వర్షం కారణంగా గుజరాత్, చెన్నై జట్ల మధ్య నిన్న జరగాల్సిన ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే (మే 29)కు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా, సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను చూసి మాత్రం గుజరాత్ టైటాన్స్ వణికిపోతుంది. అందుకు కారణం గుజరాత్‌పై రుతురాజ్‌కు ఉన్న రికార్డు. ఈ సీఎస్‌కే ఓపెనర్ ఐపీఎల్‌లో గుజరాత్‌తో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 4 అర్ధ సెంచరీలు బాదాడు.
క్వాలిఫయర్-1లో 44 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 60 పరుగులు చేసిన రుతు.. ఈ సీజన్ ఓపెనర్‌లో 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అంతకుముందు సీజన్‌లో తొలి మ్యాచ్‌లో 48 బంతుల్లో 73 పరుగులు చేసిన గైక్వాడ్.. ఆ తర్వాతి మ్యాచ్‌లో 49 బంతుల్లో 53 పరుగులు చేశాడు.
మొత్తంగా రుతురాజ్ ఐపీఎల్‌లో గుజరాత్‌తో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 4 అర్ధసెంచరీలు సాధించి 278 పరుగులు స్కోర్ చేశాడు. ఐపీఎల్‌లో మరే ఆటగాడు గుజరాత్‌పై ఇన్ని పరుగులు చేయలేదు. రుతురాజ్ తర్వాత విరాట్ కోహ్లి అత్యధికంగా గుజరాత్‌పై 232 పరుగులు సాధించాడు. నేటి ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇదే రికార్డు గుజరాత్ బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.
ఒకవేళ మ్యాచ్ పూర్తి ఓవర్లు సాధ్యపడితే, రుతురాజ్‌ను ఔట్ చేయడం వారికి తలకు మంచిన పనే అవుతుంది. ఈ సీజన్ క్వాలిఫయర్-1 మినహాంచి, గత సీజన్‌లో రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్‌నే విజయం వరించినప్పటికీ, రుతురాజ్ విషయంలో వారికి ప్రత్యేక ప్రణాళికలు లేకపోతే మూల్యం తప్పించుకోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత లీగ్‌లో ఏడో టాప్ స్కోరర్‌గా (15 మ్యాచ్‌ల్లో 146.88 స్ట్రయిక్ రేట్‌తో 564 పరుగులు, 4 హాఫ్‌సెంచరీలు) ఉన్న రుతురాజ్‌ను గుజరాత్ బౌలర్లు ఎలా కంట్రోల్ చేస్తారో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే, ఇవాళ జరగాల్సిన ఫైనల్ మ్యాచ్‌కు మరోసారి వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. అహ్మదాబాద్‌లో ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం వేళ జల్లులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించేందుకు విశ్వ ప్రయత్నాలన్నీ చేస్తారు. 20 ఓవర్ల నుంచి 15 ఓవర్లు లేదా 10 ఓవర్లు లేదా 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరిపేందుకు కృషి చేస్తారు. చివరకు అదీ సాధ్యం కాకపోతే చివరి ప్రయత్నంగా ‘సూపర్ ఓవర్’తోనైనా ఫలితాన్ని తేల్చేందుకు చూస్తారు. అయితే దానికీ అవకాశం లేకపోతే మాత్రం లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. అప్పుడు గుజరాత్ టైటాన్స్ చాంపియన్‌గా నిలుస్తుంది.
చదవండి: IPL 2023: 'రిజర్వ్ డే'కు ఫైనల్ మ్యాచ్.. ధోని రిటైర్మెంట్‌కు సంకేతమా..?
Comments
Please login to add a commentAdd a comment