IPL 2023: CSK Star Pacer Sisanda Magala Set To Be Ruled Out For Two Weeks - Sakshi
Sakshi News home page

IPL 2023: చెన్నై సూపర్‌ కింగ్స్‌కు వరుస ఎదురుదెబ్బలు.. మరో స్టార్‌ ప్లేయర్‌ ఔట్‌

Published Thu, Apr 13 2023 12:28 PM | Last Updated on Thu, Apr 13 2023 12:38 PM

IPL 2023: CSK Suffer Blow As Star Pacer Magala Set To Be Ruled Out For Two Weeks - Sakshi

ఐపీఎల్‌ 2023 సీజన్‌లో ఫోర్‌ టైమ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయాల కారణంగా ఇప్పటికే దీపక్‌ చాహర్‌, సిమ్రన్‌జీత్‌ సింగ్‌, బెన్‌ స్టోక్స్‌, ముకేశ్‌ చౌదరీ సేవలు కోల్పోయిన (తాత్కాలికంగా) ఆ జట్టుకు తాజాగా మరో బిగ్‌ షాక్‌ తగిలింది. నిన్న (ఏప్రిల్‌ 12) రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా స్టార్‌ పేసర్‌, సఫారీ భారీ కాయుడు సిసండ మగాలా ఫీల్డింగ్‌ చేస్తూ కుడి చేతి వేలికి దెబ్బ తగిలించుకున్నాడు. గాయం తీవ్రత​ అధికంగా ఉండటంతో అతను మరో రెండు వారాలు లీగ్‌కు దూరంగా ఉంటాడని జట్టు కోచ్ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ పోస్ట్‌ మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో చెప్పాడు.

అసలే అంతంత మాత్రంగా ఉన్న సీఎస్‌కే పేస్‌ విభాగం.. మగాలా సేవలు కూడా కోల్పోవడంతో దిక్కుతోచని స్థితి​కి చేరింది. ఆ జట్టుకు పేస్‌ విభాగంలో మరో ఆప్షన్‌ కూడా లేదు. దేశీయ పేసర్లు, అంతగా అనుభవం​ లేని హంగార్గేకర్‌, తుషార్‌ దేశ్‌ పాండే, ఆకాశ్‌సింగ్‌లతో తదుపరి మ్యాచ్‌ల్లో నెట్టుకురావాల్సి ఉంటుంది. డ్వేన్‌ ప్రిటోరియస్‌, మతీష పతిరణ లాంటి విదేశీ పేస్‌ బౌలింగ్‌ ఆప్షన్స్‌ ఉన్నా జట్టు సమీకరణల దృష్ట్యా వీరికి తుది జట్టులో అవకాశం లభించడం కష్టం. తదుపరి మ్యాచ్‌ సమయానికంతా బెన్‌ స్టోక్స్‌ కోలుకున్నా అతను బౌలింగ్‌ చేయలేని పరిస్థితి. ఐపీఎల్‌కు ముందే తాను బౌలింగ్‌ చేయలేనని, కేవలం బ్యాటర్‌గా అందుబాటులో ఉంటానని స్టోక్స్‌ చెప్పాడు.

ఇలాంటి పరిస్థితుల్లో, కేవలం బ్యాటింగ్‌ వనరుల సాయంతో సీఎస్‌కే నెగ్గుకురావడం దాదాపుగా అసాధ్యం. గాయాల బారిన పడిన పేసర్లు మరో రెండు వారాల్లో అందుబాటులోకి వచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతే చేసేదేమీ ఉండదు. పేస్‌ బౌలింగ్‌ విభాగం విషయంలో సీఎస్‌కే ఆల్టర్నేట్‌ ఆప్షన్స్‌ చూసుకోకపోతే చాలా కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ధోని మోకాలి గాయం ఆ జట్టును మరింత కలవరపెడుతుంది. గాయం పెద్దదేమీ కాదని కోచ్‌ చెప్తున్నప్పటికీ లోలోపల ఆ జట్టు ఆందోళన చెందుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

కాగా, రాజస్థాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 3 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు సాధించగా.. ఛేదనలో చెన్నై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులు చేసి ఓటమిపాలైంది.  ఆఖర్లో రవీంద్ర జడేజా (15 బంతుల్లో 25 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు), ధోని (17 బంతుల్లో 32; 1 ఫోర్, 3 సిక్స్‌లు) చెన్నైను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement