న్యూఢిల్లీ: వచ్చే నెలలో మలేసియాలో జరిగే అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ముగ్గురు తెలుగు అమ్మాయిలు గొంగడి త్రిష, కేసరి ధృతి (తెలంగాణ), షబ్నమ్ (ఆంధ్రప్రదేశ్) చోటు దక్కించుకున్నారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది.
భారత జట్టుకు నిక్కీ ప్రసాద్ కెప్టెన్ గా, సనికా చాల్కె వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. 2023లో తొలిసారి నిర్వహించిన మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్‌లో షఫాలీ వర్మ సారథ్యంలో భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. త్రిష, షబ్నమ్ నాటి విజేత జట్టులో సభ్యులుగా ఉన్నారు. త్రిష, షబ్నమ్‌లకిది రెండో టి20 ప్రపంచకప్ కానుంది.
గత ఆదివారం కౌలాలంపూర్‌లో జరిగిన ఆసియా కప్ అండర్–19 టి20 టోర్నీలో భారత జట్టుకు టైటిల్ దక్కడంలో త్రిష కీలకపాత్ర పోషించింది. త్రిష ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’తోపాటు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు గెల్చుకుంది. టి20 ప్రపంచకప్‌లో మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్‌లుగా పోటీ పడనున్నాయి. ఆతిథ్య మలేసియా, వెస్టిండీస్, శ్రీలంకతో కలిసి భారత జట్టు గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనుంది.
తమ తొలి మ్యాచ్‌లో భాతర అమ్మాయిల జట్టు జనవరి 19న వెస్టిండీస్‌తో, 21న మలేసియాతో, 23న శ్రీలంకతో తలపడుతుంది. గ్రూప్ దశ ముగిశాక పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ‘సూపర్ సిక్స్’ దశకు అర్హత సాధిస్తాయి. ‘సూపర్ సిక్స్’ను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. ఇందులో మెరుగైన ప్రదర్శన కనబర్చిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు చేరతాయి.
భారత టి20 జట్టు: నిక్కీ ప్రసాద్ (కెప్టెన్ ), సనికా చాల్కె (వైస్ కెప్టెన్ ), గొంగడి త్రిష, కమిళిని, భవిక అహిరె, ఈశ్వరి అవసారె, మిథిల, వీజే జోషిత, సోనమ్ యాదవ్, పరుణిక సిసోడియా, కేసరి ధృతి, ఆయూషి శుక్లా, అనందిత, షబ్నమ్, వైష్ణవి.
Comments
Please login to add a commentAdd a comment