పంజాబ్ కింగ్స్ ఆటగాడు జై రిచర్డ్‌సన్(ఫొటో కర్టెసీ: బీసీసీఐ/ఐపీఎల్)
ముంబై: బిగ్‌బాష్ లీగ్- 2020- 21లో రాణించిన ఆస్ట్రేలియా బౌలర్ జై రిచర్డ్‌సన్ ఐపీఎల్-14వ ఎడిషన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. బీబీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడి, 27 వికెట్లు తీసిన ఈ ఆటగాడిని మినీ వేలంలో భాగంగా పంజాబ్ ఫ్రాంఛైజీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరవై నాలుగేళ్ల ఈ యువ పేసర్‌ను దక్కించుకునేందుకు కళ్లు చెదిరే రీతిలో 14 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇక సోమవారం నాటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్- రాజస్తాన్ రాయల్స్ తొలి పోరులో ఆడే అవకాశం దక్కించుకున్న రిచర్డ్‌సన్ మ్యాచ్‌కు ముందు స్పోర్ట్స్ టుడేతో మాట్లాడుతూ.. వేలం నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు.
‘‘తొలుత కాస్త భయం వేసింది. మరీ ఇంత ధర అంటే అంచనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి కదా. నిజానికి వేలం జరుగుతున్న సమయంలో నేను న్యూజిలాండ్‌లో ఉన్నాను. అప్పటికే రాత్రి అయిపోయింది. వేలం నా జీవితాన్ని మార్చబోతోందని తెలుసు. కచ్చితంగా నా జీవితంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయని అనిపించింది. రూ. 14 కోట్లకు కొనుగోలు చేశారు అనగానే నాలో ఉత్సాహం రెట్టింపు అయింది. అదొక ఉద్విగ్న క్షణం. భవిష్యత్తుకు మంచి ఆధారం. ఒక క్రికెటర్‌గా నాకు ఆర్థిక భద్రత లభించినట్లు అనిపించింది. సాధారణంగా, మాలాంటి ఆటగాళ్ల కెరీర్ 5 నుంచి పదేళ్ల వరకు కొనసాగుతుంది.
ఈలోపే ఆర్థికంగా స్థిరపడాలి. ఈ వేలం నాకు గొప్ప ఊతమిచ్చింది. ఇక ఇంత ధర పెట్టారు అంటే వారి అంచనాలు కూడా ఏ స్థాయిలో ఉంటాయో నేను అర్థం చేసుకోగలను. ఒక క్రికెటర్‌గా ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధమే. ప్రైస్ టాగ్ గురించి నేను బాధపడాల్సిన పనిలేదు. అయితే, నా నైపుణ్యాలు జట్టుకు ఎంత మేరకు ఉపయోగపడతాయి, ఇండియాలో నా సామర్థ్యం నిరూపించుకోగలనా లేదా అన్నదే ప్రస్తుతం నా ముందున్న సవాలు’’ అని రిచర్డ్‌సన్ చెప్పుకొచ్చాడు.
చదవండి: మూడేళ్ల క్రితం క్యాచ్ డ్రాప్ అయ్యింది.. కానీ ఇప్పుడు
వైరల్: షూ తీసి, చెవి దగ్గర పెట్టుకుని.. బౌలర్ సెలబ్రేషన్
Comments
Please login to add a commentAdd a comment