జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో టీమిండియా 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది.
సంజూ శాంసన్ (45 బంతుల్లో 58; ఫోర్, 4 సిక్సర్ల, రెండు క్యాచ్‌లు), ముకేశ్ కుమార్ (3.3-0-22-4), శివమ్ దూబే (12 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు, 4-0-25-2) అద్భుతంగా రాణించి టీమిండియాకు ఘన విజయాన్నందించారు. ఈ గెలుపుతో భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్‌లో గెలవగా.. భారత్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో జయభేరి మోగించింది.
చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్
ఈ సిరీస్‌లో నాలుగు టీ20లు గెలవడంతో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. విదేశీ గడ్డపై ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో నాలుగు టీ20లు గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. శుభ్‌మన్.. కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లో ఈ భారీ రికార్డు సాధించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ కోల్పోయిన గిల్.. ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో జట్టును విజయపథాన నడిపించాడు.
భారత టీ20 జట్టుకు 14వ కెప్టెన్ అయిన గిల్.. రోహిత్ శర్మ (50), ధోని (42), విరాట్ కోహ్లి (32), హార్దిక్ పాండ్యా (10), సూర్యకుమార్ యాదవ్ (5) తర్వాత అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు.
Comments
Please login to add a commentAdd a comment