కొలొంబో: లంక బృందంలో వరుసగా కరోనా కేసులు బయటపడుతున్న నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు ఆటగాళ్లందరికీ మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో ఆటగాళ్లందరికీ నెగిటివ్ రిపోర్టు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భారత్‌తో సిరీస్ నిమిత్తం వీరంతా సోమవారం నుంచి బయోబుడగలోకి వెళ్తారు. మరోవైపు భారత్‌తో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్‌లను లంక క్రికెట్ బోర్డు రీ షెడ్యూల్ చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకావాల్సి ఉండింది. అయితే కరోనా దెబ్బకు ఈ సిరీస్ 5 రోజులు ఆలస్యంగా ప్రారంభంకానుంది. ఈ నెల 18 నుంచి నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుందని బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న శ్రీలంక జట్టులో బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్‌తో పాటు డేటా అనలిస్టు నీరోషన్, జట్టు సభ్యుడు, క్రికెటర్ సందున్ వీరక్కోడిలకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో వీరంతా వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ముగ్గురిలో ఎలాంటి లక్షణాలు లేవని లంక యాజమాన్యం ప్రకటించింది. మొత్తంగా లంక ఆటగాళ్లకు కరోనా పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు రావడంతో సిరీస్ సజావుగా సాగే అవకాశాలున్నాయి. ఇరు జట్లు కఠిన నిబంధనలు పాటించి, కొత్త కేసులు రాకుండా జాగ్రత్త పడితే, మరో వారం రోజుల్లో అభిమానులు రసవత్తరమైన సిరీస్‌ను ఆస్వాధించే ఆస్కారం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment