3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు ఇవాళ (జులై 9) జరిగిన తొలి టీ20లో భారీ విజయం సాధించింది. తొలుత బౌలర్లు, ఆతర్వాత బ్యాటర్లు తలో చేయి వేయడంతో టీమిండియా అలవోకంగా బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ప్రత్యర్ధిని 114 పరుగుల స్వల్ప స్కోర్‌కే (5 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. పూజా వస్త్రాకర్ (4-1-16-1), షఫాలీ వర్మ (3-0-18-1), మిన్నూ మణి (3-0-20-1) పొదుపుగా బౌలింగ్ చేసి తలో వికెట్ తీయగా.. ఆంధ్రప్రదేశ్ (అనంతపురం) అమ్మాయి బారెడ్డి అనూష (4-0-24-0) పర్వాలేదనిపించింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో షాతి రాణి (22), శోభన మోస్టరీ (23), షోర్ణా అక్తెర్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
అనంతరం బరిలోకి దిగిన భారత్.. 16.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలింతగా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
రాణించిన మంధన.. మెరిసిన హర్మన్
115 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో భారత్ ఆరంభంలోనే షఫాలీ వర్మ (0) వికెట్ కోల్పోయినప్పటికీ ధాటిగా ఆడింది. 38 పరుగులతో స్మృతి మంధన రాణించగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (54 నాటౌట్) అర్ధసెంచరీతో మెరిసింది. జెమీమా రోడ్రిగెస్ (11) నిరాశపర్చగా, యస్తికా భాటియా (9 నాటౌట్) సహకారంతో హర్మన్ టీమిండియాను విజయతీరాలకు చేర్చింది. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతూన్ 2 వికెట్లు పడగొట్టగా.. మరుఫా అక్తెర్ ఓ వికెట్ దక్కించుకుంది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 జులై 11న జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment