IPL 2023 CSK Vs DC: Probable Playing XI, Strengths And Weaknesses Of Teams - Sakshi
Sakshi News home page

IPL 2023 CSK Vs DC: పటిష్ట చెన్నై జట్టుతో ఢిల్లీ పోటీ! తుది జట్టులో..

Published Wed, May 10 2023 3:44 PM | Last Updated on Thu, May 11 2023 9:55 AM

IPL 2023 CSK Vs DC: Probable Playing XI Strength Weakness Of Teams - Sakshi

ఢిల్లీ వర్సెస్‌ సీఎస్‌కే (PC: IPL/BCCI)

IPL 2023 CSK Vs DC: సమ్మర్ ఎంటర్టైనర్  ఐపీఎల్‌-2023లో మరో సూపర్ వార్కు వేదిక కానుంది చెన్నైలోని చిదంబరం స్టేడియం. సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్పై సునాయాసంగా గెలవగా.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై విజయం సాధించింది. దీంతో ఇరు జట్ల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారింది. 

ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల బలాబలాలను ఒకసారి పరిశీలించి చూసినట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్‌ కంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకే ఈ మ్యాచ్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. 

బలాబలాలు... 
సొంతమైదానంలో చెన్నై
వివరాల్లోకి వెళ్తే...  ఈ మ్యాచ్ చెన్నై సొంతగడ్డ మీద సొంత అభిమానుల మధ్య జరగనుంది. రుతురాజ్  గైక్వాడ్, డెవాన్  కాన్వే రూపంలో  బలమైన ఓపెనింగ్, మొయిన్ అలీ, శివమ్ దూబే, జడేజా వంటి ఆటగాళ్లతో డెత్ ఓవర్లలో మంచి స్కోర్లు సాధించగల మిడిలార్డర్, ధోనీ వంటి  అద్భుత ఫినిషర్ ఇవన్నీ జట్టుకు కలిసొచ్చే అంశాలు. ఎటొచ్చి చెన్నై బౌలర్ల అనుభవ రాహిత్యం ఒక్కటే ఆ జట్టును వేధిస్తున్న సమస్య.  

ఢిల్లీకి వాళ్లే బలం
ఇక ఢిల్లీ జట్టు విషయానికి వస్తే మిచెల్ మార్ష్, అక్షర్ పటేల్ అత్యంత నాణ్యమైన ఆల్ రౌండర్లు ఆ జట్టుకు ప్రధాన బలం. డేవిడ్ వార్నర్, ఫిలిప్ సాల్ట్ ల ఓపెనింగ్ జోడీ కూడా కుదిరింది కాబట్టి ఢిల్లీ టాపార్డర్ ప్రమాదకరంగానే కనిపిస్తోంది. కుల్దీప్  యాదవ్, అక్షర్ పటేల్ ఉన్నారు కాబట్టి ఢిల్లీ స్పిన్ విభాగం అత్యంత పటిష్టంగానే ఉంది. ఇశాంత్ శర్మ సారధ్యంలోని ఫాస్ట్ బౌలింగ్ బృందం కూడా బలంగానే ఉంది. 

రెండు జట్లలోనూ స్పిన్ బలగం సమానంగానే ఉంది. ఫాస్ట్ బౌలింగ్ విభాగం  కూడా ఇరుజట్లలోనూ సమానంగానే ఉన్న నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగానే కొనసాగే అవకాశముంది. 

అత్యుత్తమ ఫామ్‌లో
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రధానబలం ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఇదే అతడికి చివరి ఐపీఎల్ సీజన్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జట్టు అతడికి ఐపీఎల్ టైటిల్ ను కానుకగా ఇవ్వాలని జట్టు మొత్తం కలిసికట్టుగా ఆడుతోంది.

చెన్నై ఓపెనర్లు రుతురాజ్  గైక్వాడ్, డెవాన్ కాన్వే లు అత్యుత్తమ ఫామ్లో కొనసాగుతున్నారు. అజింక్యా రహానే, శివం  దూబే లు కూడా ఈ సీజన్లో చెలరేగి ఆడుతున్నారు. మిగిలార్డర్‌లో మొయిన్ అలీ, రవీంద్ర జడేజాల తోపాటు ధోనీ కూడా ఉండటంతో చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది.

ఇక బౌలింగ్లో శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణ ఈ సీజన్లో చెన్నై విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అతడికి భారత యువ పేసర్ తుషార్ దేశ్ పాండే నుంచి చక్కటి సహకారం లభిస్తుండటంతో ఈ ద్వయం ఇప్పటివరకు బాగానే రాణించింది. అలాగే దీపక్ చాహర్ కూడా తిరిగి వచ్చాడు కాబట్టి చెన్నై బౌలింగ్ బృందం కూడా అసాధారణంగానే ఉంది. 

ఢిల్లీ క్యాపిటల్స్ ఇలా 
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గత మ్యాచ్లో రాయల్ ఛాలంజర్స్ బెంగుళూరు జట్టుపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సరైన సమయంలో ఢిల్లీ ఓపెనింగ్ బ్యాట్సమెన్ ఫిలిప్ సాల్ట్ ఫామ్ అందుకోవడం ఢిల్లీ జట్టుకు శుభపరిణామం. డేవిడ్ వార్నర్ తో కలిసి ఫిలిప్ సాల్ట్ మరోసారి చెలరేగితే చెన్నై జట్టుకు కష్టాలు తప్పవు.

ఓపెనింగ్ జోడీ విఫలమైనా  వారి తర్వాత జట్టును ఆదుకునేందుకు టాపార్డర్లో  మిచెల్ మార్ష్, రైలీ రసోవ్, మనీష్ పాండేలు  ఉండనే ఉన్నారు. మిడిలార్డర్లో  అక్షర్ పటేల్, అనం హకీమ్ ఖాన్ లు బ్యాటింగుకు ఊతంగా నిలవనున్నారు.

ఇక బౌలింగ్ విభాగంలో ఇషాంత్‌ శర్మ , ఖలీల్ అహ్మద్ రూపంలో అపార ఐపీఎల్ అనుభవమున్న ఫాస్ట్ బౌలర్లకు తోపాటు ముఖేష్ కుమార్ కూడా ఫాస్ట్ బౌలర్లుగా వ్యవహరిస్తారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ కు స్పిన్ జోడీగా కొనసాగుతారు.      

ఎవరికి ప్రయోజనం...?
పాయింట్ల పట్టికలో 13 పాయింట్లతో  రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ 8 పాయింట్లతో అట్టడుగు స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరగబోయే ఈ మ్యాచ్లో రెండు జట్లకూ గెలుపు ముఖ్యమే. మరో మ్యాచ్ కోసం ఎదురుచూడకుండా ఈ మ్యాచ్ లోనే ప్లే ఆఫ్స్  బెర్తు ఖాయం చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్.

ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్నా వారికి  కూడా ప్లే ఆఫ్స్ చేరుకునే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఢిల్లీ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్లలో గెలిస్తే వారు కూడా 16 పాయింట్లతో నిలిచి రన్  రేట్ ఆధారంగా టాప్ ఫోర్లోకి వచ్చినా రావచ్చు.

ముఖాముఖి పోరులో
ఇప్పటి వరకు ముఖాముఖి తలపడిన ఇరవై ఏడు సందర్భాల్లో సీఎస్‌కే 17 మ్యాచ్‌లలో విజయాలతో ఆధిక్యంలో ఉంది. ఢిల్లీ పదింట గెలిచింది. ఇక చెన్నైలో వర్షం పడే సూచనలేమీ కనిపించడం లేదు.

తుదిజట్ల అంచనా
సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోని (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే.

ఢిల్లీ క్యాపిటల్స్‌: డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), ఫిల్ సాల్ట్ (వికెట్‌ కీపర్‌), మిచెల్ మార్ష్, రిలీ రోసోవ్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.

చదవండి: Virat Kohli: చిల్లర వేషాలు మానుకో! లేదంటే ఐపీఎల్‌లోనే లేకుండా పోతావ్‌!
MI Vs RCB: కాలం మారుతుంది! సూర్య అవుట్‌ కాగానే దగ్గరికి వచ్చిన కోహ్లి.. వీడియో వైరల్‌
ఆర్సీబీకి పట్టిన దరిద్రం.. ఇకనైనా అతడిని వదిలేయండి! లేదంటే మీ కర్మ!       

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement