ముంబై: ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను ఆర్‌సీబీ రూ. 14.25 కోట్లకు కొనుగోలు చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడిచింది. దీనికి కారణం ఏంటో అందరికి తెలిసిందే.. గతేడాది సీజన్‌లో కింగ్స్ పంజాబ్( పంజాబ్ కింగ్స్) తరపున ఆడిన మ్యాక్సీ 13 మ్యాచ్‌ల్లో 108 పరుగులు మాత్రమే చేసి దారుణంగా నిరాశపరిచాడు. దీంతో పంజాబ్ అతన్ని వదులుకోగా.. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో సీఎస్‌కే, ఆర్‌సీబీ అతని కోసం పోటీ పడ్డాయి. చివరకు ఆర్‌సీబీ మ్యాక్సీని ఎవరు ఊహించని ధరకు సొంతం చేసుకుంది. అయితే వేలంలో మరోసారి భారీ ధరకు అమ్ముడుపోవడంపై మ్యాక్స్‌వెల్ అప్పటినుంచి స్పందించలేదు. తాజాగా ఆర్‌సీబీ జట్టుతో కలిసిన మ్యాక్సీ ప్రాక్టీస్ను ఆరంభించాడు. ఈ నేపథ్యంలో ఆర్‌సీబీ నిర్వహించిన బోల్డ్ డైరీ ఇంటర్వ్యూలో మ్యాక్సీ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
''వేలంలో మరోసారి భారీ ధర దక్కడంపై నాకు ఆశ్చర్యం అనిపించలేదు. వేలంలో నన్ను దక్కించుకునేందుకు పోటీ ఉంటుందని ముందే ఊహించా. ప్రతీ జట్టులో మిడిలార్డర్‌లో ఒక నిఖార్సైన బ్యాట్స్‌మన్.. ఆల్‌రౌండర్ ఉండాలని భావిస్తాయి. ఆఫ్ స్పిన్ వేయడంతో బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించే నాలాంటి ఆటగాడు కావాలని కోరుకుంటాయి. ఈసారి వేలంలో నాకోసం సీఎస్‌కే, ఆర్‌సీబీ రెండు పోటీ పడినా చివరికి కోహ్లి టీం నన్ను దక్కించుకుంది. గత సీజన్‌లో విఫలమైన మాట నిజమే.. కానీ ప్రతీసారి అదే జరగదు.
ఈసారి ఐపీఎల్ 14వ సీజన్ భారత్‌లో జరుగుతుంది. ఒక కొత్త టీమ్‌తో కలిసి కొత్త వాతావరణంలో ఆడబోతున్నందుకు ఉత్సాహంతో ఉన్నా. కోహ్లితో కలిసి ఇన్నింగ్స్ పంచుకోవడం కోసం ఎదురుచూస్తున్నా. ఆసీస్ నుంచి వచ్చిన తర్వాత ఏడు రోజుల క్వారంటైన్ ముగించుకొని ప్రాక్టీస్‌ను ఆరంభించా. నేను ఎక్కడ ఉన్నా.. జట్టులో పాజిటివ్ వాతావరణం ఉండేలా చూసుకోవడం అలవాటుగా చేసుకున్నా. ఈ సీజన్‌లో రాణించి ఆర్‌సీబీకి టైటిల్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా వేలంలో మ్యాక్స్‌వెల్‌ను తీసుకొని దండగని.. ఆర్‌సీబీకీ భారీ మూల్యం తప్పదంటూ మాజీ క్రికెటర్ గంభీర్ విమర్శనాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఆర్‌సీబీ జట్టులో కరోనా కలకలం రేపింది. ఓపెనర్ పడిక్కల్ కరోనా పాజిటివ్ సోకగా... బుధవారం ఆల్‌రౌండర్ డేనియల్ సామ్స్ కరోనా బారిన పడ్డాడు. అయితే పడిక్కల్‌కు కరోనా నెగెటివ్ రావడంతో జట్టుతో కలవడం వారిని కాస్త ఊరట కలిగించింది. ఇక ఆర్‌సీబీ ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 9న ముంబై వేదికగా డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.
చదవండి: మ్యాక్స్‌వెల్‌ను తీసుకొని దండగ.. ఆర్‌సీబీకి భారీ మూల్యం
Bold Diaries: Glenn Maxwell Interview Part 1
— Royal Challengers Bangalore (@RCBTweets) April 7, 2021
Maxwell talks about quarantine life, cricket in the times of Covid-19, the #IPL2021 auction experience, and much more on @myntra presents Bold Diaries.#PlayBold #WeAreChallengers pic.twitter.com/Avw4D5UyzY
Comments
Please login to add a commentAdd a comment