
న్యూఢిల్లీ: భారత్- శ్రీలంక మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కరోనా సెగ తగిలింది. శ్రీలంక జట్టులో వరుసగా కరోనా కేసుల బయటపడుతుండటంతో వన్డే, టీ20 సిరీస్‌లను రీషెడ్యూల్ చేయాలని లంక క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య జులై 13(మంగళవారం) తొలి వన్డే జరగాల్సి ఉంది. కానీ ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనను ముగించుకొని వచ్చిన శ్రీలంక జట్టులో 48 గంటల్లోని ఇద్దరు వైరస్ బారిన పడినట్లు బయట పడింది. మొదట బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ కరోనా బారిన పడగా.. శుక్రవారం ఆ టీమ్ డేటా అనలిస్ట్ జీటీ నిరోషన్‌కు పాజిటీవ్ అని తేలింది.
దీంతో శ్రీలంక జట్టు క్వారంటైన్ పొడిగించాలని భావించిన ఆ దేశ క్రికెట్ బోర్డు.. వన్డే సిరీస్‌ను ఐదు రోజుల తర్వాత ప్రారంభించాలని భావిస్తోంది. దీంతో 13న జరగాల్సిన వన్డే సిరీస్‌ను 18వ తేదీ నుంచి జరపనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా పీటీఐకు తెలిపారు. జులై 18వ తేదీన తొలి వన్డే, 20వ తేదీన రెండో వన్డే, 23వ తేదీఏన మూడో వన్డే జరుగనుంది. వాస్తవానికి జులై 13, 16, 18 తేదీల్లో మూడు వన్డేలు జరగాల్సి ఉంది. ఇక ముందస్తు షెడ్యూల్ ప్రకారం 21, 23, 25 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగాల్సి ఉండగా, దానిని 25,27,29 తేదీల్లో జరిపేందుకు దాదాపు షెడ్యూల్ ఖరారైంది.