Who Will Win IPL 2022: క్యాష్ రిచ్‌లీగ్ ఐపీఎల్-2022 సీజన్‌లో ఇప్పటికే సగం కంటే ఎక్కువ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. తాజా ఎడిషన్‌లో జరగాల్సిన 70 మ్యాచ్‌లలో 39 మ్యాచ్‌లు ముగిశాయి. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై వరుసగా ఎనిమిది మ్యాచ్‌లలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండగా.. గతేడాది విజేత అయిన చెన్నై సూపర్‌కింగ్స్ సైతం ఎనిమిదింటిలో కేవలం రెండింట గెలిచి తొమ్మిదో స్థానానికే పరిమితం అయ్యింది.
కొత్త జట్లా మజాకా!
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లుగా పేరొందిన ముంబై, చెన్నై పరిస్థితి ఇలా ఉంటే.. ఈ సీజన్‌తో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి. టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో ఎనిమిదింట 5 విజయాలతో 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.
ఇక రిటెన్షన్ సమయంలో ముంబై వదులుకున్న హార్దిక్ పాండ్యా గుజరాత్ కెప్టెన్‌గా నియమితుడై అదరగొట్టే ప్రదర్శనతో జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఒకే ఒక్కటి ఓడిన గుజరాత్ 12 పాయింట్లతో టాప్-2లో కొనసాగుతోంది.
అనూహ్యంగా పుంజుకుని.. అట్లుంటది మరి సన్‌రైజర్స్‌తోని..
ఈ రెండు కొత్త జట్ల సంగతి ఇలా ఉంటే.. మెగా వేలం-2022 సమయంలో ఆటగాళ్ల ఎంపిక సమయంలో తీవ్ర విమర్శల పాలైన సన్‌రైజర్స్ యాజమాన్యానికి.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ వరుస విజయాలతో ఊరట కలిగిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఎస్‌ఆర్‌హెచ్ వరుసగా ఐదు గెలిచి 10 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నెట్ రన్‌రేటు పరంగానూ పటిష్ట స్థితి(0.691)లో నిలిచింది. ఇదిలా ఉంటే.. ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని ఆర్సీబీ 9 మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లు సాధించి ఐదోస్థానంలో ఉంది.
రాజస్తాన్‌కు తిరుగులేదు!
ఇక గత సీజన్‌లో నామమాత్రపు ప్రదర్శనకే పరిమితమై ఆఖరి నుంచి రెండో స్థానంలో నిలిచిన రాజస్తాన్ రాయల్స్ జట్టు ఈసారి మాత్రం అంచనాలకు మించి రాణిస్తోంది. జోస్ బట్లర్ సహా కెప్టెన్ సంజూ శాంసన్ ఇతర బ్యాటర్లకు తోడు బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఆరు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
కాగా ఇప్పటి వరకు టాప్-5లో ఉన్న ఈ జట్లు ఇలాగే ముందుకు సాగితే వీటి మధ్య ప్లే ఆఫ్స్ కోసం తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది. ప్రస్తుత గణాంకాల ఆధారంగా రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్‌జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఢిల్లీ బెటర్!
ఇక మిగిలిన జట్లలో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ పటిష్ట స్థితిలో ఉంది. రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ నెట్ రన్ రేటు పరంగా అన్ని జట్ల కంటే మెరుగ్గా(0.715) ఉంది. ఇక ముంబైకి ప్లే ఆఫ్స్ దారులు దాదాపు మూసుకుపోగా.. చెన్నై మిగిలిన 6 మ్యాచ్‌లలో విజయం సాధిస్తే గనుక రేసులో ఉండే ఛాన్స్ ఉంది.
ఆ మూడు జట్లే ఫేవరెట్!
ఐపీఎల్-2022 విజేతగా నిలిచే అవకాశం రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్‌కే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. పాయింట్ల పరంగా పటిష్ట స్థితిలో ఉన్న ఈ మూడు జట్ల ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్ పరిగణనలోకి తీసుకుంటే రాజస్తాన్ ఈ రెండింటి కంటే ఓ అడుగు ముందే ఉంది.
రాజస్తాన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న జోస్ బట్లర్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే 3 సెంచరీలు సాధించిన ఈ ఇంగ్లండ్ బ్యాటర్ ఆడిన 8 మ్యాచ్‌లలో కలిపి 499 పరుగులు(అత్యధిక స్కోరు 116) చేసి ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు.
ఇక రాజస్తాన్ కీలక బౌలర్ యజువేంద్ర చహల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది ఆర్సీబీకి ఆడిన అతడు ఈసారి సంజూ బృందంలో చేరాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 18 వికెట్లు తన ఖాతాలో వేసుకుని పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.
ఇక అత్యధిక పరుగుల వీరుల జాబితాలో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్(368 పరుగులు) బట్లర్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించగా.. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 295 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శిఖర్ ధావన్ టాప్-3లో నిలిచాడు. అయితే, ఐపీఎల్ అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కాస్త కష్టమే! ఒక్క మ్యాచ్ చాలు జట్ల రాత మార్చడానికి!
ప్లే ఆఫ్స్ వేదికలు ఇవే
ఐపీఎల్-2022 సీజన్‌లో ముంబై అత్యధిక మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. పుణెలోనూ కొన్ని మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇక మే 24, 26 తేదీల్లో క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు మాత్రం కోల్‌కతాలో జరుగనున్నాయి. అదే విధంగా మే 27న జరగనున్న క్వాలిఫయర్ 2తో పాటు.. మే 29న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. మరి ఏ జట్టు విజేతగా నిలుస్తుందో మీ అంచనాను పోల్ రూపంలో తెలియజేయండి!
చదవండి👉🏾 Virat Kohli: ఐపీఎల్ నుంచి తప్పుకో.. కోహ్లి ఒక్కడే కాదు.. వాళ్లు కూడా: రవిశాస్త్రి
Comments
Please login to add a commentAdd a comment