
సురేశ్ రైనా(PC: Raina Twitter)
తప్పిన రైనా జోస్యం.. వాళ్లను ఎవరూ పట్టించుకోలేదు.
IPL 2023 Mini Auction- Suresh Raina: ఐపీఎల్ మినీ వేలం-2023 నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అంచనా తలకిందులైంది. ఈ అన్‌క్యాప్డ్ ప్లేయర్ల కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడతాయంటూ మిస్టర్ ఐపీఎల్ చెప్పిన జోస్యం తప్పింది. రైనా అంచనా వేసిన యువ ఆటగాళ్లలో సౌరాష్ట్ర క్రికెటర్ సమర్థ్ వ్యాస్ తప్ప మిగతా ఇద్దరూ వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయారు.
కాగా ఐపీఎల్ మినీ వేలాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసిన జియో సినిమా షోలో.. ఆక్షన్ ఆరంభానికి ముందు రైనా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటిన జయదేవ్ ఉనాద్కట్, నారాయణ్ జగదీశన్‌పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతాయని అతడు పేర్కొన్నాడు.
వీళ్ల విషయంలో నిజమైంది
అందుకు తగ్గట్లుగానే లక్నో సూపర్ జెయింట్స్ ఉనాద్కట్‌ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేయగా.. నారాయణ్ జగదీశన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ 90 లక్షలు ఖర్చు చేసింది. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్ బౌలర్ జాషువా లిటిస్ కోసం పోటీ నెలకొంటుందని రైనా అంచనా వేయగా.. గుజరాత్ టైటాన్స్ 4.4 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది.
లెక్క తప్పాడు!
వీరితో పాటు.. బెన్ స్టోక్స్, సామ్ కరన్ విషయంలో అందరిలానే రైనా అంచనాలూ నిజమయ్యాయి. కానీ అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల విషయంలో మాత్రం మిస్టర్ ఐపీఎల్ లెక్క తప్పింది. జమ్మూ కశ్మీర్ ఆల్‌రౌండర్ ముజ్తాబా యూసఫ్ అమ్ముడుపోకుండా మిగిలి పోయాడు. అంతేగాక ఈ వేలంలో సూపర్‌స్టార్‌గా నిలవగల సత్తా ఉందని రైనా అంచనా వేసిన అల్లా అహ్మద్‌ను ఎవరూ పట్టించుకోలేదు.
మిస్టర్ ఐపీఎల్ జోస్యంపై కామెంట్లు
వేలంలో పేరు నమోదు చేసుకున్న అత్యంత పిన్న వయస్కుడైన 15 ఏళ్ల ఈ అఫ్గనిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఇక సమర్థ్ వ్యాస్‌ను 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు రైనా జోస్యంపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘వాళ్ల విషయంలో మిస్టర్ ఐపీఎల్ అంచనాలు నిజమయ్యాయి. కానీ సూపర్‌స్టార్ అన్న విషయంలో మాత్రం లెక్క తప్పాడు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
చదవండి: IPL Mini Auction: ఐపీఎల్ 2023 మినీ వేలం.. అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా
IPL: వేలంలో అమ్ముడుపోయిన ప్లేయర్లు, పదింటిలో ఏ జట్టులో ఎవరు? ఇతర వివరాలు.. అన్నీ ఒకేచోట
Ind Vs Ban: అయ్యో పంత్.. సెంచరీ మిస్! అయితేనేం ధోని 15 ఏళ్ల రికార్డు బద్దలు! సాహా తర్వాత..