ఫైనల్ చేరలేకపోయిన భారత షూటర్లు
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో... మహిళల స్కీట్ ఈవెంట్‌లో భారత క్రీడాకారులకు నిరాశ ఎదురైంది. ఆదివారం క్వాలిఫికేషన్ రౌండ్ ఆరంభంలో ఆకట్టుకున్న భారత షూటర్లు విజయ్‌వీర్ సిద్ధూ, అనీశ్ భన్వాలా చివరి వరకు అదే జోరు కొనసాగించలేక.. ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయారు. విజయ్‌వీర్ 583 పాయింట్లతో తొమ్మిదో స్థానానికి పరిమితం కాగా... అనీశ్ 582 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచాడు.
ఒక దశలో రెండో స్థానానికి చేరి ఆశలు రేపిన విజయ్‌వీర్ ఆ తర్వాత గురి తప్పడంతో తుదిపోరుకు చేరకుండానే వెనుదిరిగాడు. తొలి ఆరు స్థానాల్లో నిలిచిన షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. మహిళల స్కీట్ విభాగంలో మహేశ్వరి చౌహాన్ (118 పాయింట్లు) 14వ స్థానం, రైజా ధిల్లాన్ (113 పాయింట్లు) 23వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. నేటితో ఒలింపిక్స్‌లో షూటింగ్ ఈవెంట్ ముగుస్తుంది.
చివరిరోజు స్కీట్ మిక్స్‌డ్ విభాగంలో భారత్ నుంచి మహేశ్వరి చౌహాన్, అనంత్‌జీత్ సింగ్ నరూకా జోడీ పోటీపడనుంది. మొత్తం 15 జోడీలు క్వాలిఫయింగ్‌లో ఉన్నాయి. టాప్–4లో నిలిచిన జోడీలు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. టాప్–2లో నిలిచిన రెండు జంటలు స్వర్ణ–రజత పతకాల కోసం... మూడు–నాలుగు స్థానాల్లో నిలిచిన రెండు జోడీలు కాంస్య పతకం కోసం పోటీపడతాయి.
శుభాంకర్ 40వ స్థానంలో...
పారిస్ ఒలింపిక్స్ గోల్ఫ్ పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో భారత్‌కు నిరాశ తప్పలేదు. ఈ విభాగంలో పోటీపడిన శుభాంకర్ శర్మ 40వ స్థానంలో నిలవగా ... గగన్‌జీత్ సింగ్ భుల్లర్ 45వ ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు. శుభాంకర్ ఓవరాల్‌గా 283 పాయింట్లు సాధించగా.. గగన్‌జీత్ 285 పాయింట్లతో ఆకట్టుకోలేకపోయారు.
సెయిలింగ్ డింగీ విభాగంలో 8 రేసులు ముగిసేసరికి పురుషుల విభాగంలో భారత సెయిలర్ విష్ణు శరవణన్ 18వ స్థానంలో.. మహిళల విభాగంలో నేత్ర కుమానన్ 25వ స్థానంలో నిలిచారు. నేడు మరో రెండు రేసులు జరగాల్సి ఉంది. మొత్తం పది రేసుల్లో టాప్–10లో నిలిచిన సెయిలర్లు పతక పోరుకు అర్హత సాధిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment