ఐపీఎల్ 2024 ఎడిషన్ ప్రారంభానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్ (నిలబెట్టుకోవడం), రిలీజ్ (వేలానికి వదిలేయడం) ప్రక్రియ నిన్నటితో (నవంబర్ 26) ముగిసింది. ఇందులో భాగంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హార్దిక్ ఫ్రాంచైజీ మార్పు ఇందులో ప్రధానమైన అంశం.
గుజరాత్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను రిటైన్ చేసుకున్నట్లే చేసుకుని, ట్రేడింగ్ అంటూ అతన్ని ముంబై ఇండియన్స్‌కి వదిలేసింది. ఈ అనూహ్య పరిణామం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
హార్ధిక్ ముంబై ఇండియన్స్‌కు వచ్చేస్తున్నాడని కొద్దిరోజుల ముందు నుంచే ప్రచారం జరిగినప్పటికీ ఆఖర్లో ప్రాంచైజీకి చెందిన ఓ కీలక వ్యక్తి ఇందుకు నో చెప్పాడని టాక్ వినిపిస్తుంది. అందుకే గుజరాత్ హార్దిక్‌ను రిటైన్ చేసుకుందని, ఈ లోపే ముంబై యాజమాన్యం జోక్యం చేసుకుని హార్దిక్‌ను సొంతగూటికి చేరేలా చేసిందని ప్రచారం జరుగుతుంది.
అసలు హార్దిక్ ఫ్రాంచైజీ మారడమెందుకు..?
ట్రేడింగ్ అనే టాపిక్‌కు ముందు అసలు హార్దిక్ ఫ్రాంచైజీ మారేందుకు ఎందుకు పచ్చ జెండా ఊపాడనే విషయం చర్చయనీయాంశంగా మారింది. టైటాన్స్‌ను అరంగేట్రం ఎడిషన్‌లోనే ఛాంపియన్‌గా, రెండో దఫా రన్నరప్‌గా నిలబెట్టిన హార్దిక్.. అంతా సాఫీగా సాగుతుండగా ఇంతటి కఠినమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడన్న విషయం అభిమానులకు అంతుపట్టడం లేదు.
సోషల్‌మీడియాలో నడుస్తున్న ప్రచారం ప్రకారం హార్దిక్‌కు-టైటాన్స్ మేనేజ్‌మెంట్‌కు రెమ్యూనరేషన్ విషయంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తుంది. ఈ విషయమే హార్దిక్ ఫ్రాంచైజీ మార్పుకు ప్రధాన కారణమని సమాచారం.
Once in a while life would give you an opportunity to choose between money and legacy. Whatever you choose will define you for the rest of your life.
— Aakash Chopra (@cricketaakash) November 27, 2023
ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
హార్దిక్ రెమ్యూనరేషన్ కోసం ఫ్రాంచైజీ మారాడని పరోక్షంగా ఆరోపిస్తూ ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక్కోసారి జీవితంలో డబ్బు, విలువల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఎంచుకున్నదే మీ జీవితాంతం మిమ్మల్ని నిర్వచిస్తూ ఉంటుందని హార్దిక్‌ను ఉద్దేశిస్తూ వివాదాస్పద ట్వీట్ చేశాడు. ఇలాంటి నిరాధారమైన ప్రచారాలను పక్కన పెడితే అసలు హార్దిక్ ఫ్రాంచైజీ ఎందుకు మారాడన్న విషయం ప్రస్తుతం క్రికెట్ అభిమానులకు చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment