చరిత్ర సృష్టించిన తిలక్‌ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా.. | Ind vs SA Tilak Varma Creates History Becomes First Player In World To | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన తిలక్‌ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా ఘనత

Published Thu, Nov 14 2024 11:00 AM | Last Updated on Thu, Nov 14 2024 2:38 PM

Ind vs SA Tilak Varma Creates History Becomes First Player In World To

టీమిండియా యువ సంచలనం తిలక్‌ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో మూడో టీ20లో సహచర ఆటగాళ్లు విఫలమైన వేళ విధ్వంసకర శతకంతో విరుచుకుపడి జట్టుకు గెలుపు అందించాడు. ఈ క్రమంలో తన పేరిట ఓ అరుదైన రికార్డునూ లిఖించుకున్నాడు. ప్రొటిస్‌ జట్టుపై.. ప్రపంచంలో ఇంతవరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని ఫీట్‌ నమోదు చేశాడు.

మళ్లీ గెలుపు బాట
కాగా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో ఘన విజయంతో సిరీస్‌ మొదలుపెట్టిన సూర్యసేన.. రెండో టీ20లో మాత్రం ఓడిపోయింది. ఈ క్రమంలో సెంచూరియన్‌ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో తిరిగి పుంజుకుని.. మళ్లీ గెలుపు బాటపట్టింది.

అభిషేక్‌ శర్మ ధనాధన్‌ హాఫ్‌ సెంచరీ
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆతిథ్య సౌతాఫ్రికా.. భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లలో సంజూ శాంసన్‌(0) మరోసారి డకౌట్‌ కాగా.. అభిషేక్‌ శర్మ(25 బంతుల్లో 50) ధనాధన్‌ హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన హైదారాబాదీ ఠాకూర్‌ తిలక్‌ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

ఆఖరి వరకు అజేయంగా తిలక్‌
వరుసగా వికెట్లు పడుతున్నా.. అభిషేక్‌తో కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. కేవలం 56 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాదిన ఈ లెఫ్టాండర్‌.. 107 పరుగులు సాధించాడు. ప్రొటిస్‌ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. జట్టుకు భారీ స్కోరు(219-6)అందించాడు.

ఈ క్రమంలో కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆఖరి వరకు పోరాడింది. అయితే, నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన ఆతిథ్య జట్టు.. 208 పరుగుల వద్దే నిలిచిపోయింది. దీంతో పదకొండు పరుగుల తేడాతో టీమిండియా గెలుపొంది.. సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.

ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
ఇదిలా ఉంటే.. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత తిలక్‌ వర్మ ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌ ఇది. కెరీర్‌లో తొలి అంతర్జాతీయ శతకాన్ని ఏకంగా సఫారీ గడ్డపై బాదడం విశేషం. ఈ క్రమంలో 22 ఏళ్ల తిలక్‌ వర్మ ఓ అరుదైన రికార్డు సాధించాడు. సౌతాఫ్రికా జట్టుపై అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అదే విధంగా.. చిన్న వయసులోనే టీమిండియా తరఫున టీ20 శతకం బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు.

సౌతాఫ్రికాపై పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాళ్లు
తిలక్‌ వర్మ(ఇండియా)- 22 ఏళ్ల, 5 రోజుల వయసులో  2024- సెంచూరియన్‌ వేదికగా..
సురేశ్‌ రైనా(ఇండియా)- 23 ఏళ్ల, 156 రోజుల వయసులో  2010- గ్రాస్ ఐస్‌లెట్‌ వేదికగా
మార్టిన్‌ గఫ్టిల్‌(న్యూజిలాండ్‌)- 26 ఏళ్ల, 84 రోజుల వయసులో- 2012- ఈస్ట్‌ లండన్‌
బాబర్‌ ఆజం(పాకిస్తాన్‌)- 26 ఏళ్ల, 181 రోజుల వయసులో- 2021- సెంచూరియన్‌
క్రిస్‌ గేల్‌(వెస్టిండీస్‌)- 27 ఏళ్ల 355 రోజుల వయసులో- 2007- జొహన్నస్‌బర్గ్‌.

టీమిండియా తరఫున చిన్న వయసులో టీ20 సెంచరీ సాధించిన ఆటగాళ్లు
యశస్వి జైస్వాల్‌- 2023లో నేపాల్‌ మీద- 21 ఏళ్ల 279 రోజుల వయసులో
తిలక్‌ వర్మ- 2024లొ సౌతాఫ్రికా మీద- 22 ఏళ్ల 5 రోజుల వయసులో
శుబ్‌మన్‌ గిల్‌(126*)- 2023లో న్యూజిలాండ్‌ మీద- 23 ఏళ్ల 146 రోజుల వయసులో
సురేశ్‌ రైనా(101)- 2010లో సౌతాఫ్రికా మీద- 23 ఏళ్ల 156 రోజుల వయసులో ఈ ఘనత సాధించారు.

చదవండి: Asia Cup 2024: భారత జట్టు ప్రకటన.. 13 ఏళ్ల కుర్రాడికి చోటు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement