India Vs England 2021 1st Test Live Updates | Today 1st Test Match India Vs England Live - Sakshi
Sakshi News home page

India Vs England 2021: మూడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

Published Fri, Feb 5 2021 9:13 AM | Last Updated on Fri, Feb 5 2021 5:51 PM

India Vs England 2021: Day 1 Highlights Of 1st Test Series - Sakshi

చెన్నై: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలిరోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్‌ జట్టు 89.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. కెప్టెన్‌ జో రూట్‌ 128 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా సెంచరీకి 13 పరుగుల దూరంలో ఓపెనర్‌ డొమినిక్‌ సిబ్లి 87 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. రూట్‌, సిబ్లీ మధ్య 390 బంతుల్లో 200 పరుగుల భాగస్వామ్యం నమోదవడం విశేషం. జో రూట్‌ తన 100వ టెస్టు మ్యాచ్‌లో 20వ సెంచరీతో మెరవడం తొలిరోజు ఆటలో హైలెట్‌గా నిలిచింది. తొలిరోజు ఆటలో సింహభాగం ఇంగ్లండ్‌ జట్టు తన ఆధిపత్యం ప్రదర్శించింది. భారత బౌలర్లు రోజంతా కష్టపడినా మూడు వికెట్లు మాత్రమే తీయగలిగారు. భారత బౌలర్లలో బుమ్రా రెండు, అశ్విన్‌ ఒక వికెట్‌ తీశాడు. 

 హైలెట్స్‌:
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ శతకం సాధించాడు. 164 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు.

టెస్టుల్లో 20వ సెంచరీ సాధించడంతో పాటు 100వ టెస్టులో సెంచరీ సాధించిన ఆటగాడిగా.. అటు కెప్టెన్‌గా రూట్‌ అరుదైన ఘనతను పొందాడు. 

కెప్టెన్‌ జో రూట్‌ అర్థసెంచరీ సాధించి సెంచరీ వైపు దూసుకెళుతుండగా.. ఓపెనర్‌ డొమినిక్‌ సిబ్లి నిలకడగా ఆడుతున్నాడు. టీ విరామం అనంతరం ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ మరింత ఫుంజుకుంది. ముఖ్యంగా రూట్‌ తన ఆటకు కాస్త భిన్నంగా ఆడుతున్నాడు.

116 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసిన రూట్‌ తన కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్‌లో 50వ అర్థసెంచరీని పూర్తి చేయడం విశేషం. .

రెండో సెషన్‌ ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ స్కోరు 140-2గా నమోదైంది. సిబ్లీ అర్ధ సెంచరీ(53) పూర్తి చేసుకోగా, జో రూట్‌ (45) సైతం హాఫ్‌ సెంచరీకి చేరువలో ఉన్నాడు. వీరిద్దరి జోడి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.

► లంచ్‌ విరామానికి ముందు రెండు ఓవర్ల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ డెమినిక్‌ సిబ్లీ (178 బంతుల్లో 53; 7 ఫోర్లు) జో రూట్ (95 బంతుల్లో 44; 5 ఫోర్లు)‌ రాణించారు.

50 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ స్కోరు 122-2.

టీమిండియాతో చెపాక్‌ స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్టులో ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయింది. 63 పరుగుల వద్ద ఓపెనర్‌ బర్న్స్‌ అవుట్‌ కాగా, వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన డానియల్‌ లారెన్స్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి బర్న్స్‌ పెవిలియన్‌ చేరాడు. ఇక లారెన్స్‌, బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కాగా బుమ్రాకు స్వదేశంలో ఇదే తొలి టెస్టు వికెట్‌ కావడం విశేషం. లంచ్‌బ్రేక్‌ సమయానికి ఇంగ్లండ్‌ స్కోరు 67/2. 

ఇక అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు జట్టుకు ఓపెనర్లు బర్న్స్‌, సిబ్లీ శుభారంభం అందించారు. తొలి వికెట్‌ పడే సమయానికి 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బర్న్స్‌ 60 బంతులు ఎదుర్కొని 33 పరుగులు చేశాడు. ఇందులో రెండు బౌండరీలు ఉన్నాయి. అయితే వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోవడంతో పర్యాటక జట్టుకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కాగా ఆస్ట్రేలియా గడ్డపై చిరస్మరణీయ టెస్టు విజయంతో ఈ ఏడాదిని ప్రారంభించిన భారత జట్టు నేటి నుంచి ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది.(చదవండి: టీమిండియాకు జో రూట్‌ వార్నింగ్‌)


► లంచ్‌బ్రేక్‌ సమయానికి ఇంగ్లండ్‌ స్కోరు 67/2(27). అశ్విన్‌, బుమ్రా చెరో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

పది ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్‌ స్కోరు: 20/0. ఇషాంత్‌, బుమ్రా, అశ్విన్‌ వరుస ఓవర్లలో బౌలింగ్‌ అటాక్‌ కొనసాగిస్తున్నారు. 

సీమర్‌ ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌ బౌలింగ్‌ అటాక్‌ ప్రారంభించాడు. ఇక ఐదు ఓవర్లు ముగిసే సరికి.. పర్యాటక జట్టు 10 పరుగులు చేసింది. ఓపెనర్లు రోరీ బర్న్స్‌, సిబ్లీ క్రీజులో ఉన్నారు. 

మాజీ సైనికుడు, రెండో ప్రపంచ యుద్ధం కెప్టెన్‌ సర్‌ టామ్‌ మూర్‌(100) మరణానికి సంతాప సూచకంగా ఇంగ్లండ్‌ ఆటగాళ్లు నలుపు రంగు ఆర్మ్‌బాండ్స్‌ ధరించి మైదానంలో దిగారు. కరోనా నేపథ్యంలో బ్రిటన్‌ నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ సర్వీస్‌కోసం విరాళాలు సేకరించిన ఆయన కొన్ని రోజుల క్రితం మహమ్మారి బారిన పడి కన్నుమూశారు.

స్పిన్నర్ల పాత్రే కీలకం..
చెన్నైలోని చెపాక్‌ మైదానంలో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి టెస్టు ఆరంభమైంది. కాగా టాస్‌ గెలిచిన పర్యాటక జట్టు కెప్టెన్‌ జో రూట్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇక అతడికి ఇది వందో టెస్టు కావడం విశేషం. మరోవైపు.. టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు స్వదేశంలో ఇదే మొదటి టెస్టు కావడం గమనార్హం. కాగా.. ఈ టెస్టు సిరీస్‌లో స్పిన్నర్లదే కీలక పాత్ర కానుంది. ఈ నేపథ్యంలో భారత్‌ ముగ్గురు స్పిన్నర్ల(అశ్విన్‌, సుందర్‌, నదీం)తో బరిలోకి దిగింది. 

ఇక బెన్‌స్టోక్స్‌, ఆర్చర్‌ రాకతో ఇంగ్లండ్‌ పటిష్టంగా తయారైంది. ఇక ఆసీస్‌పై సిరీస్‌ విజయంతో టీమిండియా ధీమాగా ఉండగా.. శ్రీలంకను ఓడించిన జో రూట్‌ సేన సైతం గట్టిపోటీకి సై అంటోంది. దీంతో హోరాహోరీ సంగ్రామాన్ని టీవీల్లో వీక్షించేందుకు క్రికెట్‌ ప్రేమికులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు.(చదవండి: కరోనా తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్)


టీమిండియాకు ఎదురుదెబ్బ

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఆరంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి నొప్పి కారణంగా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. కాగా గురువారం ట్రెయినింగ్‌ సెషన్‌లో ఉన్న సమయంలో నొప్పితో విలవిల్లాడిన అక్షర్‌ పటేల్‌ మ్యాచ్‌ ఆరంభ సమయానికి అందుబాటులో ఉండే అవకాశం లేదని బీసీసీఐ వెల్లడించింది. ఈ నేపథ్యంలో నదీం, వాషింగ్టన్‌ సుందర్‌ జట్టులో చేరారు. కాగా గాయం కారణంగా జట్టుకు దూరమైన, స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా స్థానంలో ఈ గుజరాత్‌ స్పిన్నర్‌ను బీసీసీఐ తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

టీమిండియా తుది జట్టు: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), అజింక్య రహానే, రిషభ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇషాంత్‌, బుమ్రా, షాబాజ్‌ నదీం
ఇంగ్లండ్‌: బర్న్స్‌, సిబ్లీ, లారెన్స్‌, జో రూట్‌(కెప్టెన్‌), స్టోక్స్‌, ఓలి పోప్‌, బట్లర్‌, బెన్‌, ఆర్చర్‌, జాక్‌లీచ్‌, అండర్సన్‌ 

కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) నేపథ్యంలో... సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగే ఈ సిరీస్‌ను గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా కోహ్లి సేన డబ్ల్యూటీసీ ఫైనల్లోకి చేరుతుంది. ఇక పర్యాటక ఇంగ్లండ్‌కూ కివీస్‌తో తలపడే అవకాశమున్నా... అది ఎంతో దూరంలో, మరెంతో కష్టంతో ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ రేసుకు ఇరు జట్ల మధ్య జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌ రసవత్తరంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా భారత్‌లో... బయో బబుల్‌లో జరగనున్న తొలి మ్యాచ్‌ ఇదే కావడం విశేషం.

పిచ్, వాతావరణం 
వాతావరణంతో ఏ సమస్యా లేదు. వర్షం బెడద లేదు. మ్యాచ్‌ పైనే దృష్టి సారించొచ్చు. కొంత బౌన్స్‌ ఉన్న పిచ్‌ పూర్తిగా స్పిన్నర్లకు కాకుండా  పేస్‌కు కూడా అనుకూలిస్తుందని అంచనా. వికెట్‌పై స్వల్పంగా పచ్చిక కనిపిస్తోంది.

చదవండి: 
బుమ్రాకు 'తొలి' టెస్టు.. ఐసీసీ ఆల్‌ ది బెస్ట్‌

టీమిండియాకు జో రూట్‌ వార్నింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement