదునైన బంతులతో దూసుకువస్తారు. ఇక ఇప్పుడు అక్కడ ఆడబోయే అనుభవజ్ఞులు ఎవరైనా ఉన్నారా అంటే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.
అలా అయితేనే గెలుస్తాం
మిగతా వాళ్లతో పోలిస్తే వీరిద్దరికే ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ. మన బౌలర్లు చెలరేగితే కచ్చితంగా సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవొచ్చు. కానీ.. అంతకంటే ముందు మన బ్యాటర్లు మెరుగ్గా రాణించాల్సి ఉంటుంది.
స్కోరు బోర్డు మీద తగినన్ని పరుగులు ఉంచాలి. లేదంటే.. బౌలర్లు ఒత్తిడిలో కూరుకుపోతారు’’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం భారమంతా రోహిత్, కోహ్లిలపైనే ఉందని పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు టీమిండియా పేసర్ మహ్మద్ షమీ, రుతురాజ్ గాయాల కారణంగా.. ఇషాన్ కిషన్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యారు.
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు బీసీసీఐ తొలుత ప్రకటించిన జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ షమీ*.
Comments
Please login to add a commentAdd a comment