
సహచర ఆటగాళ్లను ఆటపట్టించిన తిలక్ వర్మ(PC: Mumbai Indians)
IPL 2022- Mumbai Indians- Tilak Varma: ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ పరిస్థితి ఎలా ఉన్నా ఆ జట్టు ఆటగాడు తిలక్ వర్మ అదరగొడుతున్నాడు. తాజా ఎడిషన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగు కుర్రాడు ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌లలో 307 పరుగులు సాధించి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు.
ఇక ఆట విషయాన్ని పక్కన పెడితే.. సహచర ఆటగాళ్లతో ఇట్టే కలిసిపోయే స్వభావం తిలక్ వర్మది. ముంబై ఇండియన్స్ జట్టులోని యువ ఆటగాళ్లు ముఖ్యంగా దక్షిణాఫ్రికా సంచలనం, జూనియర్ ఏబీడీగా పేరొందిన డెవాల్డ్ బ్రెవిస్‌తో తిలక్‌కు స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి సరదాగా గడిపిన క్షణాలను ఫ్రాంఛైజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
తాజాగా తిలక్‌కు సంబంధించిన ఫన్నీ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇందులో ‘పేస్ట్ బిస్కట్’తో బ్రెవిస్, రిలే మెరెడిత్, టిమ్ డేవిడ్‌ను ఆటపట్టించాడు. అసలేం జరిగిందంటే.. ముందుగా బిస్కట్లలో క్రీమ్ తీసేసిన తిలక్ వర్మ.. దానికి బదులు అందులో పేస్ట్‌ను పూశాడు. ఆ తర్వాత మళ్లీ ఎప్పటిలాగే వాటిని ప్యాక్ చేసి.. మెల్లగా సహచర ఆటగాళ్ల దగ్గరికి వెళ్లాడు. తన చేతిలోని బిస్కట్లు తినమంటూ వారికి ఆఫర్ చేశాడు.
పాపం తిలక్ ‘స్కెచ్’ గురించి తెలియని డేవిడ్, బ్రెవిస్, మెరెడిత్ ఎంచక్కా వాటిని లాగించేశారు. రుచి కాస్త భిన్నంగా ఉన్నా పర్లేదులే అనుకుంటూ తినేశారు. అయితే, ఆఖర్లో అసలు విషయాన్ని బయటపెట్టాడు క్రేజీ తిలక్. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. పర్లేదు ఇది మింట్ ఫ్లేవర్ బిస్కట్ అనుకున్నా. ఏదమైనా దంతాలకు ఇది మంచిదేగా అంటూ డేవిడ్, మెరెడిత్ నవ్వుతూ వ్యాఖ్యానించడం విశేషం.
ఈ ప్రాంక్ వీడియోను ముంబై తమ సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇందుక స్పందించిన నెటిజన్లు.. ‘‘వామ్మో తిలక్ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా! ఏదేమైనా మీ మధ్య అనుబంధం.. ముఖ్యంగా బ్రెవిస్‌తో నీ స్నేహబంధం ముచ్చటగొలుపుతోంది’’అని కామెంట్లు చేస్తున్నారు. కాగా అండర్-19 భారత జట్టులో సభ్యుడైన తిలక్ వర్మను ముంబై మెగా వేలం-2022లో 1.7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. తద్వారా మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అతడికి ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం లభించింది.
చదవండి👉🏾 Sanju Samson: ఆరోజు పిచ్చిపట్టినట్లయింది.. బ్యాట్ విసిరేసి వెళ్లిపోయా.. రాత్రి వచ్చి చూస్తే