బాక్సింగ్ డే టెస్ట్ దగ్గర పడే కొద్దీ భారత్, ఆస్ట్రేలియా జట్లలో వేడెక్కువవుతోంది. ఈ సిరీస్ లో రెండు జట్లు 1-1తో సమఉజ్జీలుగా ఉండటం, అదీ క్రిస్టమస్ పర్వ దినం తర్వాత బాక్సింగ్ డే నుంచి ఈ మ్యాచ్ జరుగనున్న తరుణంలో ప్రతిష్టాత్మకమైన ఈ టెస్ట్ లో గెలిచేందుకు రెండు జట్లు పై ఒత్తిడీ ఎక్కువగా ఉంటుందనడంలో సందేహం లేదు. క్రిస్టమస్ సెలవల్లో 90,000 ప్రేక్షకుల మధ్య మెల్బోర్న్ వేదిక పై ఈ మ్యాచ్ జరగడం, ఆస్ట్రేలియా క్రికెట్ సీజన్లో ఈ టెస్ట్ మ్యాచ్ చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు.
ఆశాజనకంగా భారత్..
అయితే మెల్బోర్న్ వేదిక పై భారత్ కి మంచి రికార్డు ఉండటం రోహిత్ సేనకు అనుకూలమైన అంశం కాగా, ఈ మ్యాచ్ కి రోహిత్ తన సన్నద్ధత తెలపడం మరో ప్రధానాంశం. ఆదివారం జరిగిన ప్రాక్టీస్ కు రోహిత్ ఎడమ మోకాలికి గాయం కారణంగా దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
కాగా భారత్ జట్టుకి ప్రధాన అడ్డంకిగా ఉన్న ఆస్ట్రేలియా ఎడమచేతివాటం బ్యాట్సమెన్ ట్రావిస్ హెడ్ గాయం కారణంగా వైదొలిగే అవకాశం ఉండటం మరో కీలకమైన పరిణామం. ఈ సిరీస్ లో ట్రావిస్ హెడ్ విజృంభించి రెండు, మూడు టెస్టుల్లో వరుసగా సెంచరీలు సాధించి, ఇప్పటికే 81 .80 సగటుతో మొత్తం 409 పరుగులు సాధించిన విషయం తెలిసిందే.
అరుదైన రికార్డు చేరువలో రాహుల్
బాక్సింగ్ డే న ప్రారంభమైన గత రెండు టెస్టుల్లో భారత్ ఓపెనర్ కె ఎల్ రాహుల్ వరుసగా రెండు సెంచరీలు సాధించడం విశేషం. 2021 లో దక్షిణాఫ్రికాతో సెంచురియన్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో రాహుల్ 124 పరుగులు సాధించాడు. మళ్ళీ అదే వేదికపై రెండేళ్ల అనంతరం జరిగిన టెస్ట్ లో రాహుల్ 101 పరుగులతో మరో సెంచరీ సాధించాడు.
2014 లో మెల్బోర్న్ లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో రాహుల్ పేలవంగా ఆడి కేవలం 3, 1 పరుగులు మాత్రమే సాధించాడు. అయితే ప్రస్తుత సిరీస్ లో మూడు టెస్ట్ మ్యాచ్ ల్లో 235 పరుగులు సాధించి, భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడుగా మంచి ఫామ్ లో ఉన్నందున, రాహుల్ ఈ టెస్ట్ మ్యాచ్ లో రాణిస్తాడని భారత్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
గతంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి 2014 లో మెల్బోర్న్ వేదిక పై జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో 169 పరుగులతో సెంచరీ సాధించాడు. అయితే ఈ మ్యాచ్ లో భారత్ పరాజయం చవిచూసింది. అయితే కోహ్లీకి ఆస్ట్రేలియా గడ్డపై 16 టెస్ట్ మ్యాచ్ ల్లో 1,478 పరుగులు సాధించి, అక్కడ అత్యధిక పరుగులు సాధించిన భారత్ బ్యాట్సమెన్ గా రికార్డు ఉంది. అత్యంత ప్రాధాన్యత గల మ్యాచ్ ల్లో రాణించే బ్యాట్సమెన్ గా ఖ్యాతి గడించిన కోహ్లీ మరోసారి విజృంభింస్తాడని భారత్ జట్టు ఆశిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment