అంతర్జాతీయ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్
రాత్రి. గం. 7:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఇంటర్ కాంటినెంటల్ ఫుట్ బాల్ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్ నగరం ఇప్పుడు మరో అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు వేదిక కానుంది. గచ్చిబౌలి వేదికగా నేడు మలేసియాతో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు స్నేహపూర్వక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడమే ఏకైక లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ ఏడాది ఆరంభంలో ఏఎఫ్‌సీ ఆసియా కప్ సందర్భంగా గాయపడి తిరిగి కోలుకున్న సీనియర్ డిఫెండర్ సందేశ్ జింగాన్ 10 నెలల తర్వాత పునరాగమనం చేయనుండటంతో భారత జట్టు డిఫెన్స్ బలం మరింత పెరగనుంది.
చివరగా భారత జట్టు హైదరాబాద్‌లో ఆడిన మ్యాచ్‌ల్లో మారిషస్, వియత్నాంతో ‘డ్రా’ చేసుకొని సిరియా చేతిలో 0–3తో పరాజయం పాలైంది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న 2027 ఆసియా కప్ క్వాలిఫయర్స్‌కు ముందు భారత ఫుట్‌బాల్ జట్టుకు ఇదే చివరి మ్యాచ్. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 32 మ్యాచ్‌లు జరగగా... చెరో 12 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. మరో ఎనిమిది మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.
భారత ఫుట్‌బాల్ జట్టు ఇప్పటి వరకు అత్యధిక సార్లు తలపడిన జట్టు మలేసియానే కావడం విశేషం. ఫిఫా ప్రపంచ ర్యాకింగ్స్‌లో ప్రస్తుతం భారత జట్టు 125వ స్థానంలో ఉండగా... మలేసియా 133వ ప్లేస్‌లో ఉంది. అయితే విదేశీ ఆటగాళ్లను జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించడంతో మలేసియా జట్టు... టీమిండియా కంటే మెరుగైన స్థితిలో కనిపిస్తోంది. భారత జట్టు తరఫున గోల్ కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధు, సందేశ్ జింగాన్, మెహతాబ్, విశాల్, రోషన్ సింగ్, అమరిందర్ సింగ్, సురేశ్ సింగ్ కీలకం కానున్నారు.
భారత ఆటగాళ్లకు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) అనుభవం ఈ మ్యాచ్‌లో కలిసిరానుంది. ఈ ఏడాది ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఆరింట ఓడి, మరో నాలుగు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకున్న భారత్... తొలి విజయం కోసం ఎదురు చూస్తోంది. ఆసక్తి గల అభిమానులు ్టజీఛిజ్ఛ్టుజ్ఛnజ్ఛీ.జీn లో మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment