కీరన్ పొలార్డ్‌ను అవుట్ చేసిన ఆనందంలో రషీద్ ఖాన్(PC: IPL/BCCI)
IPL 2022 MI Vs GT: ఐపీఎల్ మెగా వేలం-2022 నేపథ్యంలో వెస్టిండీస్ ‘హిట్టర్’ కీరన్ పొలార్డ్‌ను 6 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ రిటైన్ చేసుకుంది ముంబై ఇండియన్స్. కానీ ఈ సీజన్‌లో అతడు తన స్థాయికి తగ్గట్టు రాణించడం లేదు. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లలో పొలార్డ్ చేసింది కేవలం 129 పరుగులు. అత్యధిక స్కోరు 25.
ఈ గణాంకాలను బట్టి చూస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జట్టులో కీలక సభ్యుడైన పొలార్డ్ వైఫల్యం ముంబై ఇండియన్స్ గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ పొలార్డ్‌ను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం(మే 6) మ్యాచ్‌లో మరోసారి పొలార్డ్ విఫలం కావడంతో అతడి ఆట తీరుపై విమర్శలు తీవ్రమయ్యాయి. ఈ మ్యాచ్‌లో 14 బంతులు ఎదుర్కొన్న ఈ వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. మిగిలి ఉన్న మ్యాచ్‌లలో పొలార్డ్‌పై వేటు తప్పదని అభిప్రాయపడ్డాడు. గుజరాత్‌తో మ్యాచ్ ఈ సీజన్‌లో అతడికి చివరిది కావొచ్చంటూ జోస్యం చెప్పాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా.. ‘‘నాకు తెలిసి కీరన్ పొలార్డ్ ఇక వచ్చే ఏడాది నుంచి ఆడకపోవచ్చు. డెవాల్డ్ బ్రెవిస్ ఉన్నాడు. టిమ్ డేవిడ్ రాణిస్తున్నారు.
కాబట్టి ఇక పొలార్డ్‌ను ఆడించకపోవచ్చు. నిజానికి ముందే వాళ్లు(ముంబై) టిమ్ డేవిడ్‌ను ఎందుకు జట్టులోకి తీసుకురాలేదో తెలియడం లేదు. సిక్సర్లు కొట్టే హిట్టింగ్ మెషీన్‌ను వాళ్లు పక్కకు పెట్టారు’’ అని పేర్కొన్నాడు. ఇక టిమ్ డేవిడ్‌ను తప్పక కొనసాగిస్తారని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
ఇక ఈ సీజన్‌లో సమిష్టి వైఫల్యంతో పదింట కేవలం రెండే మ్యాచ్‌లు గెలిచిన ముంబై ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఇక మిగిలినవి 4 మ్యాచ్‌లు. వీటిలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. కాగా గుజరాత్‌తో మ్యాచ్‌లో ముంబై 5 పరుగుల తేడాతో గెలిచి రెండో విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. 21 బంతుల్లో 44 పరుగులతో అజేయంగా నిలిచిన టిమ్ డేవిడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
చదవండి👉🏾PBKS Vs RR Records: పంజాబ్, రాజస్తాన్.. వాంఖడేలో ఇరు జట్లకు పాపం ఏకంగా!
Comments
Please login to add a commentAdd a comment