గుజరాత్ టైటాన్స్ గెలుపు సంబరాలు(PC: IPL/BCCI)
‘విజయం అయితే మీది... ఓటమి ఎదురైతే అది నాది’... ఐపీఎల్‌లో తొలిసారి బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ టీమ్ జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా హార్దిక్ పాండ్యా తన సహచరులతో చెప్పిన మాట ఇది. హార్దిక్‌కు ఐపీఎల్ టైటిల్స్ కొత్త కాదు. ఆటగాడిగా ముంబై ఇండియన్స్ తరఫున అతని ముద్ర ఎంతో ప్రత్యేకం. కానీ నాయకుడిగా ఇదే మొదటి అవకాశం.
టీమ్‌కు ఒక ముఖచిత్రంలా ‘తమవాడు’ కావాలని గుజరాత్ యాజమాన్యం హార్దిక్‌ను కెప్టెన్‌గా పెట్టుకుంది తప్ప... గతంలో ఏనాడూ ఏ స్థాయిలోనూ సారథ్యం చేసిన అనుభవం లేని హార్దిక్ ఐపీఎల్ టీమ్‌ను ఎలా నడిపించగలడని అప్పుడే వినిపించింది. పైగా గత రెండేళ్లుగా వరుస గాయాలతో బాధపడుతూ అతను చాలా కాలంగా ఆటకు దూరంగా ఉండటంతో పాటు భారత జట్టులోకి కూడా వస్తూ, పోతూ ఉన్నాడు.
ఇలాంటి స్థితి నుంచి మొదలు పెట్టి సమర్థ నాయకత్వంతో టైటాన్స్‌కు వరుస విజయాలు అందించడమే కాదు ఏకంగా టైటిల్‌ను కూడా అందించిన పాండ్యాను ఎంత ప్రశంసించినా తక్కువే. ఎంతో మంది స్టార్లకు కూడా సాధ్యం కాని రీతిలో ఐపీఎల్ ట్రోఫీని గెలిపించి అతను తన స్థాయిని గొప్పగా ప్రదర్శించాడు. మొత్తం లీగ్‌లో బ్యాటింగ్‌లో 131.26 స్ట్రయిక్‌రేట్‌తో 487 పరుగులు చేయడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు (మొత్తం 8) పడగొట్టి ఆల్‌రౌండర్‌గా హార్దిక్ తనేంటో రుజువు చేశాడు.
అయితే దానికి మించి అతని కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భారత్ తరఫున ఆడుతూ ధోని నాయకత్వంలో కెరీర్‌లో పురోగతి సాధించిన హార్దిక్ ఐపీఎల్‌లో ధోని శైలిని గుర్తుకు తెచ్చాడంటే అతిశయోక్తి కాదు. 16 మ్యాచ్‌లలో ఎక్కడా అతను ఒక్కసారి కూడా సంయమనం కోల్పోయినట్లు గానీ మైదానంలో కీలక క్షణాల్లో ఆగ్రహావేశాలు ప్రదర్శించడం గానీ కనిపించలేదు.
సహచరులందరికీ తగిన బాధ్యతలు అప్పగించి ‘మిస్టర్ కూల్’లా ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోయాడు. వ్యూహరచనల్లో గానీ ఆటగాళ్లను సమర్థంగా వాడుకునే ప్రణాళికల్లో గానీ అతను వేసిన ప్రతీ అడుగు సత్ఫలితాలనిచ్చింది. తొలి మ్యాచ్ నుంచి చూస్తే టైటాన్స్ విజయంలో దాదాపు ప్రతీ ఒక్కరి పాత్ర ఉంది. ఎవరో ఒకరిపై ఆధారపడకుండా అందరినీ నమ్మడమే ఆ జట్టుకు సానుకూలాంశంగా మారింది.
హార్దిక్, గిల్, సాహా, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మిల్లర్, షమీ...ఇలా ప్రధాన ఆటగాళ్లంతా టోర్నీలో ఏదో ఒక దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’లుగా నిలిచారంటే సమష్టి ప్రదర్శన ఎలాంటిదో అర్థమవుతుంది. గిల్ (483 పరుగులు), మిల్లర్ (481), సాహా (317) తమ బ్యాటింగ్‌తో కీలకంగా నిలిచారు. ఐపీఎల్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడైన రషీద్ ఖాన్ బౌలింగ్ కూడా గుజరాత్‌కు ప్రత్యేక బలాన్నిచ్చింది.
కేవలం 6.59 ఎకానమీతో అతను 19 వికెట్లు పడగొట్టగా... అనుభవజ్ఞుడైన షమీ (20 వికెట్లు) అండగా నిలిచాడు. తొలి సీజన్‌లో గుజరాత్ వేసిన తొలి బంతికి వికెట్‌తో శుభారంభం చేసిన షమీ... ఆ జట్టు తరఫున చివరి బంతికి వికెట్ తీసి ఘనంగా సీజన్‌ను ముగించాడు. ఫెర్గూసన్ తన వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లపై ప్రభావం చూపించగలిగాడు.
ఫ్రాంచైజీ అండగా నిలిచి ప్రోత్సహించిన యువ ఆటగాళ్లు సాయిసుదర్శన్, అభినవ్ మనోహర్, సాయికిషోర్ ఎక్కడా నిరాశపర్చకుండా తమకు ఇచ్చిన అవకాశాలను సమర్థంగా వాడుకొని జట్టుకు ఉపయోగపడ్డారు. గుజరాత్ చివరి ఓవర్లలో సాధించిన విజయాలో ఈ టోర్నీలో మరో ఎత్తు. ఎనిమిది సార్లు లక్ష్య ఛేదనకు దిగగా, ఏడుసార్లు చివరి ఓవర్లోనే జట్టు విజయం సాధించింది.
3 మ్యాచ్‌లలో ఆఖరి 4 ఓవర్లలో 50కి పైగానే పరుగులు చేయాల్సి వచ్చినా టైటాన్స్ తగ్గలేదు. ఈ ఏడు విజయాల్లో ఐదుసార్లు ఆఖరి ఓవర్లో పదికంటే ఎక్కువ పరుగులే చేయాల్సి రాగా, గుజరాత్ చేసి చూపించింది. పరుగులకంటే ఆ సమయంలో ఆటగాళ్లు చూపించిన ప్రశాంతత, ఒత్తిడికి లోనుకాకుండా ఆడిన తీరు ప్రశంసనీయం.
-సాక్షి, క్రీడా విభాగం
చదవండి: IPL 2022: గుజరాత్ గుబాళింపు
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
.@gujarat_titans - The #TATAIPL 2022 Champions! 👏 👏 🏆 👍
— IndianPremierLeague (@IPL) May 29, 2022
The @hardikpandya7-led unit, in their maiden IPL season, clinch the title on their home ground - the Narendra Modi Stadium, Ahmedabad. 🙌🙌 @GCAMotera
A round of applause for the spirited @rajasthanroyals! 👏 👏 #GTvRR pic.twitter.com/LfIpmP4m2f
Comments
Please login to add a commentAdd a comment