నేటి నుంచి భారత షూటర్ల పతకాల వేట
తొలి రోజు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్
బరిలో రెండు భారత జోడీలు
విశ్వ క్రీడల ప్రారంబోత్సవం ముగిసింది. ఇక నేటి నుంచి పతకాల వేట మొదలుకానుంది. భారత్ విషయానికొస్తే తొలి రోజు శనివారం షూటింగ్ క్రీడాంశంలో మన షూటర్లు పతకాల కోసం తమ తుపాకీలకు పని చెప్పనున్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ నుంచి రెండు జోడీలు ముందుగా క్వాలిఫయింగ్‌లో పోటీపడనున్నాయి. క్వాలిఫయింగ్‌లో టాప్–4లో నిలిచిన నాలుగు జోడీలు స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం పోటీపడతాయి.
పారిస్: ఒలింపిక్స్ క్రీడల్లో భారత షూటర్లు పతకాలు సాధించి పుష్కరకాలం గడిచింది. చివరిసారి 2012 లండన్ ఒలింపిక్స్‌లో గగన్ నారంగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించగా... విజయ్ కుమార్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో రజత పతకం గెలిచాడు. ఆ తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌లో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత షూటర్లు గురి తప్పారు. ఒక్క పతకం కూడా నెగ్గకుండానే రిక్తహస్తాలతో తిరిగి వచ్చారు.
ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో రికార్డుస్థాయిలో భారత్ నుంచి అత్యధికంగా 21 మంది షూటర్లు అర్హత సాధించారు. ప్రతి మెడల్ ఈవెంట్‌లో భారత షూటర్లు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం షూటర్లకు తొలి పరీక్ష ఎదురుకానుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మెడల్ ఈవెంట్ ఉంది. ఈ విభాగంలో భారత్ నుంచి అర్జున్ బబూటా–రమితా జిందాల్ జోడీ... సందీప్ సింగ్–ఇలవేనిల్ వలారివన్ జోడీ పోటీపడతాయి.
ఓవరాల్‌గా 28 జోడీలు క్వాలిఫయింగ్‌లో ఉన్నాయి. క్వాలిఫయింగ్ ముగిశాక టాప్–4లో నిలిచిన జోడీలు మెడల్ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. టాప్–2లో నిలిచిన జంటలు స్వర్ణ–రజత పతకాల కోసం... మూడు–నాలుగు స్థానాల్లో నిలిచిన జోడీలు కాంస్య పతకం కోసం పోటీపడతాయి.
శనివారమే పురుషుల, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్ ఈవెంట్ జరుగుతుంది.
షూటింగ్
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫయింగ్: సందీప్ సింగ్/ఇలవేనిల్ వలారివన్; అర్జున్ బబూటా/రమితా జిందాల్ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). ఫైనల్: మధ్యాహ్నం గం. 2 నుంచి పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్: అర్జున్ సింగ్ చీమా, సరబ్‌జోత్ సింగ్ (మధ్యాహ్నం గం. 2 నుంచి) మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్: మనూ భాకర్, రిథమ్ సాంగ్వాన్ (సాయంత్రం గం. 4 నుంచి).
Comments
Please login to add a commentAdd a comment